జగన్‌ ‘పైసా’చికత్వం

స్వతంత్ర భారతావని గతంలో కనీవినీ ఎరుగని అవినీతి అనకొండ- జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అబ్బ అధికారమే పెట్టుబడిగా క్విడ్‌ ప్రొ కొ(నీకది నాకిది) ద్వారా రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ జగన్‌పై సీబీఐ పదకొండు, ఈడీ తొమ్మిది అభియోగ పత్రాలు దాఖలు చేశాయి.

Published : 04 Apr 2024 01:25 IST

స్వతంత్ర భారతావని గతంలో కనీవినీ ఎరుగని అవినీతి అనకొండ- జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అబ్బ అధికారమే పెట్టుబడిగా క్విడ్‌ ప్రొ కొ(నీకది నాకిది) ద్వారా రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ జగన్‌పై సీబీఐ పదకొండు, ఈడీ తొమ్మిది అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. జగన్‌పై అవినీతి కేసుల విచారణ పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందం కావడానికి కారణం ఏమిటని తాజాగా సుప్రీంకోర్టు సీబీఐని నిలదీసింది. జగన్‌పై కేసుల నత్తనడకకు కారణాలు వెల్లడిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని లోగడ ఆదేశించినా ఎందుకు స్పందించలేదనీ సూటిగా ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణకు హాజరు కాకుండా సీఎం జగన్‌కు శాశ్వత మినహాయింపు అనుగ్రహిస్తూ తెలంగాణ హైకోర్టు 2020 ఆగస్టులో తీర్పు ఇవ్వడం తెలిసిందే. జగన్‌ బెయిల్‌ రద్దు చెయ్యాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌నూ అదే ఏడాది అక్టోబరులో హైకోర్టు తోసిపుచ్చింది. ఆ రెండు ఉత్తర్వులనూ సవాలు చేస్తూ- జగన్‌పై పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 11 కేసుల విచారణ 3,041 సార్లు వాయిదాపడిందని రఘురామ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. జగన్‌ కోరినట్లు కేసుల్ని వాయిదా వేసేలా సీబీఐ స్వేచ్ఛనిచ్చినట్లు కనిపిస్తోందనీ ఆరోపించారు. కేసుల పూర్వాపరాలు గమనిస్తే అవి కేవలం అభియోగాలు కావు, కఠిన వాస్తవాలు అన్న సత్యం బోధపడుతుంది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్‌ కొత్తగా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన- హోదాలో మార్పు తప్ప కేసులో ఎలాంటి తేడా లేదని, హాజరు మినహాయింపు చట్టసమ్మతం కాదనీ 2019 అక్టోబరులో సీబీఐ గట్టిగా వాదించింది. 2022లో హైకోర్టు మినహాయింపు ఇచ్చాక ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా సీబీఐ మన్నుతిన్న పాములా ఎందుకు మిన్నకుంది?

ముఖ్యమంత్రిగా వైఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఆస్తులు గనుల్ని ప్రైవేటు వ్యక్తులు కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టగా, వారంతా వందల కోట్ల రూపాయల ముడుపుల్ని జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్ళించడం నూరుశాతం నిజమని సీబీఐ ఈడీ దర్యాప్తులు స్పష్టీకరిస్తున్నాయి. గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌ పోర్టు, పారిశ్రామికవాడ నిమిత్తం 12,973 ఎకరాల్ని నిమ్మగడ్డ ప్రసాద్‌కు కేటాయించిన వైఎస్‌ ఒంగోలు విమానాశ్రయ కాంట్రాక్టునూ అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు రూ.854కోట్లు. ఈ కేసులో జగన్‌ సహా 14మంది నిందితులు! ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా కాగ్నా నదుల నుంచి నీటిని కేటాయించి, కడప జిల్లాలో భూమి లీజు పొడిగించినందుకు జగన్‌ కంపెనీలకు దక్కిన ‘ఫీజు’ రూ.140కోట్లు! ఈ కేసులోనూ ఏ1 జగనే. పైసా పెట్టుబడి లేకుండా కంపెనీ పెట్టిన జగన్‌ అందులోని వాటాల్ని విక్రయించి రూ.446 కోట్లను అక్రమంగా ఆర్జించిన జగన్మాయ 2019నాటి సీబీఐ అభియోగపత్రంలో కళ్లకు కడుతోంది. రఘురాం సిమెంట్స్‌ పేరును భారతీ సిమెంట్స్‌గా మార్చేసి, అంబూజా గనుల్నీ లాగేసుకున్న మహానేరంలో నిందితులకు యావజ్జీవ జైలు శిక్షపడే అవకాశం ఉంది. కాబట్టే కేసు విచారణ ప్రాథమిక దశ దాటకుండా నిందితులు 274సార్లు వాయిదాలు తీసుకున్నారు. అర్హత లేకపోయినా ఇందూటెక్‌ జోన్‌కు రంగారెడ్డి జిల్లాలో 250 ఎకరాలు కేటాయించడం, జగన్‌ కంపెనీలకు రూ.70కోట్లు తరలిపోవడంలో తొమ్మిదిమంది నిందితులుగా ఉన్నారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరిట ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి 8844 ఎకరాలతోపాటు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల్నీ వైఎస్‌ ధారాదత్తం చేయడంతో- పైసా పెట్టుబడి లేకుండా జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి గచ్చిబౌలి ప్రాజెక్టులో సగం వాటా సమర్పయామి! ఒక్కో కేసులో ఏడేళ్ల నుంచి యావజ్జీవం దాకా శిక్షపడే తీవ్ర ఆర్థిక నేరాల్లో మొదటి ముద్దాయి- రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే దౌర్భాగ్యం. వందలసార్లు వాయిదాలతో కోర్టులకు మొహం చాటేసి రాష్ట్రాన్ని చెండుకుతింటున్న జగన్‌ ‘పైసా’చికత్వాన్ని మరేమాత్రం ఉపేక్షించకుండా ఇక శిక్షించాల్సింది ప్రజాన్యాయస్థానం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.