ఉన్నత విద్యకు అవినీతి చెదలు

ఏ ఖండంలో, ఏ దేశంలోనైనా విశ్వవిద్యాలయాలు సృజనశక్తులకు రెక్కలు తొడగాలి. జాతి గర్వించదగ్గ స్థాయిలో సమర్థ మానవ వనరుల ఆవిష్కరణకు శాయశక్తులా దోహదపడాలి. ఒక్క ముక్కలో, దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా భాసించాలి.

Published : 22 May 2024 00:14 IST

ఏ ఖండంలో, ఏ దేశంలోనైనా విశ్వవిద్యాలయాలు సృజనశక్తులకు రెక్కలు తొడగాలి. జాతి గర్వించదగ్గ స్థాయిలో సమర్థ మానవ వనరుల ఆవిష్కరణకు శాయశక్తులా దోహదపడాలి. ఒక్క ముక్కలో, దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా భాసించాలి. వాస్తవంలో, దేశీయంగా 11వందలకు పైబడిన యూనివర్సిటీల్లో అత్యధికం అరకొర నిధులు, భారీగా సిబ్బంది ఖాళీలతో సతమతమవుతున్నట్లు లోగడ పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికే స్పష్టీకరించింది. అనంతర కాలంలో దిద్దుబాటు చర్యల సంగతి అలా ఉంచి- వర్సిటీల ప్రతిష్ఠకు మరిన్ని తూట్లు పడుతున్న వైనాన్ని రాష్ట్రాలవారీగా క్షేత్రస్థాయి కథనాలెన్నో ధ్రువీకరిస్తున్నాయి. నిరుడు ఒక గుత్తేదారు నుంచి బిల్లు చెల్లింపుకోసం లంచం తీసుకుంటూ తెలంగాణ వర్సిటీ ఉపకులపతి అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. అయిదు నెలల క్రితం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పెరియార్‌ విశ్వవిద్యాలయ వీసీ జగన్నాథన్‌ అరెస్టయ్యారు. ఆమధ్య అవినీతి ఆరోపణలపైనే పంజాబ్‌ యూనివర్సిటీ సారథ్య బాధ్యతల నుంచి రాజ్‌కుమార్‌ వైదొలగాల్సి వచ్చింది. బెదిరించి లంచాలు దండుకున్నారన్న ఆరోపణలతో 2022 అక్టోబరులో కాన్పుర్‌ విశ్వవిద్యాలయ వీసీ వినయ్‌ పాఠక్‌ మీద యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి చిరునామాలుగా మారి భ్రష్టుపట్టిన అటువంటి వర్సిటీల ఉదంతాలన్నీ ఒకెత్తు. అక్రమాల పుట్టలుగా, నిబంధనల ఉల్లంఘనలకు నెలవులుగా, రాజకీయ అడ్డాలుగా దిగజారి దిగ్భ్రాంతపరుస్తున్న ఏపీ విశ్వవిద్యాలయాల బాగోతాల పరంపర మరొకెత్తు. జాతీయ ర్యాంకుల్లో ఏటేటా దిగజారుతూ నిధుల దారిమళ్ళింపులో, నియామకాలూ పదోన్నతుల్లో అస్మదీయులకే అన్నీ కట్టబెట్టడంలో... జగన్మోహన్‌రెడ్డి సర్వభ్రష్ట పాలన రికార్డులన్నింటినీ బద్దలుగొట్టింది!

ఏడున్నర దశాబ్దాల క్రితమే విశ్వవిద్యాలయ సంఘాధ్యక్షులుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌- జనాభా పెరిగేకొద్దీ విస్తరించే అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టీకరించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పారు. ఆ ఉద్బోధ పాలకశ్రేణుల తలకెక్కి ఉంటే- దేశీయంగా వేలసంఖ్యలో అధ్యాపక ఖాళీలు నేడిలా పేరుకుపోయేవే కాదు. వీసీల నియామకాల్లో విపరీత జాప్యం ఆనవాయితీగా స్థిరపడి ఐఏఎస్‌లను, ఇతర అధికారుల్ని ఇన్‌ఛార్జీలుగా కొలువుతీర్చే పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. తాత్కాలిక నియామకాల మూలాన పాలన, పర్యవేక్షణ గాడితప్పుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది ఖాళీలు, మౌలిక వసతుల కొరత పీడిస్తున్నాయి. నాణ్యతా పర్యవేక్షణ యంత్రాంగం ఉండీ లేనిదై- పరిశోధనలు చతికిలపడుతున్నాయి. ఒకప్పుడు తక్షశిల, నలంద వంటి విశిష్ట విద్యాలయాలకు నిలయమైన దేశం నుంచి ఇప్పుడు లక్షల సంఖ్యలో విదేశాలకు విద్యార్థుల వలసలు పోటెత్తుతున్నాయి. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్‌ ప్రభృత అత్యున్నత విద్యాసంస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. అక్కడ పోటీతత్వాన్ని ప్రేరేపించే వాతావరణం, సృజనాత్మక పరిశోధనలకు అగ్రప్రాధాన్యం- నోబెల్‌ పురస్కార విజేతల్ని విస్తృతంగా ఆవిష్కరిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్‌ తదితరాలు తరచూ నోబెల్‌ జాబితాలో దర్శనమిస్తున్నాయంటే కారణమదే. 140కోట్లకు పైబడిన జన భారతావనిలోనేమో- నోబెల్‌ విజేతల సంఖ్య నేటికీ రెండంకెలకు చేరలేదు. ఆచార్యుల కొరత, పరిశోధనలకు నిధుల లేమి, అనుచిత రాజకీయాలు, అక్రమాలు... ఇక్కడ ఉన్నత విద్యాప్రమాణాలను ఛిద్రం చేస్తున్నాయి. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వంటివి వినూత్న అవకాశాల్ని చేరువ చేస్తూ విప్పారుతున్నాయి. కాలానుగుణ పాఠ్య ప్రణాళికలతో నాణ్యమైన విద్యకు, అత్యుత్తమ బోధనకు విశేష ప్రాధాన్యమిచ్చేలా యూనివర్సిటీల్ని సాకల్యంగా ప్రక్షాళిస్తేనే- విజ్ఞాన ఆధారిత ఆర్థికశక్తిగా ఇండియా నిలదొక్కుకుంటుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.