జగనన్న భూభక్షణ చట్టం

అభాగ్య జనం మెడపై కత్తిపెట్టి, వారి డబ్బూదస్కం దోచుకునే ఘరానా దొంగల కథలెన్నో విన్నాం. వాళ్లే నయమనిపించేలా జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ప్రజాకంటక పాలనను అయిదేళ్లుగా కళ్లారా చూస్తున్నాం! జాతివనరులను స్వేచ్ఛగా కొల్లగొట్టిన జగన్‌ రాజ్యం- ప్రజల స్థిరాస్తులపైనా కన్నేసింది.

Updated : 25 Apr 2024 15:51 IST

అభాగ్య జనం మెడపై కత్తిపెట్టి, వారి డబ్బూదస్కం దోచుకునే ఘరానా దొంగల కథలెన్నో విన్నాం. వాళ్లే నయమనిపించేలా జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ప్రజాకంటక పాలనను అయిదేళ్లుగా కళ్లారా చూస్తున్నాం! జాతివనరులను స్వేచ్ఛగా కొల్లగొట్టిన జగన్‌ రాజ్యం- ప్రజల స్థిరాస్తులపైనా కన్నేసింది. సామాన్యుల భూములను వారికి కాకుండా చేసేంతటి ప్రమాదకరమైన లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను వైకాపా సర్కారు మొన్నామధ్య తీసుకొచ్చింది. దానిప్రకారం- ఎవరో ఒకరిని ‘టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌’(టీఆర్‌ఓ)గా నియమిస్తారు. ఆ అధికారి రూపొందించే స్థిరాస్తుల రికార్డే ఇక అన్నింటికీ ప్రామాణికం. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పత్రాలన్నీ చేతుల్లో  ఉన్నాసరే- టీఆర్‌ఓ రిజిస్టర్‌లో పేరు లేకపోతే ఇక అంతే సంగతులు! రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్థలం కొనుక్కుంటాడొక వ్యక్తి... అతనికి తెలియకుండా ఆ భూమి మరొకరి పేరిట టీఆర్‌ఓ రికార్డుల్లోకి ఎక్కుతుంది. రెండేళ్లలోగా దానిపై అభ్యంతరాలేమీ రాకపోతే- రిజిస్టర్‌లో పేరున్న మనిషే భూయజమాని అయిపోతాడు. ఇలా జనం ఆస్తులను అతిసులువుగా పరాయివాళ్ల పాల్జేసే పాతక శాసనమిది! సివిల్‌ కోర్టులను కాదని, భూవివాదాలను పరిష్కరించే అధికారాన్నీ సర్కారీ సిబ్బందికి కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం- స్వార్థ ప్రయోజనాలకోసం న్యాయవ్యవస్థను బైపాస్‌ చేస్తోందని న్యాయనిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ మోచేతి నీళ్లు గతికే అధికారులతో కలిసి సామాన్యుల స్థలాలు, ప్రభుత్వ దేవాదాయ భూములను స్వాహాచేసే భూబకాసురులకు టైటిలింగ్‌ యాక్ట్‌ అయాచిత వరం కానుంది. అలాంటి దాన్ని చడీచప్పుడు లేకుండా రాష్ట్రం నెత్తిన రుద్దడం- జగన్మోహన దోపిడీ దొర మనస్తత్వానికి మచ్చుతునక!

భూమి అంటే భరోసా... బతుకుకు ఒక ఆసరా! కూతురి పెళ్లికోసమో, బిడ్డల చదువులకో, అనుకోని అనారోగ్యం చుట్టుముట్టినప్పుడో తమకు ఉన్న కొద్దిపాటి భూమిని తాకట్టుపెట్టో, అమ్ముకునో డబ్బు తెచ్చుకుంటారు చాలామంది. అలాంటి లావాదేవీలూ క్రయవిక్రయాలకూ టీఆర్‌ఓ అనుమతి తీసుకుని తీరాలంటోంది జగనన్న కొత్త కిరాతక చట్టం! జనం ఆస్తుల మీద పెత్తనం చలాయించే ఇలాంటి నిబంధనలు- జగన్‌ సర్కారు వండివార్చిన టైటిలింగ్‌ యాక్ట్‌లో అనేకం ఉన్నాయి. భూయాజమాన్యానికి సంబంధించి కోర్టుల్లో ఏవైనా పెండింగ్‌ కేసులు ఉంటే- సంబంధిత వ్యక్తులు ఆ వివరాలను టీఆర్‌ఓకి చెప్పాలట! న్యాయస్థానాలు తీర్పిచ్చిన 15 రోజుల్లోగా ఆ సంగతిని మళ్లీ టీఆర్‌ఓ దృష్టికి తీసుకురావాలట! లేకపోతే కోర్టు ఆదేశాలను అమలు చేయడం కుదరదట! రాజ్యాంగవిరుద్ధమైన ఇటువంటి చట్టాన్ని జగన్‌ తప్ప మరొకరు ఎవరూ చేయలేదు... చేయలేరు కూడా! ఆస్తులను కావాలని వివాదాస్పదం చేసి, వాటిని ‘డిస్‌ప్యూట్‌ రిజిస్టర్‌’లోకి ఎక్కించి, ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌(ఎల్‌టీఏఓ) దగ్గర పంచాయతీ పెట్టించేందుకూ నూతన శాసనం వీలు కల్పిస్తోంది. ఆపై సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కు కట్టుబడి ఎల్‌టీఏఓ నిర్ణయాలు తీసుకోనక్కర్లేదనడం నికార్సయిన అరాచకం. ఎల్‌టీఏఓ ఉత్తర్వులపై బాధితులు హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ మాత్రమే వేయాలనడం పరమ దుర్మార్గం. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే శక్తిలేని సామాన్యుల గతేమిటి? ప్రజల జీవితాలనే కాదు- వారి ఆస్తులనూ ప్రభుత్వమే రక్షించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలను వైకాపా సర్కారు కాలరాసింది. ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అన్న జగన్‌ను నమ్మిన పాపానికి రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఇది. భూభక్షణ చట్టానికి పురుడుపోసి ప్రజల ఆస్తిపాస్తులకు భద్రత లేకుండా చేసిన కుటిల పాలకుణ్ని తరిమికొట్టాల్సిన తరుణమిది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.