అక్షయ నిధి... సౌర ఇంధనం!

స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులీనే అద్భుత పరిష్కారం- సౌరశక్తి. ప్రకృతిలోని బొగ్గు, పెట్రోలియం, సహజవాయు నిక్షేపాల్లాంటివి ఎప్పటికైనా తరిగిపోయేవేగాని- సూర్యకిరణాల నుంచి ఒనగూడే శక్తి... అక్షయనిధి!

Published : 03 Apr 2024 01:12 IST

స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులీనే అద్భుత పరిష్కారం- సౌరశక్తి. ప్రకృతిలోని బొగ్గు, పెట్రోలియం, సహజవాయు నిక్షేపాల్లాంటివి ఎప్పటికైనా తరిగిపోయేవేగాని- సూర్యకిరణాల నుంచి ఒనగూడే శక్తి... అక్షయనిధి! ఆ అపార సంపద ప్రపంచ దేశాలన్నింటికీ ఒకే తీరుగా అందుబాటులో లేదు. భూగోళంపై కర్కాటక, మకర రేఖాంశాల మధ్య ఏటా 300 రోజులకుపైగా సూర్యబింబం ఉష్ణకాంతి పుంజాల్ని ప్రసరింపజేసే దేశాల్లో మనదీ ఒకటి. వేరే మాటల్లో, ఈ సహజ బలిమి భారతావనికి అయాచితంగా దక్కిన ప్రకృతివరం. దాన్ని సద్వినియోగపరచుకునే లక్ష్యంతోనే ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ను మోదీ ఇటీవల ప్రకటించారు. పోనుపోను విద్యుదవసరాలు ఇనుమడిస్తుండగా గత నాలుగు దశాబ్దాల్లోనూ కనిష్ఠ స్థాయికి దేశంలో జలవిద్యుదుత్పాదన పతనమైన దశలో, సౌరశక్తి ప్రాముఖ్యం ఎనలేనిది. కోటి కుటుంబాలకు రూ.78వేల వరకు రాయితీ కల్పించి చేపడుతున్న సూర్యోదయ యోజన ఇంధన రంగాన దేశ స్వావలంబనకు బాటలు పరుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2022 నాటికి 100 గిగావాట్ల (గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్లు) పునరుత్పాదక ఇంధనోత్పత్తిని లక్షించినా- జరిగింది వేరు. 2026 వరకు ఆ గడువును పొడిగించిన భారత్‌, 2030లోగా ఏటా కనీసం 40 గిగావాట్ల అదనపు సౌరశక్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలని బృహత్తర లక్ష్యం నిర్దేశించుకుంది. ఇటీవలి వరకు సోలార్‌ ఉపకరణాల కోసం ప్రధానంగా చైనా, వియత్నాం, హాంకాంగ్‌, మలేసియాలపైనే ఆధారపడిన ఇండియా- ఇప్పుడా దిగుమతుల్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం కీలక పరిణామం. గత ఏడాదిలో రూ.16వేల కోట్లకు పైగా సౌరఫలకాలను అమెరికాకు ఎగుమతి చేసి కొత్త రికార్డు నెలకొల్పిన భారత్‌- దేశీయంగానూ సౌర ఉపకరణాల అవసరాలన్నీ తీర్చగల కార్యాచరణను ఉరకలెత్తించాలి. సౌర విద్యుత్‌ ఉత్పాదనకు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగానే ఉత్పత్తయితే, ఆ ఘనత ప్రగతి రథానికి వెలుగుబాటలు పరుస్తుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలీయ పునరుత్తేజక శక్తిగా ప్రతీతమవుతున్న ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో భారత్‌కు ఉజ్జ్వల భవితవ్యం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఆరేళ్లక్రితమే ఆశావహ దృశ్యం ఆవిష్కరించింది. ఆ అంచనాలకు- సౌరఫలకాలు, ఇతరత్రా ఉపకరణాలకోసం చైనాపైనే ఎక్కువగా ఇండియా ఆధారపడటం తూట్లు పొడిచింది. సౌర విద్యుదుత్పత్తిలో చైనా స్థాపిత సామర్థ్యం 430 గిగావాట్లు. అమెరికాది 142 గిగావాట్లు. జపాన్‌ది 85 గిగావాట్లు. సౌరఫలకాల విషయంలో పరాధీనత భారత్‌నేమో 73 గిగావాట్లకే పరిమితం చేసింది. ఇప్పటికైనా వ్యూహాత్మక తప్పిదాన్ని సరిదిద్దే చర్యలకు ప్రభుత్వం సంకల్పించడం దేశీయ ఉత్పాదక విభాగాలు, సంస్థల్లో నూతనోత్సాహం రగిలిస్తోంది. ‘సూర్యోదయ యోజన’ స్ఫూర్తికి కొనసాగింపుగా- దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను సమర్థంగా అందిపుచ్చుకోగల సాధన సామర్థ్యాలను సౌరఫలకాల ఉత్పాదక యూనిట్లకు ప్రభుత్వం సంతరింపజేయాలి. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా సకాలంలో తయారీ లక్ష్యాలను అందుకునేలా తగినన్ని ప్రోత్సాహకాలు, పన్నురాయితీలు కల్పించాలి. కాలువలు, పంటపొలాలపై సౌరఫలకాల ప్రయోగాలకు గుజరాత్‌ ఒరవడి దిద్దింది. తక్కిన రాష్ట్రాల్నీ ఆ దిశగా ప్రోత్సహించాలి. సౌర విద్యుత్తును నిల్వచేసి తరలించే అవకాశాలపై విస్తృత పరిశోధనలు జరగాలి. అందులో కృతకృత్యమైతే, దేశానికది గొప్ప వరమవుతుంది! ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలతోపాటు జపాన్‌ తరహాలో జలాశయాలపైనా సౌరవిద్యుదుత్పాదన కదం తొక్కాలి. ఇండొనేసియా, చిలీ, తైవాన్‌, న్యూజిలాండ్‌ ప్రభృత దేశాలు నీటిపై తేలియాడే సౌరవిద్యుదుత్పాదక కేంద్రాలు నెలకొల్పుతున్నాయి. వాటన్నింటికన్నా మిన్నగా రాణించగల సానుకూలాంశాలెన్నో భారత్‌కు ఉన్నాయి. దీటైన వ్యూహాలు రూపొందించి, అవి పకడ్బందీగా అమలుకు నోచుకునేలా ప్రభుత్వ విధివిధానాల్ని ప్రక్షాళిస్తే- దేశార్థిక భవితవ్యం కాంతిమంతమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.