మద్య మారీచుడు జగన్‌

రాజ్యాంగబద్ధంగా సాగాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థను సాంతం నేరగ్రస్తం చేసిన పాపం జగన్‌మోహన్‌ రెడ్డిది. సీనియారిటీని అణగదొక్కి తన తైనాతీల్ని కీలక పోస్టుల్లో ప్రతిష్ఠించిన జగన్‌ ఎన్నికల్లో అనుచిత లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఎన్‌డీఏ ఫిర్యాదు చేసిన రోజునే, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీపై ఈసీ వేటు వేసింది.

Published : 18 Apr 2024 00:19 IST

రాజ్యాంగబద్ధంగా సాగాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థను సాంతం నేరగ్రస్తం చేసిన పాపం జగన్‌మోహన్‌ రెడ్డిది. సీనియారిటీని అణగదొక్కి తన తైనాతీల్ని కీలక పోస్టుల్లో ప్రతిష్ఠించిన జగన్‌ ఎన్నికల్లో అనుచిత లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఎన్‌డీఏ ఫిర్యాదు చేసిన రోజునే, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీపై ఈసీ వేటు వేసింది. ప్రజల బలహీనతలతో ఆడుకొనే జగన్‌కు వంత పాడుతూ, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని సరుకును వైకాపా నేతలకే దత్తం చేసి, విపక్షాలకు ఉత్తచేయి చూపారన్నది బెవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై ఆరోపణ! వాస్తవానికి నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.1.54లక్షల కోట్లు పిండేసిన మద్యం పాలసీ అమలులో జగన్‌ అడుగులకు మడుగులొత్తిందే ఆయన! కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తామని, చివరకు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మాత్రమే లభ్యమయ్యేలా చేసి ఓట్లు అడగటానికి వస్తామనీ జగన్‌ వాగ్దానం చేశారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి, బెల్టుషాపుల్ని రద్దు చేసి, మద్యం రేట్లను పెంచి తాగుడు వ్యసనాన్ని నియంత్రిస్తానన్న జగన్‌- ఏరులై పారే మద్యానికి నల్లధన ప్రవాహాల్ని జోడించారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకం అన్నీ వైకాపా నేతల పరం చేసి, బార్ల సంఖ్యను పెంచి, వాక్‌ ఇన్‌ స్టోర్లు తెరిచి, బెల్టుషాపుల దందా కొనసాగించారు. బార్లు బెల్టుషాపుల్లో అధిక ధరల విక్రయాలతో అనధికారికంగా దోచుకొంది రూ.30వేల కోట్లు! మూడు దశల్లో నిషేధం అన్న జగన్‌ జమానాలో మద్యం విక్రయాలు క్రమంగా తగ్గాల్సింది పోయి, తెదేపా హయాముతో పోలిస్తే పెరగడం సిగ్గుచేటు! ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి, తనవాళ్ల చేతుల్లోకొచ్చిన డిస్టిలరీల నుంచే అడ్డమైన బ్రాండ్ల మద్యాన్నీ కొని, అభాగ్యుల జీవితాలతో మృత్యు క్రీడలాడింది జగన్‌ సర్కారు. వ్యసనపరుల్లో 40శాతం మంది కాలేయాలు నాలుగేళ్లలోనే చెడిపోయి మోగుతున్న చావుడప్పులు- కనీ వినీ ఎరుగని అరాచక పాలనకు అద్దం పడుతున్నాయిప్పుడు!

వైకాపా రాకముందు మద్యం టోకు వ్యాపారానికే పరిమితమైన బెవరేజస్‌ కార్పొరేషన్‌ దరిమిలా చిల్లర వ్యాపారానికీ విస్తరించింది. దానికే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాల్ని కాపాడేలా చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలు బాధ్యతను జగన్‌ ప్రభుత్వం 2021 సెప్టెంబరులో అప్పగించింది. దేశంలో ఎక్కడైనా ఈ తరహా వైపరీత్యం ఉంటుందా? లిక్కర్‌ వినియోగం క్రమంగా తగ్గుతూ పోయి అంతిమంగా నిషేధం లాంటి పరిస్థితి వచ్చేలా చూడటం ప్రజాప్రభుత్వాల విధి అని రాజ్యాంగం చాటుతోంది. అందుకు భిన్నంగా వ్యసనపరుల గొంతుల్లో గరాటాలు పెట్టి గరళం గుమ్మరిస్తున్న జగన్‌ ‘పైసా’చికత్వం అంతటితో ఆగలేదు. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనన్న పెద్దమనిషి- మద్యంపైనే రాజ్యాంగ విరుద్ధంగా రూ.38వేల కోట్ల రుణాల్ని రాబట్టి వాడేసుకున్నారు. ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి, బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.11,850కోట్లు సేకరించడానికీ నిరుడు విఫలయత్నం చేసింది! సర్కారు ఆదాయాన్ని మళ్ళించి ఇలా కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించడం రాజ్యాంగవిరుద్ధమని, కేంద్ర ప్రభుత్వమే హెచ్చరించినా జగన్‌ పట్టించుకోనే లేదు. రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఆర్థిక బలిమి కోసం, అది వడ్డీలు, రుణాలు కట్టడం కోసం అభాగ్య జనం ఎల్లపుడూ తాగి తాగి చావాలి! ప్రభుత్వ పెద్దలు ఆ కార్పొరేషన్‌ ద్వారా వేలకోట్ల రూపాయల అప్పులు చేస్తూ పదో పరకో పంచి తమ ఆస్తులు పెంచుకొంటూపోవాలి! ఇదీ మద్య మారీచుడిగా జగన్‌ సృష్టించిన విష వలయం. ‘మద్యం ఆదాయాన్ని తగ్గించి సంక్షేమ కార్యక్రమాల్ని అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే విపక్షం విష ప్రచారం చేస్తోంది’ అని జగన్‌ అసెంబ్లీలోనే సెలవిచ్చారు. కొత్తగా పరిశ్రమలు పెట్టి సేవారంగాన్ని విస్తరించడం ద్వారా రాష్ట్ర రాబడి పెంచే రాజమార్గం ఫ్యాక్షనిస్టు జగన్‌కు ఏమాత్రం తెలియదు. శవాలతో, జీవచ్ఛవాలతో వ్యాపారం చేసే జగన్‌ను నమ్ముకొంటే- రాష్ట్రానికి వర్తమానమే కాదు, భవిష్యత్తూ పెను చీకటే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.