నేరగాళ్లకా అధికార పీఠాలు?

నేరగ్రస్త రాజకీయాలు దేశానికెంత అప్రతిష్ఠో దాదాపు రెండు దశాబ్దాలనాడే సర్వోన్నత న్యాయస్థానం తేటతెల్లం చేసింది. చట్టాలను అతిక్రమించేవారు శాసన నిర్మాతలు కారాదని, నేర నేపథ్యం కలిగినవారు ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తారనీ హెచ్చరించింది.  

Updated : 24 Apr 2024 06:39 IST

నేరగ్రస్త రాజకీయాలు దేశానికెంత అప్రతిష్ఠో దాదాపు రెండు దశాబ్దాలనాడే సర్వోన్నత న్యాయస్థానం తేటతెల్లం చేసింది. చట్టాలను అతిక్రమించేవారు శాసన నిర్మాతలు కారాదని, నేర నేపథ్యం కలిగినవారు ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తారనీ హెచ్చరించింది. వాస్తవంలో హత్యలు మొదలు అత్యాచారాల వరకు, అపహరణల నుంచి మనీలాండరింగ్‌ దాకా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నవాళ్లూ ప్రజాప్రతినిధులై యథేచ్ఛగా చక్రం తిప్పే దౌర్భాగ్యం దేశానికి దాపురించింది. సచ్ఛీల రాజకీయాలకు నిబద్ధత చాటుతూనే ఏరి కోరి నేరచరితుల్ని అక్కున చేర్చుకోవడంలో పార్టీల పోటాపోటీ పరమ రోత పుట్టిస్తోంది. పద్నాలుగో లోక్‌సభలో 24శాతంగా నమోదైన నేరచరితులు తదుపరి సభలో 30శాతానికి విస్తరించారు. ఆ సంఖ్య 16వ సభలో 34శాతానికి, ఇటీవలే గడువు ముగిసిన 17వ లోక్‌సభలో 44శాతానికి ఎగబాకింది. అశ్విన్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన అర్జీపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న విజయ్‌ హన్సారియా సమర్పించిన అఫిడవిట్‌ ఈ యథార్థాన్ని ధ్రువీకరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల పరిష్కరణ అంశాన్ని హైకోర్టులు నిశితంగా పర్యవేక్షించాలని హన్సారియా సూచించారు. ఆయా కేసుల నిమిత్తం సత్వర విచారణను లక్షించి ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించేలా సుప్రీం ఆదేశాల్నీ అమికస్‌ క్యూరీ అభిలషిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై 4474 కేసులు పోగుపడి ఉన్నాయి. ఏ కేసైనా మూడేళ్లకంటే ఎక్కువ కాలం పెండింగులో ఉంటే అందుకు కారణాలేమిటో ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తుల్ని హైకోర్టులు వివరణ కోరాలని హన్సారియా తాజాగా సిఫార్సు చేశారు. కేసుల విచారణ ఏళ్లూ పూళ్లూ సాగడం నేరచరిత నేతలకు అయాచిత వరమవుతోంది. ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసుల విచారణ ఇంత మందకొడిగా అఘోరించడం... నేరన్యాయ వ్యవస్థకే నగుబాటు!

‘వేధింపులు, హత్య, అపహరణ లాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌ కాలేడు... పోలీస్‌ కానిస్టేబుల్‌ కొలువుకూ పనికిరాడు... కానీ, అవే నేరాలకు పాల్పడిన వ్యక్తి మంత్రి అవుతున్నాడు’ అని ఏడాది క్రితం సుప్రీం ధర్మాసనం సూటిగా ఆక్షేపించింది. తీవ్ర అవినీతి బాగోతాలకు తెగబడినవాళ్లూ ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాలు అధిష్ఠించడం భారత ప్రజాస్వామ్య ప్రారబ్ధం! అయిదేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసులలో న్యాయసమీక్ష అనంతరం నేరాభియోగాల దశలోనే సంబంధిత నేతలపై అనర్హత వేటు వేయాలని లా కమిషన్‌ గతంలోనే విలువైన సిఫార్సు చేసింది. నేరం రుజువైన నాయకుల్ని ప్రజాజీవితం నుంచి శాశ్వతంగా నిషేధిస్తేనే, సమకాలీన రాజకీయాల ముఖచిత్రం మారుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగమైన రాజకీయ పక్షాలు- గెలుపు గుర్రాలకు కాదు, జవాబుదారీతనానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. పార్టీల నడవడిలో, అభ్యర్థుల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలు పాలన ప్రమాణాల్ని పెంపొందించడానికి దోహదపడతాయి. ఈ కీలకాంశాన్నే పార్టీలు గాలికొదిలేస్తున్నాయి. తనపై 26 కేసులున్నట్లు పులివెందుల ఎన్నికల అధికారికి జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా సమర్పించిన ప్రమాణపత్రంలో వెల్లడించారు. 11 సీబీఐ కేసులలో, తొమ్మిది ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) కేసులలో నిందితుడిగా ఉన్న ఆయన పదేళ్లుగా బెయిలుపై కొనసాగుతున్నారు. వైకాపా అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చలాయించుకుంటున్న జగన్‌- నేరగ్రస్త రాజకీయాల వికృత రూపానికి నిలువెత్తు ప్రతీక! ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరంలో ఒక అంచె ముగిసింది. ఇంకో ఆరు దశలు మిగిలి ఉన్నాయి. తొలి రెండు దశల్లో 2810 మంది పోటీదారుల్లో 501మంది (18శాతం)పై క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు ఏడీఆర్‌ (ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం) మదింపు వేసింది. క్షీణప్రమాణాల్లో కొత్త రికార్డు నెలకొల్పాలన్న యావతో తక్కిన దశల్లో నేరచరితుల ఉరవడి పెరిగితే... జాతికది అశుభ సమాచారమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.