పెచ్చరిల్లుతున్న కార్చిచ్చులు

శీతోష్ణ స్థితిగతుల నియంత్రణలో హరితారణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. సమస్త జీవరాశుల మనుగడకు ఆధారభూతాలైన అడవులు- పర్యావరణ మార్పుల దుష్ప్రభావాల కట్టడిలోనూ ప్రధాన భూమిక వహిస్తాయి. దురదృష్టవశాత్తు అవే వాతావరణ వైపరీత్యాల మూలంగా పచ్చటి వనాలెన్నో బుగ్గి పాలవుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నవంబరు నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో...

Published : 01 Apr 2024 02:06 IST

శీతోష్ణ స్థితిగతుల నియంత్రణలో హరితారణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. సమస్త జీవరాశుల మనుగడకు ఆధారభూతాలైన అడవులు- పర్యావరణ మార్పుల దుష్ప్రభావాల కట్టడిలోనూ ప్రధాన భూమిక వహిస్తాయి. దురదృష్టవశాత్తు అవే వాతావరణ వైపరీత్యాల మూలంగా పచ్చటి వనాలెన్నో బుగ్గి పాలవుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నవంబరు నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కార్చిచ్చు దుర్ఘటనలు నమోదయ్యాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఎక్కువగా వాటి బారినపడ్డాయి. దేశీయంగా గడచిన దశాబ్ద కాలంలో తీవ్రస్థాయి దావానలాల సంఖ్య పది రెట్లు ఎగబాకినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉష్ణతాపం కట్టుతప్పడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరువందలకు పైగా అరణ్య ప్రాంతాలను కార్చిచ్చులు దహించివేస్తున్నట్లు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశీలన తాజాగా వెల్లడించింది. తెలంగాణలోని ఏటూరు నాగారం, అమ్రాబాద్‌లతో పాటు ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌, మిజోరం, మణిపుర్‌, అస్సాం, తమిళనాడు తదితరాల్లోనూ ఇటీవల అడవులు అగ్నికోరల్లో చిక్కుకున్నాయి. పర్యావరణ మార్పుల పర్యవసానంగా ఫిబ్రవరి నెల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఫలితంగా వాతావరణం బాగా పొడిబారిపోయింది. అడవుల్లో ఎక్కడ చిన్నపాటి మంట అంటుకున్నా అగ్నికీలలు క్షణాల్లో భారీగా విస్తరిస్తున్నాయి. రోజుల తరబడి అవి అలాగే రగులుతూ అటవీ ప్రాంతాలను బూడిదకుప్పలుగా మార్చేస్తున్నాయి. పశువుల కాపరులు, పర్యటకులు బీడీలు, సిగరెట్లను ముట్టించి విచ్చలవిడిగా విసిరేస్తుండటం, వంట చేసుకున్న చోట నిప్పును సరిగ్గా ఆర్పకపోవడం వల్ల అరణ్యాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నిప్పుతో చెలగాటమాడేవారిని కఠినంగా దండించడం, వనాల సంరక్షణలో ప్రజావగాహనకు ప్రోదిచేయడం ద్వారానే ఈ ఉత్పాతాలను నియంత్రించగలం!  

ఏ దేశ భూభాగంలోనైనా కనీసం 33శాతం వనాలు ఉంటేనే పర్యావరణం ఆరోగ్యకరంగా మనగలుగుతుంది. కానీ, భారతావనిలో అటవీ విస్తీర్ణం పాతిక శాతానికే పరిమితమైంది. పైగా కొన్నేళ్లుగా దేశీయంగా దట్టమైన అడవులు తరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్చిచ్చుల కారణంగా హరితారణ్యాలు మరింతగా హరించుకుపోతుండటం తీవ్రంగా కలవరపరచేదే. ఇండియాలో దాదాపు 36శాతం అటవీ ప్రాంతాలు కార్చిచ్చుల తాకిడికి నెలవులుగా ఉన్నాయన్న విశ్లేషణలూ ఆందోళనకు గురిచేసేవే. ఉన్నట్టుండి తలెత్తే దావానలాలను ఉపగ్రహాల సాయంతో గుర్తిస్తున్న ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కానీ, కార్చిచ్చుల తీవ్రత అధికంగా ఉన్నచోట స్థానిక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. చాలాచోట్ల మంటలను ఆర్పేందుకు చెట్ల కొమ్మలను వినియోగించే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. అడవిలో దావానలం ముందుకు చొచ్చుకుపోకుండా అక్కడక్కడా అయిదు మీటర్ల వెడల్పు మేర పొదలు, ఆకులు తదితరాలను తొలగిస్తారు. ఫైర్‌లైన్స్‌గా వ్యవహరించే వీటికోసం చాలా రాష్ట్రాలు సరిపడా నిధులను సమకూర్చడం లేదన్న విమర్శలున్నాయి. ఈయూ, ఆస్ట్రేలియా వంటివేమో కార్చిచ్చులను ఆదిలోనే నివారించేందుకు ప్రత్యేక విమానాలు, అధునాతన మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నాయి. 2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్ల మేర అడవులను పునరుద్ధరించాలనే ఘన సంకల్పాన్ని ఇండియా గతంలోనే ప్రకటించింది. ఆ లక్ష్యం నెరవేరాలంటే- కార్చిచ్చుల నియంత్రణపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందే. దావానలాలను ఎదుర్కొనేందుకు ఇతోధికంగా నిధులు కేటాయించడంతో పాటు సిబ్బందికి అధునాతన పరికరాలను సమకూర్చాలి. పుడమిని పెను ఇక్కట్లలోకి నెడుతున్న వాతావరణ మార్పుల దుష్పరిణామాలను అరికట్టాలంటే- కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.