జాతీయోద్యమంగా జల సంరక్షణ

వేసవి గరిష్ఠ స్థాయిలో ప్రతాపం చాటుతూ చండ్రనిప్పులు చెరగక మునుపే జలాశయాల్లో నీటిమట్టాలు తెగ్గోసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటినిల్వలు వాటి పూర్తిస్థాయి సామర్థ్యంలో 38శాతానికి పడిపోయాయి.

Published : 02 Apr 2024 00:42 IST

వేసవి గరిష్ఠ స్థాయిలో ప్రతాపం చాటుతూ చండ్రనిప్పులు చెరగక మునుపే జలాశయాల్లో నీటిమట్టాలు తెగ్గోసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటినిల్వలు వాటి పూర్తిస్థాయి సామర్థ్యంలో 38శాతానికి పడిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని 42 ప్రధాన రిజర్వాయర్లలో మట్టాలు వాటి పూర్తి సామర్థ్యంలో 23శాతానికే పరిమితమయ్యాయి. బెంగళూరు మహానగరంలో రోజువారీ నీటి డిమాండు 260కోట్ల లీటర్లయితే- వేలాది బోరుబావులు ఎండిపోయిన దరిమిలా ప్రస్తుతం లభ్యమవుతున్నది 212కోట్ల లీటర్లే. బెంగళూరును బెంబేలెత్తిస్తున్న నీటి కొరత దక్షిణాదిలోని తక్కిన నగరాలకూ దాపురించే ముప్పుందని కేంద్ర జలసంఘం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి కొరత నివారణకు తగినన్ని చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌ మరో బెంగళూరులా మారే దుస్థితి ఎంతో దూరంలో లేదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రెండువారాల క్రితమే హెచ్చరించింది. తనవంతుగా సుప్రీంకోర్టు- నగరాల్లో ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా మొలుచుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై రెండేళ్లనాడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలనీ నిర్దేశించింది. వాస్తవంలో, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో పరిసర ప్రాంతాల్లో అవినీతిగ్రస్త పురపాలక సంస్థలు అక్రమార్కులకు పెట్టని కోటలవుతున్నాయి. చెరువులు, కుంటలు యథేచ్ఛగా ఆక్రమణల పాలై కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. జనానికి గరళజలమే దిక్కవుతున్న ఆంధ్రప్రదేశ్‌ తీరే వేరు. ఏఐఐబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) సాయంతో, ‘అమృత్‌’ పథకం కింద తెలుగుదేశం జమానాలో ఆమోదం పొందిన తాగునీటి పథకాలను జగన్‌ సర్కారు కక్షకట్టి పస్తులు పెట్టడంతో అభాగ్యులెందరికో నేడు కలుషిత జలాలే శరణ్యమవుతున్నాయి. పైపుల లీకేజీలు, నిర్వహణ లోపాలతో గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగు నీటిలో 35శాతందాకా కలుషితం అవుతున్నట్లు జల్‌జీవన్‌ మిషన్‌ అధ్యయనమే ధ్రువీకరించింది. విధ్యుక్త ధర్మాన్ని తుంగలో తొక్కిన జగనన్న పాలన పుణ్యమా అని- నీటిఎద్దడి అధికమయ్యేకొద్దీ ఏపీవాసులకు ఇక నిత్యం జలగండమే!

దేశంలో 2030నాటికి పెను జలసంక్షోభం తలెత్తుతుందని, స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతందాకా ఇండియా నష్టపోవాల్సి వస్తుందన్నది ‘నీతిఆయోగ్‌’ అంచనా. విశ్వవ్యాప్తంగా 2016నాటికి నీటిఎద్దడి పాలబడిన బాధితులు 93.3కోట్లమంది. 2050నాటికి ఆ సంఖ్య 240కోట్ల వరకు విస్తరించ నుందని, అందులో అధికులు భారతీయులే అయ్యుంటారని ఐరాస ఊహిస్తోంది. 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా గొంతెండిపోయి అలమటించే వంద నగరాల్లో 30 భారత్‌లోనే ఉంటాయన్న విశ్లేషణలు తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతున్నాయి! దేశంలో 70శాతం జలాలు కలుషితమై, రక్షిత జలాలకు నోచుకోక ఏటా రెండు లక్షల ప్రాణాలు కడతేరిపోతున్నాయని అధికారిక గణాంకాలే స్పష్టీకరిస్తున్నాయి. దేశంలో నీటినాణ్యత, లభ్యత ఇనుమడించేలా అనుసరణీయ మార్గమేమిటో దేశదేశాల అనుభవాలు సోదాహరణంగా తెలియజెబుతున్నాయి. దేశంలో ప్రమాదకరంగా పరిణమించిన పట్టణీకరణను చురుగ్గా గాడిన పెట్టాలి. ఎక్కడికక్కడ విచ్చలవిడి నీటి తోడివేతను కట్టడి చేసే నిమిత్తం, భూగర్భ జలాల సమర్థ నిర్వహణ కోసం పటిష్ఠ యంత్రాంగాన్ని కొలువు తీర్చాలి. జల సంరక్షణ, పునర్వినియోగాలపై  రైతుల నుంచి సాధారణ పౌరుల వరకు అందరిలోనూ చైతన్యం పెంపొందించాలి. వాననీటి సంరక్షణ, అపార జలాలు వృథాగా సముద్రం పాలబడనివ్వకుండా నదుల అనుసంధానం- ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో ప్రమేయం లేకుండా సాకారం కావాలి. నీరు ప్రాణాలు నిలబెడుతుంది. ఆ అమృతజలాలను ప్రాణసమానంగా భావించి భద్రపరచుకుంటేనే దేశార్థికం, జనజీవనం పచ్చగా కళకళలాడతాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.