సైబర్‌ భద్రతే ఉమ్మడి అజెండా

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా కాంతులీనుతున్న ఇండియా కీర్తిప్రతిష్ఠలకు సైబరాసుర ముఠాల బరితెగింపు తూట్లు పొడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతోపాటు సౌదీ అరేబియా, ఎస్తోనియా, దక్షిణ కొరియా, సింగపూర్‌, స్పెయిన్‌ వంటివీ సైబర్‌ భద్రతలో భారత్‌కన్నా ఎంతో మిన్నగా రాణిస్తున్నాయి.

Published : 30 Mar 2024 00:38 IST

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా కాంతులీనుతున్న ఇండియా కీర్తిప్రతిష్ఠలకు సైబరాసుర ముఠాల బరితెగింపు తూట్లు పొడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతోపాటు సౌదీ అరేబియా, ఎస్తోనియా, దక్షిణ కొరియా, సింగపూర్‌, స్పెయిన్‌ వంటివీ సైబర్‌ భద్రతలో భారత్‌కన్నా ఎంతో మిన్నగా రాణిస్తున్నాయి. ఒక్క సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా 40 కోట్లదాకా సైబర్‌ బెదిరింపులు నమోదయ్యాయని మూడు నెలల క్రితం డీఎస్‌సీఐ (డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) ధ్రువీకరించింది. అంటే, సగటున ఒక్కో నిమిషానికీ 761. ఒక ఏడాది వ్యవధిలో తమ సేవల్ని వినియోగించుకున్నవారిని 7.43కోట్ల బెదిరింపుల బారిన పడకుండా కాపాడినట్లు అంతర్జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ ‘కాస్పరస్కి’ ఇటీవలే వెల్లడించింది. ఏఐ (కృత్రిమ మేధ)తో సైబర్‌ భద్రతకు సవాళ్లు భారీగా పెరిగాయన్న రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ విశ్లేషణ అక్షరసత్యం. దేశీయ ఆరోగ్యసేవా సంస్థలపై ప్రతి నెలా సగటున 2.78లక్షలదాకా సైబర్‌ దాడులు నమోదవుతున్నాయి. బ్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, విద్యుత్‌ గ్రిడ్లు, అణు విద్యుత్కేంద్రాలు, వివిధ కార్పొరేట్‌ సంస్థల వెబ్‌సైట్లు... ఏవీ సైబర్‌ దాడులకు అతీతం కావని రుజువవుతున్న నేపథ్యంలో- జాతి నెత్తిన మహాముప్పు ఉరుముతోంది. వ్యక్తులు, సంస్థలు బాధిత జాబితాలో చేరి ఏకరీతిన విలవిల్లాడుతుండటం సైబర్‌ ముఠాల నేర సామ్రాజ్య విస్తరణ వేగాన్ని కళ్లకు కడుతోంది. ఇంతగా ప్రమాదం పెచ్చరిల్లుతున్న దశలో ఇండియాలోని కేవలం నాలుగు శాతం సంస్థలే సైబర్‌ సవాళ్లను ఎదుర్కోగల స్థితిలో ఉన్నాయన్న ‘సిస్కో’ (కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ కంపెనీ) సరికొత్త విశ్లేషణ తీవ్రంగా కలవరపరుస్తోంది. ఫిషింగ్‌, ర్యాన్సమ్‌వేర్‌, సప్లయ్‌ చెయిన్‌ తదితరాల రూపేణా సైబర్‌ నేరగాళ్ల దాడుల్ని నిభాయించడం ఎలాగన్న దానిపై బాధిత సంస్థలు, ప్రభుత్వాలు చురుగ్గా దృష్టి సారించాలి. దేశంలోని 83శాతం సంస్థలు, ప్రతి పదిమంది వినియోగదారుల్లో ఏడుగురు సైబర్‌ మోసగాళ్ల బాధితులేనంటున్న అధ్యయనాల వెలుగులో, సత్వర దిద్దుబాటు చర్యలు ఊపందుకోవాలి.

విశ్వంలో అత్యధికంగా సైబర్‌ దాడుల బారిన పడుతున్న దేశం ఏదన్న ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించనక్కరలేదు. మొత్తం సైబర్‌ దాష్టీకాల్లో 13.7శాతానికి నెలవైన ఇండియాయే అన్నది సరైన జవాబు! తరవాతి స్థానాల్లో అమెరికా(9.6శాతం), ఇండొనేసియా(9.3), చైనా(4.5) నిలుస్తున్నాయి. సైబర్‌ భద్రతపై రెండు దశాబ్దాల క్రితమే దూరాలోచన చేసిన ఇజ్రాయెల్‌, అప్పట్లోనే నిపుణుల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను పట్టాలకు ఎక్కించింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటివి సైబర్‌ భద్రతను లక్షించి ప్రత్యేక మంత్రిత్వశాఖనే నెలకొల్పాయి. కొట్టేసిన సొత్తును సైబర్‌ చోరులు ఎక్కడికి ఎలా తరలిస్తున్నదీ ఆనుపానులు వెలికితీసే కసరత్తులో కర్ణాటక, తెలంగాణ, ఝార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలే చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఐ4సీ (భారత సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం) నాలుగేళ్లనాడు రూపుదాల్చింది. 2025 నాటికి దేశంలో 10 లక్షల సైబర్‌ నిపుణుల అవసరం ఉందన్న సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అంచనాను నిజం చేయడంలో అది ఇకనైనా క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంది. రాష్ట్రాల మధ్య నిరంతర  సమాచార మార్పిడి, జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యదళం అవతరణ వేగవంతం కావాలి. సైబర్‌ ముఠాల అణచివేతలో భాగంగా తన సరికొత్త నివేదికలో ‘సిస్కో’- విభిన్న సంస్థలకు మేలు ఒనగూడేలా సమన్వయ వేదిక ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వేర్వేరు దేశాల మధ్యా అటువంటి వేదిక అవసరం ఎంతైనా ఉంది. అత్యాధునిక సాంకేతికతల్ని కలిసికట్టుగా ఉపయోగించుకుంటూ సైబర్‌ భద్రతను పరిపుష్టీకరించడానికి ఏకతాటిపై నడవాలని ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికాలతో కూడిన ‘క్వాడ్‌’ కూటమి నిరుడే తీర్మానించింది. ఈ ఉద్యమస్ఫూర్తి తక్కిన దేశాలకూ విస్తరిస్తే సైబర్‌ ముష్కరులపై ఏకోన్ముఖ సమరం సాకారమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.