ప్రజలు గెలిచారు!

అనుకున్నంతా అయింది. అధికారమదంతో కళ్లు నెత్తికెక్కి ‘నా అంతటి వాడు లేడు ఇలన్‌’ అని అహంకరించిన నియంతలకు ఏం జరుగుతుందో- అదే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ జరిగింది. అనితర సాధ్యమైన ఇంద్ర పదవిని అధిరోహించాడు నహుషుడు.

Published : 05 Jun 2024 01:46 IST

నుకున్నంతా అయింది. అధికారమదంతో కళ్లు నెత్తికెక్కి ‘నా అంతటి వాడు లేడు ఇలన్‌’ అని అహంకరించిన నియంతలకు ఏం జరుగుతుందో- అదే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ జరిగింది. అనితర సాధ్యమైన ఇంద్ర పదవిని అధిరోహించాడు నహుషుడు. ఆ అదృష్టానికి సంతోషించి సద్బుద్ధితో ప్రవర్తిస్తే, బాగుండేది. కాని ‘అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన...’ ఏం జరుగుతుందో అదే జరిగింది. తన పల్లకీకి బోయీలుగా సప్తరుషులు కావాలన్నాడు నహుషుడు. అలవాటులేని పని కావడంతో ఆ మహామునులు బరువు మోస్తూ నెమ్మదిగా నడుస్తుంటే- సర్ప... సర్ప... వేగంగా వేగంగా అని హుంకరించాడు. అంతేనా... అగస్త్య మహర్షిని నోటితో అదిలించడమే కాదు, కాలితో తన్నాడు. అగస్త్యుడు సామాన్యుడా! ‘సర్ప సర్ప అంటూ అనుచితంగా ప్రవర్తించిన నీవు ఇంద్ర పదవిని కోల్పోయి సర్పమై పడుండు’ అని శపించాడు. మరుక్షణంలో నహుషుడు కొండచిలువై భూమ్మీద పడ్డాడు. ప్రజలు ఆ అగస్త్య మహర్షి అంతటివారు కాకపోయినా- ఓ అవకాశం వచ్చింది. విర్రవీగిన నాయకుణ్ని మట్టి కరిపించారు. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అని బద్దెన కవి చెప్పిన సూక్తిని నిజం చేశారు. అంతేమరి! ఎన్నని సహిస్తారు... ఎన్నాళ్లని సహిస్తారు? ‘చిమ్మ చీకటిని వెక్కిరిస్తుంది చిన్ని మిణుగురు పురుగు... మొండి వానను ధిక్కరిస్తుంది మూడు మూరల గొడుగు’ అన్నట్లుగా నిశ్శబ్దంగా కదిలారు. రాష్ట్రం ఆ మూలనుంచి ఈ మూల వరకు అందరూ కూడబలుక్కున్నట్లు, ఒక ఒప్పందానికి వచ్చినట్లు- మూకుమ్మడిగా కుమ్మేశారు. ‘అక్కర కలదని ప్రజపతి ఎక్కువగా ధనముగొనుట అది ఎట్లనన్‌...’ అవసరం వచ్చిపడిందని ప్రభువులు ప్రజలపై ఎడాపెడా పన్నులను విధించి వేధించడం ఆత్మహత్యా సదృశం అవుతుందని రుక్మాంగద చరిత్ర చెప్పిన సూక్తి మరోసారి నిజమైంది.

ఇంతటి అనూహ్య భంగపాటుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ‘అరయంగా కర్ణుడు ఈల్గె అందరి చేతన్‌...’ అన్నట్లుగా చుట్టూచేరిన భజన సంఘ సభ్యులు యథాశక్తి కృషి చేశారు. రాజు ఎలాంటివారిని సలహాదారులుగా సహచరులుగా పెట్టుకోకూడదో- మహాభారతంలో శాంతిపర్వం తెలియజెప్పింది. ‘నేరనివాడు బొంకరియు నిందకు నోర్చునతండు పందయున్‌... అవగాహన లేనివాడు, అబద్ధము ఆడేవాడు, నిందిస్తున్నా దులపరించుకొని పోయేవాడు, పిరికి పందలా ప్రవర్తించేవాడు... తన మందతో ఉంటే ‘భూపతికి చెట్ట (కీడు) యొనర్చు’ హాని చేస్తారనీ వెల్లడించింది. అలాంటివారు ఎందరో ఇప్పటిదాకా ఆ ముఖ్యనేతను చుట్టుముట్టి అంటిపెట్టుకొని ఉండటం ప్రజల తీవ్ర నిరసనకు ఒక బలమైన కారణం. అధినేత సైతం అలాంటివాడే కనుక వ్యతిరేకత మరింత ముమ్మరించింది. ఇటువంటప్పుడు ఇలాగే జరుగుతుంది. 

కాళిదాసు రఘువంశంలో అగ్నిపర్ణుడనే రాజు ఇలానే ప్రవర్తించేవాడు. రాజును కలవాలంటే ప్రజలకు ఏనాడూ అనుమతి లభించేది కాదు. అసలాయన ప్రజలకు చెప్పవలసిన అతి ముఖ్యమైనవి సైతం- ఇప్పుడు సలహాదారులే ప్రవచించినట్లుగా, అగ్నిపర్ణుడి ఆదేశాలను అనుచరులే తెలియచేసేవారు. అగ్నిపర్ణుడు పరమ భోగలాలసుడై, మందిరంలో కామకేళీవిలాసంగా కాలక్షేపం చేసేవాడు. ప్రజలు మరీ ప్రాధేయపడ్డారని ఏడాదికొకసారి దర్శనం అనుగ్రహించడానికి అంగీకరించాడు. ఆయన ఎంత అహంభావి అంటే- తన మొహం చూపించడానికి బదులుగా, కిటికీలోంచి కాళ్లు బయటకు పెట్టేవాడు. అంటే పూర్తిగా కాకుండా ‘నిజపాద దర్శనం’తో సరిపెట్టేవాడు. ప్రజలందరూ ఆ కాళ్లను దర్శనం చేసుకొనేవారు. అలాంటి వికృత చేష్టలను ఎవరు మాత్రం భరించగలరు? జనం ఇంతకాలం ఓపిగ్గా సహించారు. ఓర్పు వహించారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అంతకంత బదులు తీర్చేశారు. చావుదెబ్బ తీశారు. గతంలో ‘ఒక్క అవకాశం’ అని ప్రాధేయపడితే ‘సరేపాపం’ అనుకొన్నారు. అఖండ మెజారిటీతో ఇంద్ర పదవిని కట్టబెట్టారు. నహుషుడిలా ప్రవర్తించడం చూసి ఏవగించుకొన్నారు. దించేశారు. ‘అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల... ఈ భూమండలమంతా ఒక సత్రం... మనమంతా బాటసారులం’ అన్నారు పానశాల కావ్యంలో దువ్వూరి రామిరెడ్డి. దీన్ని మరిచిపోయి, ‘రాష్ట్రమంతా నా ప్యాలెస్సే, మరో మూడు నాలుగు దశాబ్దాలు నేనే ఇంద్రుణ్ని’ అనుకొంటే లెక్క తలకిందులైపోదా మరి?  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.