గొంతెండుతున్నా పట్టించుకోరా?

మాడు పగలగొట్టే ఎండలు అనగానే ఒకప్పుడు రోహిణి కార్తె గుర్తొచ్చేది. ఈసారి ఫిబ్రవరి నుంచే భగభగమండుతున్న భానుడి ప్రతాపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశీయంగా చాలా చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటేశాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో వడగాడ్పుల తీవ్రత రెట్టింపు కానుందన్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తాజా హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 04 Apr 2024 01:28 IST

మాడు పగలగొట్టే ఎండలు అనగానే ఒకప్పుడు రోహిణి కార్తె గుర్తొచ్చేది. ఈసారి ఫిబ్రవరి నుంచే భగభగమండుతున్న భానుడి ప్రతాపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశీయంగా చాలా చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటేశాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో వడగాడ్పుల తీవ్రత రెట్టింపు కానుందన్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తాజా హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో వడగాలుల ఉద్ధృతి నాలుగు నుంచి ఎనిమిది రోజుల పాటు ఉంటుంది. ఈ ఏడాది పది నుంచి ఇరవై రోజుల పాటు అవి విరుచుకుపడవచ్చు అన్నది శాస్త్రవేత్తల అంచనా! సార్వత్రిక ఎన్నికల కోలాహలంలో మునిగిన జనసామాన్యానికి వడదెబ్బలు ప్రమాదకరం కాకూడదంటే- సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ప్రకృతితో చెలగాటం ఆడుతున్న మానవుడి స్వార్థం- వసుధను రుజాగ్రస్తం చేస్తోంది. దాని పర్యవసానంగానే కరవులు, వరదలు, వడగాడ్పుల వంటి ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతున్నాయి. వేడిగాలుల విజృంభణ వల్ల రానున్న కాలంలో భారతదేశ వాసుల ఆయుర్దాయం తెగ్గోసుకుపోతుందని, ఆకస్మిక మరణాలు అధికమవుతాయని ప్రపంచబ్యాంకు రెండేళ్ల కిందటే హెచ్చరించింది. వడగాడ్పులు శ్రామికుల ఉపాధిని దెబ్బతీసి, వ్యవసాయ ఉత్పాదకతను హరించివేస్తాయి. వాటి కారణంగా 2030 నాటికి ఇండియా తన జీడీపీలో 5.4శాతం మేర కోల్పోవచ్చునని క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ నివేదిక గతంలో లెక్కకట్టింది. ఈ ఉత్పాతాలను నివారించాలంటే- అధికోష్ణ పరిస్థితులపై ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తూ, నష్టనివారణ మార్గాలను సూచించే సమర్థ కార్యాచరణ ప్రణాళికల అమలు సత్వరం కార్యరూపం దాల్చాలి!

ఎల్‌ నినో మూలంగా నిరుడు దేశీయంగా సరిగ్గా వర్షాలు కురవలేదు. దాంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే జలవనరులు అడుగంటిపోయాయి. గుక్కెడు నీటికోసం జనం కిలోమీటర్ల కొద్దీ నడిచివెళ్ళాల్సి వస్తోంది. ఉదయం నుంచే ఎండ చుర్రుమనిపిస్తున్న పరిస్థితుల్లో- నీటికోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న సామాన్యుల అగచాట్లు దయనీయమైనవి. కట్టుతప్పిన ఉష్ణతాపం మూలంగా వడదెబ్బ ముప్పు అధికమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని వారు సూచిస్తున్నారు. 2024 నాటికి గ్రామీణ భారతానికి నల్లా నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) ఇంకా పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోలేదు. జగన్‌ పాలబడిన ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ఇక్కట్లు మరింతగా ముమ్మరించాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక పనులను పట్టించుకోని జగన్‌- రాష్ట్ర వాటా నిధులను సమకూర్చకుండా ‘జేజేఎం’ను నిష్ఫలం చేశారు. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాలకు తాగునీటిని అందించేందుకు ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్‌ రుణసాయంతో గత తెదేపా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టునూ జగన్‌ పాడుపెట్టేశారు. ఫలితంగా ఏపీలో మొన్న ఫిబ్రవరి నుంచే ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. పగిలిపోయిన పాత పైపులైన్లను మార్చడానికి కూడా మనసొప్పని జగన్‌ ఏలుబడిలో కలుషిత జలాలు ఏపీ ప్రజారోగ్యాన్ని కుంగదీస్తున్నాయి. వాతావరణ మార్పులు పోనుపోను తీవ్రతరమై జనజీవితాలకు ప్రాణసంకటమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాలకుల దార్శనికతే ప్రజల ప్రాణాలకు రక్షరేకు కాగలుగుతుంది. అది ఏ కోశానా లేని జగన్‌- స్వీయ అధికారదాహాన్ని తీర్చుకుంటూ, తాగునీటి కోసం ఏపీ అంగలార్చేలా చేశారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు