బీసీల విద్రోహి జగన్‌!

నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌, అతగాడి దుష్ప్రచార సారథి పాల్‌ జోసెఫ్‌ గోబెల్స్‌ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న జగన్‌ రాష్ట్ర ప్రజల ఆశలూ ఆకాంక్షల్ని ఎలా నుగ్గునూచ చేసిందీ అయిదేళ్ల రాక్షసపాలన కళ్లకు కడుతోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్లమంది వెనకబడ్డ కులాల (బీసీ)వారున్నారు.

Published : 22 Apr 2024 01:03 IST

నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌, అతగాడి దుష్ప్రచార సారథి పాల్‌ జోసెఫ్‌ గోబెల్స్‌ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న జగన్‌ రాష్ట్ర ప్రజల ఆశలూ ఆకాంక్షల్ని ఎలా నుగ్గునూచ చేసిందీ అయిదేళ్ల రాక్షసపాలన కళ్లకు కడుతోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్లమంది వెనకబడ్డ కులాల (బీసీ)వారున్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌కాదు, బ్యాక్‌బోన్‌(వెన్నెముక) క్లాస్‌ అని సూత్రీకరించి, చంద్రబాబు సంక్షేమ పంథాను తృణీకరించి ఏలూరు బీసీ డిక్లరేషన్‌ ద్వారా జగన్‌ చేసిన వాగ్దానాలు లెక్కలేనన్ని! బీసీల సంక్షేమంకోసం ఏటా రూ.15వేలకోట్లకు తక్కువ కాకుండా వ్యయీకరిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని, వీధుల్లో వ్యాపారాలు చేసుకొనేవారికి కోరినప్పుడల్లా సున్నా వడ్డీకి రూ.10వేలు అందిస్తామనీ జగన్‌ నమ్మబలికారు. మూడోవంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తామన్న జగన్‌ ఆడిన మాట తప్పడమే కాదు, ఏడాదిన్నర కాలంలోనే 90శాతం వాగ్దానాల్ని నిలబెట్టుకొన్నానంటూ గోబెల్స్‌ సైతం సిగ్గుపడే స్థాయిలో డప్పు కొట్టుకొన్నారు. మొత్తం 139 కులాల కోసం 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి, వాటికి అంతే సంఖ్యలో ఛైర్మన్లను, 672 మంది డైరెక్టర్లను నియమించి బీసీల సాధికారతకు అదే కొలమానమంటున్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి నవరత్నాల పేరిట బడ్జెట్లో కేటాయించే నిధుల్నే బీసీ సబ్‌ప్లాన్‌ కింద చూపించి, వాటినే రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ ద్వారా తక్కిన 56 కార్పొరేషన్లకూ ఆయా జనాభా దామాషా ప్రకారం విభజించి జగన్‌ నయా వంచనకు ఒడిగట్టారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యాసాధికారత దిశగా అడుగులు వేశామని గొప్పలు చెప్పుకొంటున్న పెద్దమనిషి- స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్లకు కోత కోసి, 16,800 పదవులు బీసీలకు అందకుండా చేసిన ద్రోహి! కార్పొరేషన్లను నామ్‌ కే వాస్తేగా మార్చి, కేంద్రం ఇచ్చే సాయాన్నీ అందకుండా చేసి బీసీ సాధికారతకు అడుగడుగునా ఉరితాళ్లు పేనిన నేరం నిశ్చయంగా జగన్‌ మోహన్‌ రెడ్డిది!

కులవృత్తులను నమ్ముకొని కుటుంబ పోషణకు నానా అగచాట్లు పడుతున్న బీసీలను పేదరికం నుంచి బయట పడేయాలంటే, పాలకులు పెద్దమనసు చేసుకోవాలి. సీఎంగా జగన్‌కు ఉన్నది పెద్ద మనసు కాదు, ప్రచార కండూతి! తెలుగుదేశం హయాములో బ్యాంకుల వాటాతో కలిపి స్వయం ఉపాధి రుణాలకింద 3.15 లక్షల మంది బీసీలకు చేకూరిన లబ్ధి రూ.2400కోట్లు! అదే జగన్‌ జమానాలో 3800మంది లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.200కోట్లు! బీసీల్లోనూ అత్యంత వెనకబడిన(ఎంబీసీ) వర్గాలకోసం ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి 90శాతం రాయితీతో రుణాలిచ్చే పథకాన్ని తెలుగుదేశం అమలుచేస్తే, జగన్‌ సర్కారు దానికి చెల్లుకొట్టింది. 2019లో వైకాపా వచ్చేనాటికి బ్యాంకుల్లో ఉన్న బీసీ నిధులు రూ.200కోట్లనూ కైంకర్యం చేసింది! స్వయం ఉపాధి రుణాల కోసం తెదేపా చివరి సంవత్సరంలో రూ.1030కోట్లు కేటాయించగా దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి. నిధుల్నీ దరఖాస్తుల్నీ రద్దుచేసేసిన జగన్‌ ప్రభుత్వం- 17 రకాల కుల వృత్తులకు రాయితీతో ఆధునిక పరికరాలు అందించే ‘ఆదరణ’నూ అటకెక్కించేసింది. చొరవ చురుకుదనం గల బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు గతంలో ఉన్న రాయితీల్ని నిర్దాక్షిణ్యంగా కోత కోసేసింది. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం పేరిట బీసీ పిల్లలకు ప్రాథమిక చదువుల్ని దూరం చేసిన జగన్‌- విదేశీ విద్యాదీవెన పేరిట బీసీలతో క్రూర పరిహాసం ఆడారు. సబ్జెక్టులవారీగా ‘టాప్‌ 50 ర్యాంకు’ విశ్వవిద్యాలయాల్లో ఎంపికైనవారికే ప్రభుత్వసాయం అన్న నిబంధనతో వారి బంగరు భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 బీసీ స్టడీ సర్కిళ్లనూ తూతూమంత్రంగా మార్చేశారు. ఇలా బీసీ సోదరుల వర్తమానాన్నే కాదు, భవిష్యత్తునూ బలిపీఠం మీదకు నెట్టిన జగన్‌ ఒక్కముక్కలో- అభివృద్ధి వినాశక చక్రవర్తి. వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కితే చాలదా- హిట్లర్‌ తరహా పీడకుడి నుంచి విముక్తి పొందడానికి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.