యువ శక్తులకు నవ నైపుణ్యాలు

చదువనేది వ్యక్తి వికాసానికి, ఆపై సరైన బతుకుతెరువుకు ఆధారభూమిక కావాలి. సమర్థ మానవ వనరుల సృజనలో అది కీలకపాత్ర పోషించాలి. వాస్తవంలో కోటి ఆశలతో ఉపాధివేటకు సిద్ధపడుతున్న యువశక్తులు తీవ్ర భంగపాటుకు గురై నిరాశానిస్పృహల్లో కూరుకుపోతున్నాయి.

Published : 29 Mar 2024 00:23 IST

దువనేది వ్యక్తి వికాసానికి, ఆపై సరైన బతుకుతెరువుకు ఆధారభూమిక కావాలి. సమర్థ మానవ వనరుల సృజనలో అది కీలకపాత్ర పోషించాలి. వాస్తవంలో కోటి ఆశలతో ఉపాధివేటకు సిద్ధపడుతున్న యువశక్తులు తీవ్ర భంగపాటుకు గురై నిరాశానిస్పృహల్లో కూరుకుపోతున్నాయి. భారత్‌లో ఉపాధిరహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) వెలువరించిన తాజా నివేదిక- క్షేత్రస్థాయి దురవస్థకు అద్దంపడుతోంది. 2000 సంవత్సరం నాటికి యువతలో 5.7శాతంగా నమోదైన నిరుద్యోగిత, 2019నాటికి 17.5శాతానికి ఎగబాకింది. 2022లో అది 12.1శాతానికి తగ్గిందని ఐఎల్‌ఓతోపాటు మానవాభివృద్ధి సంస్థ (ఐహెచ్‌డీ) చెబుతున్నా, ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నట్లు లెక్క. మొత్తం నిరుద్యోగ శ్రామికశ్రేణిలో ఎకాయెకి 83శాతం యువతేనంటే- దేశానికి కలిమి బలిమి కావాల్సిన అపార శక్తి ఎలా నీరోడుతున్నదో వేరే చెప్పాలా? తెలంగాణలోని 15-29 ఏళ్ల వయస్కుల్లో 30శాతం యువతులు, 18శాతం యువకులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. నిపుణ బోధన సిబ్బంది కొరతనూ అది ప్రస్తావించింది. ఏపీ కళాశాలల్లో బోధకుల సంఖ్య తెగ్గోసుకుపోతున్నట్లు అఖిలభారత ఉన్నత విద్య సర్వే ఇటీవలే స్పష్టీకరించింది. పట్టభద్రుల నిరుద్యోగిత ప్రాతిపదికన బిహార్‌ను తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానాన ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని కేంద్రప్రభుత్వ వార్షిక నివేదిక ధ్రువీకరించింది. ఇప్పుడు అస్సాం, యూపీ ప్రభృత రాష్ట్రాల్లోనూ బోధన సిబ్బందికి క్షామం దాపురించిందంటున్న ఐఎల్‌ఓ నివేదిక- నిరుద్యోగిత మూలాల్ని స్పృశించింది. తమ విద్యార్హతలకు ఏమాత్రం పొంతన కుదరని చిన్నా చితకా కొలువుల్లో అరకొర వేతనాలకు స్నాతకోత్తర పట్టభద్రులు, డాక్టరేట్లు సైతం కుదురుకుంటున్నారు. ఇంతగా నిరుద్యోగిత ప్రకోపిస్తున్నప్పుడు యువరక్తంతో ఉప్పొంగుతున్న ఇండియాయే ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగారమని ఎవరూ సంబరపడే వీల్లేదు!

పనిచేస్తూ చదువుకోవడం, నేర్చుకుంటూ ఎంతో కొంత వెనకేసుకోవడం, కోర్సు పూర్తయ్యేసరికి నూతన నైపుణ్యాలను ఒంటపట్టించుకుని ఉద్యోగార్హత సంపాదించడం... స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా, జర్మనీ, జపాన్‌ తదితర దేశాల్లో సర్వసాధారణం. అటువంటి ఆచరణాత్మక విధానాల జోలికి పోని ఇక్కడ- విద్యార్థులు పేరుకు పట్టాలు రాబడుతున్నారేగాని, సొంతకాళ్లపై నిలబెట్టే నైపుణ్యాలు వారికి అబ్బడంలేదు. ఏటా కోటీ 20లక్షల మంది వరకు పట్టభద్రులు రూపొందుతున్న దేశంలో మూడోవంతు మందికే ఉద్యోగార్హతలు ఉంటున్నాయన్న నివేదిక రెండేళ్లక్రితమే వెలుగుచూసింది. ఆ దురవస్థకు విరుగుడే లేదా? కచ్చితంగా ఉంది! ఉద్యోగార్థులకు, నియామక సంస్థలకు మధ్య అగాథాన్ని పూడ్చటం తక్షణావసరం. రేపటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి వాటిని విద్యార్థులకు అలవరచే కార్యాచరణను పట్టాలకు ఎక్కించాలి. నిజానికి ఈ మార్గాన్ని జాతిపిత ఏనాడో సూచించారు. నయీ తాలిమ్‌ (నూతన అభ్యసన) విధానం పేరిట వృత్తిపరమైన ఒడుపుల్ని అలవరచే చదువుల ఆవశ్యకతను 1937నాటి జాతీయ విద్యాసదస్సులోనే బాపూజీ ఉద్బోధించారు. అటువంటి హితబోధల్ని గాలికొదిలేసి జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) పెరిగిందని, దేశాభివృద్ధికి అదే నిలువుటద్దమని చాటుకుంటే సరిపోతుందా? కొంతమంది అపరకుబేరుల వద్ద సంపద గణనీయంగా పేరుకుపోతే దేశం సుసంపన్నమైనట్లా? దేశ ప్రజానీకంలో అధిక సంఖ్యాకుల రాబడి ఇనుమడించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే- భారత్‌ అభివృద్ధి చెందినట్లు! వచ్చే 10, 20, 30 సంవత్సరాల్లో రంగాలవారీగా జాతి అవసరాలు, ఉపాధి అవకాశాలను శాస్త్రీయంగా మదింపు వేసి- అందుకు తగ్గట్లు చదువుల్ని సంస్కరించాలి. లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు తెరతీస్తున్న కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, వర్చువల్‌ రియాలిటీ, డేటా సైన్స్‌ తదితర సాంకేతిక కోర్సులకు అనువుగా పునాది స్థాయినుంచీ పాఠ్యప్రణాళికల్ని ప్రక్షాళించాలి. సామాన్యుల స్థితిగతుల బాగుసేత కోసం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితరాలపై పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వాలు భారీగా పెంచాలి. మన యువశక్తులు నవనైపుణ్యాలతో తులతూగుతూ దేశం లోపల వెలుపల ఎక్కడైనా ఉపాధి అవకాశాల్ని ఒడిసిపట్టడానికిది అత్యుత్తమ మార్గం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.