ఆనకట్టలపై అంతులేని అలక్ష్యం

వృథాగా సముద్రం పాలయ్యే నదీజలాలను బీడు పొలాలకు మళ్ళించే ఆనకట్టలు- కోట్ల మంది ఆకలి వెతలను తీరుస్తున్నాయి. తాగునీటి కోసం అలమటించే జనావాసాల గొంతు తడుపుతూ అవి ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్నాయి.  వరదల నియంత్రణ, విద్యుదుత్పత్తిలోనూ డ్యాములు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Updated : 28 Mar 2024 10:09 IST

వృథాగా సముద్రం పాలయ్యే నదీజలాలను బీడు పొలాలకు మళ్ళించే ఆనకట్టలు- కోట్ల మంది ఆకలి వెతలను తీరుస్తున్నాయి. తాగునీటి కోసం అలమటించే జనావాసాల గొంతు తడుపుతూ అవి ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్నాయి.  వరదల నియంత్రణ, విద్యుదుత్పత్తిలోనూ డ్యాములు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతి సౌభాగ్యానికి ఆలవాలాలైన ఆ బృహత్‌ నిర్మాణాల నిర్వహణ కట్టుతప్పితే పర్యవసానాలు పరమఘోరంగా ఉంటాయి. నాలుగున్నర దశాబ్దాల క్రితం గుజరాత్‌లోని మచ్ఛు డ్యాం వైఫల్యం ఇరవై వేల నిండు ప్రాణాలను బలితీసుకుంది. స్వాతంత్య్రానంతరం అటువంటి నలభై దుర్ఘటనలను భారతావని చవిచూసింది. ఆనకట్టలు కూలిపోతే- జననష్టం, ఆస్తినష్టం విపరీతంగా సంభవించడంతో పాటు పర్యావరణమూ తీవ్రంగా ప్రభావితమవుతుంది. కాలంచెల్లిన నిర్మాణాలు, నిర్వహణ లోపాల వంటివాటితో దేశీయంగా డ్యాముల భద్రతపై ఆందోళనలు ముప్పిరిగొంటున్నాయి. పరిమితికి మించి వరదనీరు పోటెత్తడంతో నాగార్జున సాగర్‌లో స్పిల్‌వే గ్లేసియస్‌ పలు చోట్ల దెబ్బతింది. కొన్ని పియర్స్‌ బీటలువారాయి. వర్షాకాలంలోగా వాటికి మరమ్మతులు పూర్తిచేయాలని నిపుణుల కమిటీ తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల డ్యాములు ఉన్నాయి. వాటిలో శతాబ్ద కాలం కిందటివి 234. తెలుగు రాష్ట్రాల్లో వందేళ్లు పైబడిన ఆనకట్టలు 27 వరకు లెక్క తేలుతున్నాయి. నిర్మితమై యాభై ఏళ్లు దాటిన ఆనకట్టల్లో సాధారణంగా సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాజ్య సమితి పరిశోధన గతంలో వెల్లడించింది. దెబ్బతిన్న ఆనకట్టలకు కాలానుగుణంగా సరైన మరమ్మతులు నిర్వహించి జాగ్రత్తగా కాచుకోవడం సర్కారీ యంత్రాంగం కర్తవ్యం. ప్రజాభద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన పాత డ్యాములను జాగ్రత్తగా తొలగించడంలో అమెరికా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అటువంటి విధానాలను అధ్యయనం చేసి, దేశీయ పరిస్థితులకు వాటిని అన్వయించడంలో పాలకులు సత్వరం దృష్టి సారించాలి!

ఆనకట్టల సంఖ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికాల తరవాతి స్థానం ఇండియాదే. దేశీయంగా 2050 నాటికి యాభై ఏళ్లు పూర్తిచేసుకోబోయే డ్యాములు వెయ్యికి పైగా ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షాలు ముమ్మరించి వరదలు విరుచుకుపడి ఆనకట్టలను ముంచెత్తే ముప్పు పొంచి ఉన్నట్లు పరిశీలనలు చాటుతున్నాయి. 2018లో కట్టలుతెంచుకున్న భారీ వరద-కేరళలోని ముళ్లపెరియార్‌ ఆనకట్ట భద్రతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. వందేళ్లలో కనీవినీ ఎరగని వరద పోటెత్తడంతో 2009లో శ్రీశైలం ఆనకట్ట పైనుంచి వరద నీరు ప్రవహించి, ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఆనకట్టల సంరక్షణ ద్వారా అనర్థాల నివారణకుగాను 2021లో కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చింది. డ్యాముల భద్రతకు సంబంధించి జాతీయ సంఘాన్ని కొలువు తీర్చింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆనకట్టల భద్రతను జగన్‌ సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. నిర్వహణకు వైకాపా సర్కారు నిధులు విదల్చకపోవడంతో గోదావరి జిల్లాలకు ప్రాణదాయని వంటి కాటన్‌ బ్యారేజీ గేట్లు ప్రమాదకర స్థితికి చేరాయి. పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు జగన్‌ ఏలుబడిలోనే కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయి ముప్ఫైకి పైగా ప్రాణదీపాలు ఆరిపోయాయి. ఆ ఉపద్రవంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలెన్నో ఉన్నాయి. ఊళ్ళకు ఊళ్ళే నామరూపాల్లేకుండా పోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జగన్‌ సర్కారు ఆపై ప్రాజెక్టుల భద్రతపై  సమావేశాలు పెట్టి నానా హడావుడి చేసింది. కానీ, ఆ తరవాత డ్యాముల రక్షణకు సరిపడా నిధులు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం తన పాడుబుద్ధిని మళ్ళీ బయటపెట్టుకుంది. ఇటువంటి నేరపూరిత నిర్లక్ష్యమే జనజీవితాలకు ప్రాణాంతకమవుతుంది. జాతి ఆహార భద్రతనూ పెను ప్రమాదంలో పడేస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.