జగనన్న పంచుడు కాదు... దంచుడు

జలగలు సైతం జాలిపడే విధంగా రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన అయిదేళ్లుగా జనం రక్తాన్ని వివిధ పన్నుల రూపేణా జుర్రేస్తోంది. తలసరి ఆదాయం ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఆంధ్రప్రదేశ్‌ అథమస్థాయిలో ఉందని తెలిసీ, ధరోల్బణం కట్టలు తెంచుకున్న వేళా ప్రజల్ని ఇంతగా చెండుకుతినడం జగన్‌ అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.

Updated : 03 Apr 2024 01:37 IST

లగలు సైతం జాలిపడే విధంగా రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన అయిదేళ్లుగా జనం రక్తాన్ని వివిధ పన్నుల రూపేణా జుర్రేస్తోంది. తలసరి ఆదాయం ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఆంధ్రప్రదేశ్‌ అథమస్థాయిలో ఉందని తెలిసీ, ధరోల్బణం కట్టలు తెంచుకున్న వేళా ప్రజల్ని ఇంతగా చెండుకుతినడం జగన్‌ అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, కోడిగుడ్లు, పాలు, చేపలు, చికెన్‌ వంటి నిత్యావసరాలన్నీ సామాన్య జనానికి అందనంతగా ప్రియమైపోతే- సంక్షేమ మంత్రాన్ని జపించే జగన్‌ ప్రభుత్వం ఒక్కసారైనా సమీక్ష జరిపిందా? ప్రజల్ని ఆదుకునే ప్రణాళిక సిద్ధం చేసిందా? లేదు! బిడ్డల కడుపు ఎలా నింపాలని పేదింటి తల్లులు గుడ్లనీరు కుక్కుకుంటున్నా జగన్‌కు ఏమాత్రం పట్టదు. పాఠశాలల్లో విద్యార్థులకు సీఎం పేరిట వడ్డించే గోరంత ముద్ద కూడా అవసరమైన కేటాయింపుల్లేక అధ్వానంగా మారింది. ఈ పరిస్థితుల్లో తెల్లకార్డుదారులకు కొంత భరోసాగా నిలిచే రేషన్‌ దుకాణాల్లో 2020 జులై నుంచే కందిపప్పు సరఫరాను సగం తెగ్గోసి, కిలో ధరను రూ.40 నుంచి రూ.67కు పెంచేసిన ప్రభుత్వమిది. పంచదార రేటునూ కిలోకు ఏడు రూపాయలు పెంచేయడంతో- 1.23కోట్ల వినియోగదారులపై ఆ రెండు పద్దుల్లో జగన్‌ మోపిన భారం రూ.8500కోట్లు! కేరళలో 2136 సహకార సంఘాల తోడ్పాటుతో ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఇక్కడ ప్రజల కష్టాన్ని గమనించే తీరికే జగన్‌ సర్కారుకు లేదు! దానికి తోడు నవరత్నాల పేరిట నత్తగుల్లల్లాంటి పథకాల్ని రుద్ది, ఆ వంకన తుగ్లక్‌ను మించిన చెత్త పన్నులతో జనాన్ని చెండుకు తింటున్నారు. ప్రజాసంక్షేమం కోసం వందలసార్లు బటన్‌ నొక్కానన్న సీఎం జగన్‌ మాయమాటల మర్మాన్ని కోట్లాది జనం అర్థం చేసుకొంటున్నారు. అయిదేళ్లలో రాష్ట్రప్రజలకు జగన్‌ ప్రభుత్వం మోపిన పన్నులు, ఛార్జీల భారం లక్షా ఎనిమిది వేలకోట్ల రూపాయలకు చేరిందన్న నిజం- పాలనను పీడనగా దిగజార్చిన మోసపుటెత్తులకు నిదర్శనం!

తెలుగుదేశం ప్రభుత్వ విద్యుత్‌ ఒప్పందాలపై నిప్పులు చెరిగి, ‘కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా’నని ప్రమాణ స్వీకార వేదికపైనుంచే సీఎం జగన్‌ ప్రకటించారు. ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు, విద్యుత్‌ఛార్జీల పెంపు రూపేణా దశలవారీగా జగన్‌ సర్కారు బాదుడు రూ.24,856కోట్లు! ట్రూ అప్‌ ఛార్జీల లాంటి వాటిని గతంలో ఎప్పుడైనా విన్నామా? వైకాపా మళ్ళీ అధికారానికి వస్తే, వెంటనే మరో రూ.12,491కోట్లు జనం నుంచి పిండుకునేందుకు పూర్వరంగం సిద్ధం చేసి ఉంచడం జగన్‌ కపట నాటకానికి పరాకాష్ఠ! ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్‌ రేట్లు మనకంటే తక్కువ అంటూ విపక్షనేతగా విస్తృతంగా ప్రచారం చేసి, అధికారానికి వచ్చాక అదనపు వ్యాట్‌, సెస్సుల రూపంలో లీటరుకు మరో మూడు రూపాయల వంతున గుంజుకుంటున్న సంక్షేమ రాజ్యమిది. డీజిల్‌ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు ఎగబాకి నిత్యావసరాలూ ప్రియమైపోతాయన్న తెలివిడితో పలు రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి. జనాన్ని ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించని జగన్‌ పెట్రో డీజిల్‌ అదనపు వడ్డన రూపేణా జమ చేసుకొన్న మొత్తం దాదాపు రూ.20వేలకోట్లు! ఏపీఎస్‌ ఆర్టీసీని ఏదో ఉద్ధరిస్తున్నానని లేనిపోని గొప్పలు చెప్పి, డొక్కు బస్సులతోనే బండి లాగిస్తూ మూడు దఫాలుగా పెంచిన ఛార్జీల భారం రూ.5,243కోట్లు. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి అద్భుత పారదర్శక విధానం తెస్తున్నామంటూ మాఫియా శక్తులకు కోరలు తొడిగిన జగన్‌ ప్రభుత్వం- అమ్మకాల రూపేణా జనం గోళ్లూడగొట్టి వసూలు చేసిందే రూ.4,200కోట్లు! నాలుగు దశాబ్దాలక్రితం ఎన్టీఆర్‌ హయాము నుంచి 2011దాకా నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పేరిట తలా పదివేల వంతున వసూలు చేసిన కక్కుర్తి జగన్‌ సర్కారుది. వైకాపాది పేదల ప్రభుత్వమని చెప్పుకోవడానికే జగన్‌ సిగ్గుపడాలి! పన్నులనేవి చెల్లించేవాడిని చెండుకు తినేలా ఉండరాదన్నది ఆదర్శ ఆర్థికసూత్రం. మెడమీద కత్తి పెట్టి కప్పం కట్టించుకునే ఫ్యాక్షనిస్టుకు ఏం తెలుసు... పేద, నడిమి తరగతి ప్రజల కష్టం నష్టం?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.