డిజిటల్‌ మోసాలపై ఉక్కుపాదం

ఎనిమిదేళ్ల క్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ సారథిగా రఘురాం రాజన్‌ శ్రీకారం చుట్టిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌- ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ) దేశం నలుమూలలా చిలవలు పలవలు వేసుకుపోయింది. 2017-18లో 92కోట్లుగా నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్య ఆపై గణనీయంగా విస్తరిస్తూ వచ్చినట్లు కేంద్రమే లోక్‌సభా ముఖంగా వెల్లడించింది.

Published : 15 May 2024 01:53 IST

ఎనిమిదేళ్ల క్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ సారథిగా రఘురాం రాజన్‌ శ్రీకారం చుట్టిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌- ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ) దేశం నలుమూలలా చిలవలు పలవలు వేసుకుపోయింది. 2017-18లో 92కోట్లుగా నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్య ఆపై గణనీయంగా విస్తరిస్తూ వచ్చినట్లు కేంద్రమే లోక్‌సభా ముఖంగా వెల్లడించింది. 2023-24 చివరికి దేశంలో ఎకాయెకి 13,100కోట్లదాకా యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయని, అంతర్జాతీయంగా డిజిటల్‌ చెల్లింపుల్లో బ్రెజిల్‌, చైనా, థాయ్‌లాండ్‌లను ఇండియా మించిపోయిందని చాటుతున్న గణాంకాలు కళ్లు జిగేల్‌మనిపిస్తున్నాయి. విశ్వవ్యాప్త డిజిటల్‌ లావాదేవీల్లో 46శాతం వాటా భారత్‌దేనంటే- డిజిటల్‌ ఇండియా పురోగమన వేగం విస్మయపరచక మానదు. యూపీఐ లావాదేవీల్లో 86శాతం దాకా ఫోన్‌ పే, గూగుల్‌ పే పద్దుల్లోనే నమోదయ్యాయి. వాటితో పోలిస్తే ‘మీ బొటనవేలే మీ బ్యాంకు’ అంటూ ఏడేళ్లనాడు ప్రధాని మోదీ ఆరంభించిన దేశవాళీ ‘భీమ్‌’ యాప్‌ బాగా వెనకబడింది. యూపీఐ చెల్లింపుల్లో వాల్‌మార్ట్‌ దన్ను కలిగిన రెండు సంస్థల ఆధిపత్యం కొనసాగడంపట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ గతంలోనే అసంతృప్తి వ్యక్తపరచింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల వృద్ధికి సహకరించాలని పార్లమెంటరీ కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి సూచించింది. ఫోన్‌ పే వంటి సంస్థల వాటా యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30శాతానికి మించరాదంటూ 2020లోనే ఎన్‌పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌) చేసిన సిఫార్సును అది గట్టిగా సమర్థించింది. దేశీయ ఫిన్‌టెక్‌ సంస్థలకు తోడ్పాటుపై గుప్పిలి ఇంకా పూర్తిగా తెరవని రిజర్వ్‌ బ్యాంక్‌- డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాల నియంత్రణ పైనా చురుగ్గా దృష్టి సారించాలి!

భారత ఆర్థిక వ్యవస్థలో విశేష మార్పులు చోటు చేసుకుంటున్నట్లు విశ్లేషించిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ 2030 నాటికి దేశీయంగా డిజిటల్‌ వినిమయం సుమారు రూ.28లక్షల కోట్లకు చేరుతుందని మదింపు వేసింది. అప్పటికి డిజిటల్‌ లావాదేవీలు జరిపే పౌరుల సంఖ్య 50కోట్లకు చేరుతుందనీ అంచనా కట్టింది. గతంలో రిజర్వ్‌ బ్యాంక్‌ చొరవతోనే నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలెక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌), ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) వంటి విధానాలు ప్రాచుర్యం పొందాయి. వాటితో పోలిస్తే, డిజిటల్‌ చెల్లింపులకు లభిస్తున్న ప్రజాదరణ ఎన్నో రెట్లు అధికం. శ్రీలంక, మారిషస్‌, ఫ్రాన్స్‌, యూఏఈ, సింగపూర్‌ ప్రభృత దేశాలూ యూపీఐ చెల్లింపుల విధానానికి అధికారికంగా ఆమోదముద్ర వేశాయి. దేశీయంగా క్షేత్రస్థాయి స్పందనా అబ్బురపరుస్తోంది. నేడు చిన్నచిన్న దుకాణాల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపిస్తోంది. జేబులో నగదు లేకపోయినా- చేతిలో చరవాణి, అందులో యూపీఐ యాప్‌ ఉంటే చాలు... క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతున్నాయి. ఈ దశ కన్నా మెరుగుదల సాధించేందుకు కట్టుబాటు చాటుతున్న రిజర్వ్‌ బ్యాంక్‌- దాంతోపాటు డిజిటల్‌ చోరశిఖామణుల కట్టడి ప్రక్రియనూ వేగవంతం చేయాలి. పేమెంట్‌ గేట్‌వేలలోకి ప్రవేశించి కోట్లరూపాయలు కొట్టేస్తున్న ఘరానా నేరగాళ్ల ఉరవడి సాధారణ వినియోగదారుల్ని హడలెత్తిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాంకు ఖాతాలోనిదంతా తుడిచిపెట్టుకుపోయే ముప్పు డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ పట్ల నమ్మకానికే తూట్లు పొడిచేంత ప్రమాదకారి. 55శాతందాకా డిజిటల్‌ మోసాలు యూపీఐకి చెందినవేనంటున్న ‘ప్రాక్సీస్‌’ నివేదిక అత్యవసరంగా పూడ్చాల్సిన కంతలున్నాయని స్పష్టీకరిస్తోంది. సైబర్‌ మాయగాళ్ల చొరబాటుకు తావులేకుండా పకడ్బందీగా డిజిటల్‌ చెల్లింపుల పరిపుష్టీకరణ సాకారమైనప్పుడే- రిజర్వ్‌ బ్యాంక్‌ లక్ష్యం నెరవేరినట్లు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.