సీమపై జగన్‌ ఉక్కుపాదం

‘సీఎం స్థానం అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటిది. ఏ నిర్ణయమైనా ఒక తండ్రిలా ఆలోచించి తీసుకోవాలి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా తప్పే అవుతుంది’- జగన్‌ నోట వెలువడిన మాటల ముత్యాలివి. కరవు గజ్జె కట్టినప్పుడల్లా హృదయ విదారకంగా వలసలు పోటెత్తే రాయలసీమ విషయంలో సీఎం జగన్‌ చేసిన తప్పులు లెక్కలేనన్ని!

Published : 30 Mar 2024 00:38 IST

‘సీఎం స్థానం అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటిది. ఏ నిర్ణయమైనా ఒక తండ్రిలా ఆలోచించి తీసుకోవాలి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా తప్పే అవుతుంది’- జగన్‌ నోట వెలువడిన మాటల ముత్యాలివి. కరవు గజ్జె కట్టినప్పుడల్లా హృదయ విదారకంగా వలసలు పోటెత్తే రాయలసీమ విషయంలో సీఎం జగన్‌ చేసిన తప్పులు లెక్కలేనన్ని! సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరం పూర్తిచేసి, పారిశ్రామిక ప్రగతికి బంగరుబాట వేస్తే యువజనం ఉపాధికి ఊతం లభిస్తుంది, రాయలసీమా స్థిమితపడుతుంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకొచ్చి సీమను సస్యశ్యామలం చేస్తామన్నది ఆయనే. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు, ధరల స్థిరీకరణ నిధి, శీతల గిడ్డంగులూ జగన్‌ నోట వెల్లువెత్తిన వరదానాలే! అధికారం చేపట్టిన మూడేళ్లలో కడప ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేస్తామని వాగ్దానం చేసిందీ ఆయనే. ముఖ్యమంత్రి పీఠం దక్కాక ఇప్పటిదాకా ప్రజల్ని ఏ ఒక్క సందర్భంలోనూ ముఖాముఖి కలుసుకోని జగన్‌ తన విశ్వాస ఘాతుకానికి బలైన సీమ నుంచే ఓట్ల వేటకు మేము సిద్ధం అంటూ బయలుదేరారు. జగన్‌ మాటలన్నీ నీటిమీద రాతలై సీమ ప్రజానీకం కుమిలిపోతున్న వేళ ఇది. ప్రజా ప్రయోజనాల కన్నా తెలుగుదేశంపై రాజకీయ కక్ష సాధించడానికే ప్రాధాన్యం దక్కడంతో కీలకమైన తాగు, సాగు నీటి ప్రాజెక్టులు జగన్‌ జమానాలో పడకేశాయి. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్‌, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అయితే సీమ కష్టాలు తీరిపోతాయన్న ప్రజల ఆశల్నీ జగన్‌ ప్రభుత్వం చిదిమేసింది. వైకాపా అధికారానికి వచ్చాక అనేక ప్రాజెక్టుల అంచనాల్ని భారీగా పెంచేసింది. జగన్‌ ఏలుబడిలో ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన మొత్తం కన్నా పెరిగిన అంచనా వ్యయమే ఎక్కువ కావడం గమనార్హం. ఆయా ప్రాజెక్టులు చేపట్టిన అస్మదీయ గుత్తేదారులకే బిల్లులు చెల్లించిన జగన్‌ సర్కారు సాగునీటి వ్యవస్థల్ని పస్తుపెడితే, ఆ పాపం మహాశాపమై కాటకం రూపేణా సీమను కాటేస్తోంది!

దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే సీమలోనే 2006లో జాతీయ ఉపాధి హామీ పథకం పురుడు పోసుకుంది. ఉన్న ఊరిలోనే శ్రామికులకు బతుకుతెరువు కల్పించే ఉపాధి హామీ ఉన్నప్పటికీ ఊళ్లకు ఊళ్లే వలసలు పోతున్నాయంటే- నిశ్చయంగా ఆ నేరం జగన్‌ సర్కారుదే! అయిదేళ్లక్రితం రికార్డు వ్యవధిలో పట్టిసీమను పూర్తిచేసి, ఇతర కీలక ప్రాజెక్టులనూ ఒక కొలిక్కి తెచ్చి, పారిశ్రామిక ప్రగతికీ దారులు పరచిన తెలుగుదేశం ద్విముఖ వ్యూహంతో రాయలసీమ కాస్తంత తెప్పరిల్లింది. జగన్‌ మాయ వాగ్దానాల వలలో పడి గంపగుత్తగా సీట్లు అప్పగించిన సీమ జనవాహిని- మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లయిందని నేడు ఆవేదన చెందుతోంది. సీఎం, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, నలుగురు మంత్రులు సీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా- వారివల్ల ఏం ఒరిగింది? గత తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన పారిశ్రామిక ప్రాజెక్టులన్నింటికీ చెల్లుకొట్టిన వైకాపా తన వంతుగా ఉద్ధరించిందేమైనా ఉందా... అంటే, అదీ లేదు. ఖనిజ సంపదకు కాణాచి లాంటి సీమలో వాటి అనుబంధ పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వాల్సిన అమాత్యులు, వాటిని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌, రాయచోటిలో టొమాటో గుజ్జు పరిశ్రమ, పత్తికొండ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌ పార్క్‌- వీటిలో ఏవీ సాకారం కాకపోవడమే జగన్‌ ఏలుబడి ఘనత! కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రిగా జగన్‌ రెండుసార్లు శంకుస్థాపన చెయ్యడం- కనీవినీ ఎరుగని వింత! చేనేత కార్మికులు చితికిపోయినా, ఏటా వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్‌తో పదివేలమందికి ఉపాధి కల్పించే స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడినా నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రభుత్వం ఇది. 99శాతం హామీలు అమలు చేశానంటూ జనం కళ్లకు మళ్ళీ గంతలు కట్టడానికి వచ్చిన జగన్‌ మోసపుటెత్తుల్ని తిప్పికొట్టాల్సిన సమయమిది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.