ఆలయాలపైనా అరాచకాలే!

కోట్లాది భక్తుల మనోభావాలనూ తన కుటిల రాజకీయ క్రీడలో పావులుగా మార్చుకొని ముఖ్యమంత్రి పీఠానికి ఎగబాకిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. తిరుమలలో శ్రీవారికి రాయలవారు సమర్పించిన పింక్‌ వజ్రం ఆచూకీ గల్లంతుకు చంద్రబాబు సర్కారే కారణమంటూ గత ఎన్నికలముందు కట్టుకథలతో వైకాపా రెచ్చిపోయింది.

Published : 28 Mar 2024 00:32 IST

కోట్లాది భక్తుల మనోభావాలనూ తన కుటిల రాజకీయ క్రీడలో పావులుగా మార్చుకొని ముఖ్యమంత్రి పీఠానికి ఎగబాకిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. తిరుమలలో శ్రీవారికి రాయలవారు సమర్పించిన పింక్‌ వజ్రం ఆచూకీ గల్లంతుకు చంద్రబాబు సర్కారే కారణమంటూ గత ఎన్నికలముందు కట్టుకథలతో వైకాపా రెచ్చిపోయింది. తీరా అలాంటి వజ్రమేదీ లేదని రూఢి అయ్యాక ప్రజాక్షేత్రంలో అబద్ధాలు ఆడినవాళ్లకు కోర్టులో రక్షణగా జగన్‌ సర్కారే నిలబడింది! రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం కొలువై ఉండగా, సనాతన ధర్మానికి ఆయువుపట్టుగా నిలిచిన ఆలయాలకు, వాటితో ముడివడిన అశేష భక్తుల విశ్వసాలకూ కనీస భద్రతే కరవైంది. ఏపీలో 24,500 ఆలయాలు, 130 మఠాలు ఉన్నాయి. దేవాదాయశాఖ ద్వారా వాటిపై అనుచిత పెత్తనం వెలగబెడుతున్న రాష్ట్ర సర్కారు- వందలాది గుడులపై జరిగిన దాడుల్నీ చూసీచూడనట్లుగా వదిలేసింది. అంతర్వేదిలో స్వామివారి దివ్యరథాన్ని దహనం చేసిన దురాకృతం, రామతీర్థంలో సీతారామస్వామి విగ్రహం శిరస్సు ఖండించిన దురాగతం వంటివి విచ్చలవిడిగా సాగినా, దోషులకు దండన సంగతి దేవుడెరుగు... అసలు ద్రోహుల్నే ప్రభుత్వం పట్టుకున్న పాపాన పోలేదు.  మరోవంక సింహాచలం, అహోబిలం దేవస్థానాలపై సొంతపెత్తనం రుద్దడానికి తాపత్రయపడిన జగన్‌ సర్కారుకు హైకోర్టులో తల బొప్పికట్టింది. 12716 ఎకరాల భూములున్న మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానాలకు ఆనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌గజపతిరాజుపై రాజకీయ కక్షతో జగన్‌ ఎంతగా దిగజారి ప్రవర్తించిందీ అందరికీ తెలిసిందే. ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక దర్శనం, పూజల ధరలను దారుణంగా పెంచేసిన ప్రభుత్వం భక్తుల్ని నిలువుదోపిడీ చేస్తోంది. వివిధ నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వైకాపా పెద్దల్ని ముద్దుచేసి ఆలయ ధర్మకర్తలుగా నియమించింది. ఈ అరాచకానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది!

సత్యం వధ (సత్యాన్ని వధించు), ధర్మం చెర (ధర్మాన్ని చెరపట్టు) అన్నదే జగన్‌ ప్రభుత్వ ఫిలాసఫీ. దాన్ని అణువణువునా జీర్ణించుకున్న వైకాపా మూకల అరాచకం ఆలయ మర్యాదల్ని మంటగలుపుతోంది. కాకినాడలోని శివాలయంలో మాజీ కార్పొరేటర్‌ గుడిలో బూతుపురాణం లంకించుకొని, అర్చకుల్ని కాలితో తన్ని దవడపై కొట్టిన వైనం చాలు- రాక్షసశక్తులు ఎలా రెచ్చిపోతున్నాయో తెలుసుకోవడానికి! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సొమ్ముతో దేవాదాయ శాఖే జగన్‌కు మళ్ళీ అధికారం దక్కడానికి నిరుడు రాజశ్యామల యాగం చేయించింది. అదే శాఖ- శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని రెండు పర్యాయాలు వాయిదా వేసింది. దక్షిణాయనంలో మహా కుంభాభిషేకం జరిపితే ప్రభుత్వాధినేతకు పదవీగండం అని ఓ స్వామీజీ చెప్పిన మాట విని- స్వామివారి సేవకే ఎగనామం పెట్టిన ప్రభుత్వమిది! తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డును ప్రత్యేక ఆహ్వానితుల పుష్పక విమానంలా మార్చి జగన్‌ తెచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. తిరుపతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు తితిదే నిధుల్ని రూ.100కోట్లు కేటాయించిన తప్పుడు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం నిష్కర్షగా తోసిపుచ్చింది. అయినా అనేక ఆలయాల్లో సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) నిధుల్ని పాత ఆలయాల పునరుద్ధరణకు వినియోగించాల్సి ఉండగా వాటినీ అడ్డగోలుగా వాడేస్తున్నారు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలు, మఠాలు, సత్రాలు, వివిధ సంస్థలకు చెందిన భూముల్లో 1.19లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిని కాపాడతామంటూ నిరుడు హడావుడిగా ఆర్డినెన్స్‌ జారీచేసి, అదే ఊపులో చట్ట సవరణ కూడా చేసిన ప్రభుత్వం- ఎన్నికల ఏడాదిలో చట్టం అమలులో చూసీచూడనట్టు ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దేవుని మాన్యాలపై కన్నేసిన రాబందులకు అనుకూలంగా అధికారశ్రేణులు పనులు చక్కపెడుతున్నట్లు విరివిగా వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని విధాలుగా దేవుళ్ల నెత్తినే భస్మాసుర హస్తం పెట్టిన అరాచక ప్రభుత్వం ఇది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు