నేలకరిచిన నియంత!

అయిదు కోట్ల ఆంధ్రుల సమష్టి విజయమిది... జగన్‌మోహన్‌ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయమిది! జనం తిరగబడి, ప్రభంజనమై విరుచుకుపడి జగన్‌ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భమిది!

Updated : 05 Jun 2024 08:09 IST

యిదు కోట్ల ఆంధ్రుల సమష్టి విజయమిది... జగన్‌మోహన్‌ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయమిది! జనం తిరగబడి, ప్రభంజనమై విరుచుకుపడి జగన్‌ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భమిది! పాలకులు యజమానులు కారు... ప్రజాసేవకులు మాత్రమే. ఆ వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగీరుగా మార్చుకున్న పాపిష్టి ఫాసిస్టు పాలకుడు జగన్‌. వ్యతిరేకులను అణచివేస్తూ, న్యాయమడిగినవారి నెత్తురు కళ్లజూసిన వైకాపా సర్కారు- అవినీతి ఆకాశంలో రాకాసి రాబందై స్వైరవిహారం చేసింది. స్వర్ణాంధ్రను శిథిలం చేసి, అన్ని వర్గాలనూ వెంటాడి వేధించిన జగన్మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే- తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి 164 సీట్లను కట్టబెట్టింది. వైకాపా భ్రష్టపాలనపై మూడోకన్ను తెరిచిన జనసామాన్యం- రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతలను కూటమి నేతల చేతుల్లో పెట్టింది. ‘ఒక్క అవకాశం ఇవ్వండి... మంచి పరిపాలన అందిస్తా’నంటూ ఊరూవాడా ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్‌- రోడ్లు వేయలేదు. పరిశ్రమలను తీసుకురాలేదు. యువతకు ఉపాధి చూపించలేదు. రైతులకు సాగునీరు ఇవ్వలేదు. దళితులూ గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు. ఇవేమీ చేయని జగన్‌- విషపూరితమైన ‘జె’ బ్రాండ్‌ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టనపెట్టుకున్నారు. ఏపీని ‘గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా తయారుచేశారు. వైకాపా ప్రబుద్ధులు అందరూ కలిసి ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడి, మద్యం దందాలూ భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్‌ పార్టీని ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు!  

ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లలోకి లాక్కుపోయిన వైకాపా సర్కారు- రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది. రాక్షసత్వంలో జగన్‌కు సరిజోడులై, తోడుదొంగలై ఏపీని పీల్చిపిప్పి చేసిన వైకాపాసురులపై ఆంధ్ర ప్రజానీకం కసితీరా వేటేసింది. జగన్‌ పార్టీ పాతకాల కారణంగా రాష్ట్రంలో కొడిగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్ళీ పరుగులు తీయించడం- కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాము కానుంది. రాష్ట్ర రుణభారాన్ని దాదాపు రూ.11 లక్షల కోట్లకు చేర్చిన వైకాపా ప్రభుత్వం- ఏపీని దివాలా అంచులకు ఈడ్చుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే రూ.25వేల కోట్ల వరకు అప్పుల ముష్టెత్తిన సర్కారు- ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది. దాన్ని గాడినపెట్టడం, రాష్ట్రాదాయాన్ని పెంచుతూ అభివృద్ధి- సంక్షేమాలను జోడెద్దులుగా నడిపించడం కూటమి సర్కారుకు పెద్దసవాలే. పన్నుల భారం పెంచకుండా సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో- జనం జేబులకు భారీగా చిల్లిపెట్టేందుకు జగన్‌ విధించిన చెత్తపన్నులను తొలగించడం అంతే ప్రధానం. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్‌ ప్రభుత్వం అటకెక్కించింది. జలయజ్ఞాన్ని నిర్విఘ్నం చేయడంపై అది ప్రదర్శించిన దారుణ అలక్ష్యం కారణంగా నిర్మాణ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే సుమారు రూ.95వేల కోట్లు అవసరం. ఆ నిధులను సమీకరించడం, జలయజ్ఞం పనులను వేగవంతం చేయడం కూటమి సర్కారుకు  అగ్నిపరీక్షే. రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కాణాచి కావాల్సిన అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశారు. ఆయన చేతుల్లో చితికిపోయిన రాజధాని నగరానికి మళ్ళీ జీవంపోసే బృహత్తర కర్తవ్యంలో నూతన సర్కారు ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి! 

అధికారంలో ఉన్న అయిదేళ్లలో అక్రమాలకు, అరాచకాలకు తెగబడటమే తప్ప ప్రజావసరాలను జగన్‌ తీర్చిందే లేదు. మాయమాటలతో జనాన్ని బులిపిస్తూ, అడ్డగోలు వాదనలతో అందరినీ బుకాయిస్తూ జగన్‌ ముఠా సాగించిన దోపిడి అంతాఇంతా కాదు.  వైకాపా నేతల అవినీతి మేతలను లోతుగా విచారించి, వారు స్వాహాచేసిన జనం సొమ్మును అణాపైసలతో సహా కక్కించాల్సింది కొత్త ప్రభుత్వమే. విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలో జ్యుడీషియల్‌ కమిషన్లను ఏర్పాటు చేసి, అక్రమార్కులకు అరదండాలు వేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని కుళ్లబొడిచిన జగన్‌- రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ పాడుచేశారు. ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు చాలామందిని పాదసేవకులుగా మార్చుకుని ప్రజాకంటక పాలనను కొనసాగించారు. జగన్‌ మూలంగా సర్వభ్రష్టమైన వ్యవస్థలను కూటమి సర్కారు పూర్తిగా ప్రక్షాళించాలి. వైకాపాతో అంటకాగి ప్రజాప్రయోజనాలకు పాతరేసిన అధికారులను బోనెక్కించాలి. జగన్‌ సేవలో తరించిపోయిన పోలీసులు అందరినీ ఏరిపారేయాలి. వైకాపా నేతల అండదండలతో పేట్రేగిన సంఘవిద్రోహ శక్తుల పీచమణచడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. గడచిన అయిదేళ్లలో మానవహక్కులను కబళించిన వారందరినీ గుర్తించి కటకటాల్లోకి నెట్టాలి. రోతబూతులతో సామాజిక మాధ్యమాలను మురుగుకాల్వలుగా మార్చేసి, న్యాయస్థానాలూ న్యాయమూర్తులపైనా విషంకక్కిన  వైకాపా మూకలపై ఉక్కుపాదం మోపాలి. జాతివనరులను దోచుకుతిన్న ఆర్థిక నేరాభియోగాలను నెత్తినమోస్తూ,  పదేళ్లకు పైబడిన కాలం నుంచి బెయిల్‌పై ఉంటున్న జగన్‌ సృష్టించిన పెనువిధ్వంసానికి యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ బలైంది. అటువంటి రాజకీయ చీడపురుగులు దేశంలో మరెక్కడా మళ్ళీ పదవుల్లోకి ప్రవేశించి, జనం బతుకులతో చెలగాటమాడకుండా నేరన్యాయ వ్యవస్థ క్రియాశీలం కావాలి. అలవిమాలిన అహంకారం, లెక్కాపత్రంలేని స్వాహాపర్వాలతో రాష్ట్రానికి వినాశకారిగా పరిణమించిన జగన్‌మోహన్‌రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల విజ్ఞతకు జేజేలు... ఒక నియంత బారినుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ఆంధ్రావని చైతన్యశీలతకు వేనవేల జేజేలు! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.