జగన్‌ దొంగ చెవులు

‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అంటూ అయిదేళ్లక్రితం విపక్షనేతగా రాష్ట్ర ప్రజానీకాన్ని బురిడీ కొట్టించిన జగన్‌కు, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే దొంగ చెవులు మొలుచుకొచ్చాయి. సెల్‌ఫోన్‌ ట్యాపింగ్‌ సాంకేతికత సాయంతో అందరి జీవితాల్లోకీ జగన్‌ తొంగి చూస్తుండటంతో రాష్ట్రంలో భయవిహ్వల వాతావరణం ఏర్పడింది.

Published : 02 Apr 2024 00:43 IST

‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అంటూ అయిదేళ్లక్రితం విపక్షనేతగా రాష్ట్ర ప్రజానీకాన్ని బురిడీ కొట్టించిన జగన్‌కు, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే దొంగ చెవులు మొలుచుకొచ్చాయి. సెల్‌ఫోన్‌ ట్యాపింగ్‌ సాంకేతికత సాయంతో అందరి జీవితాల్లోకీ జగన్‌ తొంగి చూస్తుండటంతో రాష్ట్రంలో భయవిహ్వల వాతావరణం ఏర్పడింది. జీవనయానం సాఫీగా సాగాలంటే పౌరులందరికీ సెల్‌ఫోన్‌ నిత్యావసరంగా మారిపోయిన రోజులివి. ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడన్న దానితోపాటు, ఎవరితో ఏ సమయంలో ఏం మాట్లాడారన్న విస్తృత సమాచార నిధికి సెల్‌ఫోన్లే ఆధారమవుతున్నాయి. సెల్‌ఫోన్‌ సమాచారం- ప్రతి పౌరుడి వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కుకు ప్రాణాధారం. పౌరుల జీవన భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలంబనగా నిలుస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోకే వ్యక్తిగత గోప్యతా వస్తుందని సుప్రీంకోర్టే పలుమార్లు స్పష్టీకరించింది. ఉగ్రవాదుల ఆనుపానుల్ని పసిగట్టడం వంటి పరిమిత, ప్రత్యేక సందర్భాల్లోనూ దర్యాప్తు సంస్థలు సెల్‌ఫోన్‌ ట్యాపింగ్‌కు ఎవరెవరి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలో విస్పష్ట నిబంధనలున్నాయి. వాటన్నింటికీ తిలోదకాలు వదిలి- రాష్ట్ర ప్రజలు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పాత్రికేయులు, చివరకు న్యాయమూర్తుల్నీ దేశద్రోహులుగా జమకట్టి, జగన్‌ సర్కారు చేస్తున్న దొంగ చెవుల వీరంగం... అసలు సిసలు జాతిద్రోహం! తమ ఫోన్లనూ ట్యాప్‌ చేస్తున్నారంటూ కొందరు వైకాపా ఎమ్మెల్యేలే బహిరంగంగా మొత్తుకోగా, నిజం తెలిసీ తక్కినవారు కుక్కిన పేనుల్లా పడి ఉండటానికి జగన్‌ ఏం చేస్తారోనన్న భయమే కారణం. రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్దాక్షిణ్యంగా రూపుమాపే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఏలుబడికి నకలుగా రాష్ట్రంలో జగన్‌ పాలన అఘోరించింది. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానన్న పదవీ ప్రమాణాన్ని తుంగలోతొక్కి, ప్రాథమిక హక్కుల్నే కర్కశంగా కాలరాస్తున్న నయా కాలకేయుడికి ఏ శిక్ష విధించాలి?

‘న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్‌ చేయడం జోక్‌ అనుకొంటున్నారా? ఇది తీవ్రమైన విషయం’ అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 2020 ఆగస్టులో స్పష్టీకరించింది. జడ్జీల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్‌తో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విచారణ అక్కడితో ఆగిపోయింది. కానీ, రాజ్యాంగబద్ధమైన పౌరుల ప్రైవసీని కసిగా కాలరాస్తూ జగన్‌ సర్కారు ప్రోద్బలంతో ట్యాపింగ్‌ జాడ్యం చిలవలు పలవలు వేసుకుపోయింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితేనే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న ప్రభుత్వం- మొబైల్‌ ఫోన్లలోనూ స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారుల్లో 90శాతందాకా ఫోన్‌ మాట్లాడాలంటేనే భయంతో వణికిపోతున్న దురవస్థ లోగడ ఎప్పుడైనా ఉందా? తమను ట్రాక్‌ చేస్తున్నారన్న భయంతో తరచూ ఫోన్‌ను ఫార్మాట్‌ చేయడం, పక్షం రోజులకోసారి మార్చేయడం, బంధువుల పేరిట నంబరు తీసుకోవడం- ఇంతగా జనాన్ని, నేతల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సాగుతోంది జగన్‌ సర్కారు దందా! పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించి వైకాపా సర్కారు రాజకీయ ప్రత్యర్థులకు ఉచ్చు బిగిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా నయా ఫ్యాక్షనిజం పౌరస్వేచ్ఛను చంపేస్తోంది. కోట్లాది ప్రజల ప్రైవేటు బతుకుల్ని బజారుపాలు చేస్తోంది. ఆన్‌లైన్‌ చోరీల రుచి మరిగిన సైబర్‌ మాఫియా కంటే నీచంగా- ప్రజాప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పౌరుల ప్రైవసీకి భంగం కలిగించడం క్షంతవ్యం కాని నేరం. తెలిసో తెలియకో ప్రైవసీ చట్టాల్ని ఉల్లంఘించిన నేరాలకు మెటా, గూగుల్‌ వంటివి లెంపలేసుకుని కోట్ల డాలర్ల జరిమానాలు కట్టడాన్ని చూస్తున్నాం. పౌరులకు సంబంధించిన డేటా ఉల్లంఘనల విషయంలో తప్పు చేస్తే ప్రభుత్వాలు కూడా ముద్దాయిలుగా నిలబడాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోంది. ప్రైవసీ ఉల్లంఘనను హత్యకన్నా హేయమైన నేరంగా పరిగణించే ఆధునిక కాలంలో జగన్‌ అరాచకానికి ఏం శిక్ష విధించాలో ప్రజాన్యాయస్థానమే తేల్చాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.