జగన్‌ ప్రలోభాల జాతర!

తా చెడ్డ జగన్‌ వ్యవస్థలన్నింటినీ చెరపట్టడంతో రాష్ట్రంలో నిష్ఠగా సాగాల్సిన ఎన్నికల క్రతువు ఏనాడో గాడి తప్పింది. ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మార్చి ఓటర్లను ఏమార్చే వ్యవస్థీకృత నేరం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123(1) సెక్షన్‌ ఓటర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లంచం ఇవ్వజూపడాన్ని నేరంగా పరిగణించింది. దురదృష్టం ఏమిటంటే...

Published : 01 Apr 2024 02:06 IST

తా చెడ్డ జగన్‌ వ్యవస్థలన్నింటినీ చెరపట్టడంతో రాష్ట్రంలో నిష్ఠగా సాగాల్సిన ఎన్నికల క్రతువు ఏనాడో గాడి తప్పింది. ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మార్చి ఓటర్లను ఏమార్చే వ్యవస్థీకృత నేరం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123(1) సెక్షన్‌ ఓటర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లంచం ఇవ్వజూపడాన్ని నేరంగా పరిగణించింది. దురదృష్టం ఏమిటంటే- ఆ రాజ్యాంగ చట్టాలు తమకు ఏమాత్రం వర్తించవన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రలోభాల జాతర ఊరూవాడా కదంతొక్కుతోంది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణకు నేరుగా పూచీపడాల్సిన ఎలెక్షన్‌ కమిషన్‌ చూసీ చూడనట్లుగా వెలగబెడుతున్న నిర్వాకాలతో వైకాపా మరింతగా రెచ్చిపోతోంది. 2.56లక్షల పైచిలుకు కార్యకర్తలు, సానుభూతిపరులతో  వాలంటీర్ల వ్యవస్థను రూపొందించి, నానావిధ తాయిలాల పందేరాలకు వారిని పనిముట్లుగా వాడుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది. నెలకు అయిదు వేల రూపాయల వంతున ప్రజాధనంతో వారికి గౌరవ భృతి ఇచ్చి, ఇంతకాలం పార్టీ పనులు చేయించుకుని నేడు వైకాపాను తిరిగి గెలిపించే బాధ్యత వారిదేనంటోంది. వైకాపా నేతాగణాలతో కలిసి వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ చీరలు, స్వీట్‌ ప్యాకెట్లు, కుక్కర్లు వంటి తాయిలాల పంపకంలో మునిగి తేలుతున్నారు. వైకాపా మళ్ళీ వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. 2007నాటి విశాఖపట్నం-1 ఉప ఎన్నికలో అక్రమాలు చెలరేగడంతో ఆ ఎలెక్షన్‌ను రద్దుచేసిన ఈసీ- జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల అధికారిపైనా అప్పట్లో వేటు వేసింది. తనకు గులాంగిరీ చేసేలా వ్యవస్థల్ని భ్రష్టుపట్టించడంలో వైఎస్‌ను ఏనాడో మించిపోయిన జగన్‌- ‘వై నాట్‌ 175?’ అంటూ భారత ప్రజాతంత్రానికి, రాష్ట్ర ప్రజల విజ్ఞతకు సవాళ్లు రువ్వుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనే ఫ్యాక్షనిజ నైజంతో బుసలు కొట్టిన వైకాపా నేడు పాలకపక్షంగా కుబుసం విడిచి కోరచాస్తున్న నేపథ్యంలో- కాళియ మర్దనానికి రాష్ట్ర ప్రజానీకమే సంసిద్ధం కావాలిప్పుడు!

విభిన్న రాజకీయ వాదాల సంఘర్షణే ప్రజాస్వామ్యసారం. ఆయా పరగణాల్లో ఏ ఎన్నికలైనా తమకు అనుకూలంగా ఏకపక్షంగా తెమిలిపోవాలన్నది ఫ్యాక్షనిస్టుల దురహంకారం! పదేళ్లనాటి అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్‌, గోవా, హరియాణాలకు చెందిన వేర్వేరు బ్రాండ్ల పేరిట స్పిరిట్‌, రసాయనాలు, రంగులు కలగలిసిన ప్రాణాంతక నకిలీ మద్యాన్ని ఓటర్లకు వైకాపా సరఫరా చేసింది. 2019లో అధికారానికి వచ్చాక దేశంలో మరెక్కడా కానరాని బ్రాండ్ల పేరిట మద్యాన్ని గుమ్మరిస్తున్న వైకాపా ప్రభుత్వం- డిజిటల్‌ చెల్లింపులకు చెల్లుకొట్టి, కేవలం డబ్బుతోనే నిర్వహించిన లావాదేవీల వల్ల ఎంత నల్లధనం పోగుపడిందో ఊహకందదు. ఎన్నికల్లో ధన మద్య ప్రవాహాలను అరికట్టలేకపోతున్నామని, ఇంటింటికీ తిరిగి ప్రచారం సాగించే ముసుగులో వాటి పంపిణీ విస్తృతంగా సాగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఖురేషీ గతంలోనే వాపోయారు. బిల్లులు లేకుండా తరలిస్తూ ఉచిత పంపిణీకి సిద్ధం చేసిన వస్తువులపై రూ.5.73కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వాణిజ్య పన్నులశాఖ నేడు చెబుతున్నా- అదంతా సముద్రంలో నీటిబొట్టు! ‘ఎలెక్షన్‌ సీజన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ విధానంతో ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యపడుతుందని ప్రధాన ఎన్నికల అధికారి జనవరిలోనే చేసిన ప్రకటనకు క్షేత్రస్థాయి వాస్తవాలు గాలి తీసేస్తున్నాయి. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజల్ని,  రాష్ట్ర ప్రగతినీ నిలువునా ముంచేసిన జగన్‌ ప్రభుత్వం- అడ్డగోలుగా డబ్బులు వెదజల్లి, తాయిలాల మాయ వలలు విసిరి ఓటర్లను ప్రలోభాల మత్తులో ముంచి మళ్ళీ అధికారం చేపట్టాలనుకొంటోంది. ఓటర్ల జాబితాను ఏమార్చడం నుంచి వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చెయ్యడం దాకా ప్రజాస్వామ్యాన్ని చెరపట్టే ప్రతి అవకాశాన్నీ వైకాపా వాడుకొంటోంది. ధన, భుజ, అధికార మదబలంతో జగన్‌ ప్రభుత్వం ఆడుతున్న ఈ రాజకీయ మాయా ద్యూతానికి ఓటర్లే సరైన ముగింపు పలకాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.