చిరుదీపాల్నీ చిదిమేసిన జగన్‌

బొంకరా బొంకరా పోలిగా అంటే, సీఎం జగన్‌తో తాను పోటీపడలేనని జంకుతాడు. మాటలు మోత, చేతలు రోతగా దిగజారిన వైకాపా అయిదేళ్ల పాలన- సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ఉరితాడు! రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరవాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది ఎంఎస్‌ఎంఈలేనంటూ వాటి సముద్ధరణకు జగన్‌ ప్రభుత్వం ఘనసంకల్పం ప్రకటించింది.

Published : 13 Apr 2024 01:10 IST

బొంకరా బొంకరా పోలిగా అంటే, సీఎం జగన్‌తో తాను పోటీపడలేనని జంకుతాడు. మాటలు మోత, చేతలు రోతగా దిగజారిన వైకాపా అయిదేళ్ల పాలన- సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ఉరితాడు! రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరవాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది ఎంఎస్‌ఎంఈలేనంటూ వాటి సముద్ధరణకు జగన్‌ ప్రభుత్వం ఘనసంకల్పం ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా కుదేలైన ఈ రంగాన్ని పునర్నిర్మించేందుకు అంటూ మూడు విస్పష్ట వాగ్దానాలు చేసింది. లాక్‌డౌన్‌ కాలంలో ఎంఎస్‌ఎంఈలు చెల్లించాల్సిన రూ.187.8కోట్ల స్థిర విద్యుత్‌ ఛార్జీల మాఫీ అందులో మొదటిది. ఈనాటి దాకా దాని ఊసెత్తిన పాపాన పోలేదు జగన్‌ సర్కారు! రూ.200కోట్లతో నిర్వహణ మూలధన నిధి ఏర్పాటు మరొకటి. దాన్ని వైకాపా ప్రభుత్వం ఏనాడో విస్మరించింది! ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే వస్తు సేవల్లో పాతికశాతం ఎంఎస్‌ఎంఈల నుంచే సేకరించాలని జగన్‌ ఘనంగా చాటారు. సంక్షుభిత కాలంలో విశ్వసనీయ కొనుగోలుదారుగా రాష్ట్రప్రభుత్వమే నిలుస్తుందని భావించిన లక్షలాది యూనిట్లను జగన్‌ నట్టేట ముంచారు. చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిని సర్కారు అవసరాలకోసం కొనగల అవకాశం ఉందని గుర్తించామన్న జగన్‌- నేటికీ దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనేలేదు. మానవత్వమే పునాదిగా ప్రభుత్వం పనిచేస్తుందని మరచిపోవద్దంటూ కలెక్టర్లకు ఉద్బోధించి, ఎంఎస్‌ఎంఈలను జగనే కష్టాల కాష్ఠంలోకి విసిరేశారు. అవసరమైన విడిభాగాలను ప్రాధాన్య సేకరణ విధానం ద్వారా రక్షణశాఖే ఎంఎస్‌ఎంఈలనుంచి కొనుగోలు చేస్తోంది. అలాంటి చొరవ చూపకుండా  పోచికోలు వాగ్దానాలతో ఎంఎస్‌ఎంఈలను వంచించి లక్షలమంది బతుకుతెరువును అలక్ష్యం చేసిన జగన్‌ నయవంచన క్షంతవ్యం కానిది!

గోరంత దీపం కొండంత వెలుగు అన్న నానుడి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సరిగ్గా నప్పుతుంది. 40శాతం అసంఘటిత రంగ కార్మికుల ఉపాధికి ఆసరాగా ఉన్న ఈ చిరుదివ్వెలు ఏ ఉత్పాతాల్లోనూ కొడిగట్టకుండా కాచుకోవడం ప్రభుత్వాల మౌలిక విధి. కొవిడ్‌ కష్టకాలంలో ఎంఎస్‌ఎంఈల అత్యవసర రుణవసతి హామీకి మోదీ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే- రాష్ట్రంలో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకొన్న భ్రష్ట చరిత్ర జగన్‌ ప్రభుత్వానిది! వైకాపా అధికారంలోకి వచ్చాక కొత్తగా రెండున్నర లక్షల యూనిట్లు ఏర్పాటై, 16.5లక్షల మందికి ఉపాధి లభించిందన్నదీ శుద్ధ అబద్ధమే! కొవిడ్‌ కష్టాలనుంచి చిరువ్యాపారుల్ని ఒడ్డున పడేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈల నిర్వచనం పరిధిని విస్తరించింది. చిన్నా చితకా వ్యాపారులకూ ఉద్యమ్‌ పోర్టల్‌ను వేదిక చెయ్యడంతో దాంట్లో ‘ఎంఎస్‌ఎంఈ’ల సంఖ్య బాగా పెరిగింది. దాంట్లోని వివరాల ఆధారంగా కాకిలెక్కలు వల్లిస్తున్న జగన్‌ సర్కారుకు వాస్తవంగా రాష్ట్రంలో ఎన్ని యూనిట్లు, ఏ దశలో ఉన్నాయో కూడా తెలియదు. నాలుగేళ్లక్రితం ఎంఎస్‌ఎంఈలపై సమగ్ర పరిశ్రమల సర్వే చేసిన ప్రభుత్వం దాన్ని ఎక్కడో పూడ్చిపెట్టింది! మళ్ళీ కొత్తగా రైజింగ్‌ అండ్‌ యాక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పెర్ఫామెన్స్‌ (ర్యాంప్‌) పేరిట సర్వే చేపట్టి వాటి సమస్యల్ని గుర్తించి పరిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరతీసింది. కొవిడ్‌ సంక్షోభం సుడిలో చిక్కి 20శాతం చిన్న పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. రెండేళ్లుగా రెండున్నర వేలకోట్ల రూపాయల ప్రోత్సాహక బకాయిల్ని విడుదల చెయ్యకుండా బిగపట్టి వాటి ఉసురుపోసుకున్నది జగన్‌ ప్రభుత్వమే. జగన్‌ పుణ్యమా అని కరెంటు, డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదల పిడుగుపాటుగా మారి, ముడిసరకు రేట్లూ ప్రియమైపోవడంతో ఎంఎస్‌ఎంఈల నిర్వహణే కత్తిమీద సాముగా మారింది. దానికి తోడు చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారాన్ని పాతిక రెట్లు పెంచడం- అమానుషత్వానికి పరాకాష్ఠ. సామాన్యుల కడుపు కొట్టే జగన్‌ సర్కారును సాగనంపితేనే ఎంఎస్‌ఎంఈలకు ఊరట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.