రాజ్యాంగంపై వైకాపా దాడి!

నచ్చిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న స్వేచ్ఛ- ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ప్రజలను భయపెట్టి, వారి ఓటుహక్కును కబళించి అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే ధూర్త రాజకీయాలు- ప్రజాస్వామ్య మనుగడకు పెనుప్రమాదకరమైనవి.

Published : 23 May 2024 00:39 IST

నచ్చిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న స్వేచ్ఛ- ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ప్రజలను భయపెట్టి, వారి ఓటుహక్కును కబళించి అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే ధూర్త రాజకీయాలు- ప్రజాస్వామ్య మనుగడకు పెనుప్రమాదకరమైనవి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే అరాచకశక్తులను అడ్డుకునితీరాలన్న సుప్రీంకోర్టు- పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ వంటివాటికి తెగబడేవారిని కఠినంగా శిక్షించాలని రెండు దశాబ్దాల క్రితమే అభిప్రాయపడింది. ఆ మేరకు విధి నిర్వహణలో ఎలెక్షన్‌ కమిషన్‌ ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తూనే ఉంది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడిందన్నట్లు- ఈసీ అసమర్థతే అదనుగా ఇటీవలి ఏపీ ఎన్నికల వేళ వైకాపా శ్రేణులు దారుణ దౌర్జన్యాలకు పాల్పడ్డాయి. ఆ క్రమంలోనే మాచర్ల నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ బూత్‌లోకి దర్జాగా జొరబడిన జగన్‌ అనుచర ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి- ఈవీఎంను నేలకు విసిరికొట్టారు. తద్వారా ఆయన భారత రాజ్యాంగంపైనే దాడిచేశారు. అయినప్పటికీ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఘాతుకానికి పాల్పడినట్లు మొదట్లో కేసు నమోదు చేసిన పోలీసులు- ఖాకీ బట్టల ప్రతిష్ఠను మరోసారి వైకాపాకు తాకట్టుపెట్టారు. పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి వీరంగాన్ని కళ్లకుకట్టే వీడియో వెలుగులోకి వచ్చిన దరిమిలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మీడియా ముందుకొచ్చారు. రామకృష్ణారెడ్డి దౌర్జన్యాన్ని సిగ్గుమాలిన చర్యగా ఈసీ ఛీత్కరించినట్లు మీనా సెలవిచ్చారు. తక్షణం అరెస్టు చేయాల్సినంత ఘోరాపరాధానికి ఒడిగట్టిన వైకాపా గూండానేతను ఇన్నాళ్లూ స్వేచ్ఛగా వదిలేసిందెవరు? పోలింగ్‌ రోజు ఏపీలో తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. మరెన్నో ప్రాంతాల్లో హింసాజ్వాలలు ఎగిసిపడ్డాయి. వైకాపాకు వీరవిధేయులైన ఉన్నతాధికారులు, పోలీసులపై ఈసీ ముందుగానే వేటేసి ఉంటే- ఎన్నికల నాడు ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థ వస్త్రాపహరణం జరిగేది కాదన్నది వాస్తవం!

మొన్న మే ఏడో తేదీన గుజరాత్‌లోని దాహోద్‌లో ఓ పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించినవారిని అక్కడి పోలీసులు వెంటనే పట్టుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం(ఆర్‌పీఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ రాసి మరీ వారిని కటకటాల్లోకి నెట్టారు. నిర్దేశిత ఆర్‌పీఏ సెక్షన్ల కింద నేరం రుజువైనవారు- ఆరేళ్ల పాటు చట్టసభల సభ్యత్వానికి అనర్హులవుతారు. పోలింగ్‌ కేంద్రాల కబ్జా అనేది ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుంది కాబట్టి అటువంటి సందర్భంలో విజేతపై అనర్హత వేటువేయవచ్చునని సుప్రీంకోర్టు సైతం గతంలో స్పష్టం చేసింది. బహుశా అందుకే కాబోలు- వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా పోలింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించి ఈవీఎంలను పగలగొట్టినా ఏపీ పోలీసులు ‘ఆర్‌పీఏ’ కింద కేసులు పెట్టలేదు. ఎన్నికల హింస కట్టలు తెంచుకున్నాక ఎప్పటికో ఈసీ తీరిగ్గా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. జగన్‌ పార్టీ ప్రబుద్ధుల నేరాలకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదుచేయని ఖాకీల పిదపబుద్ధులను ‘సిట్‌’ వెలుగులోకి తెచ్చింది. వైకాపా ఆగడాలకు అడుగడుగునా కొమ్ముకాసి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసాల పాల్జేసిన పోలీసులు- ప్రజారక్షక బాధ్యతల్లో కొనసాగేందుకు అర్హులు కానేకారు. ఆ మేరకు వారిపై కొరడా ఝళిపించడంతో పాటు అంగ బలప్రదర్శనతో ఓటర్లను భయకంపితులను చేసిన నాయకులపైనా ఉక్కుపాదం మోపాలి. నేరాభియోగాల నమోదు దశలోనే నేరచరిత నేతలపై అనర్హత వేటువేయాలన్న లా కమిషన్‌ సిఫార్సుల అమలు- క్షుద్ర రాజకీయాల క్షాళనకు విశేషంగా తోడ్పడుతుంది. పార్టీల పెడపోకడలకు సమర్థంగా కళ్ళెంవేసిన టి.ఎన్‌.శేషన్‌- ఎలెక్షన్‌ కమిషన్‌ శక్తిసామర్థ్యాలను దేశానికి చాటిచెప్పారు. ఆయన తెగువే ఆదర్శంగా రాజ్యాంగబద్ధమైన కర్తవ్యదీక్షలో ఈసీ సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై ప్రజావిశ్వాసం ఇనుమడిస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు