వీరుడా... వందనం!

ప్రత్యర్థి జట్టుకు పట్టు చిక్కనివ్వకుండా కాలితో బంతిని గింగిరాలు తిప్పుతూ, ధాటిగా ఆడుతూ, సందు చూసి గోలుపై గోలు కొట్టడం- ఉన్నతశ్రేణి ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల లక్షణం. అటువంటి స్వాభావిక ఆటతీరుతో భారత క్రీడాభిమానుల్ని మంత్రముగ్ధం చేసినవారి జాబితాలో సునీల్‌ ఛెత్రిది మొదటి స్థానం.

Updated : 07 Jun 2024 06:38 IST

ప్రత్యర్థి జట్టుకు పట్టు చిక్కనివ్వకుండా కాలితో బంతిని గింగిరాలు తిప్పుతూ, ధాటిగా ఆడుతూ, సందు చూసి గోలుపై గోలు కొట్టడం- ఉన్నతశ్రేణి ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల లక్షణం. అటువంటి స్వాభావిక ఆటతీరుతో భారత క్రీడాభిమానుల్ని మంత్రముగ్ధం చేసినవారి జాబితాలో సునీల్‌ ఛెత్రిది మొదటి స్థానం. భారత్‌ తరఫున 19 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించి సరిసాటి లేరనిపించుకుని తనదైన విశిష్ట ముద్రవేసిన అద్భుత క్రీడాకారుడతడు! కువైట్‌తో ప్రపంచకప్‌ అర్హత పోటీలో పాల్గొని అంతటితో ఇక చాలించుకుంటానంటూ ఛెత్రి ప్రకటించడం- అసంఖ్యాక అభిమాన గణానికి పెద్ద కుదుపు. విజయంతో ఆట ముగిద్దామనుకున్న ఛెత్రి కల నిన్న నిజం కాలేదు.  21ఏళ్ల వయసులో పాక్‌ జట్టుపై తన తొట్టతొలి అంతర్జాతీయ గోల్‌ సాధించిన ఛెత్రి, ఆఖరి పోటీలో వట్టి చేతులతో వెనుతిరగాల్సి వచ్చింది! తన అరంగేట్రంలో, 25, 50, 100, 125, 150వ పోటీల్లో గోల్స్‌ చేసిన ఏకైక ఆటగాడిగా ఛెత్రిది అబ్బురపరచే రికార్డు. ఏ ప్రయాణమైనా ఒకనాడు ముగిసేదేనన్న తాత్విక చింతన వ్యక్తపరుస్తూ వైదొలగుతున్న ఛెత్రి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థ ప్రత్యామ్నాయమేదీ కనుచూపు మేరలో కానరావడం లేదు. 1984 ఆగస్ట్‌ మూడో తేదీన సికింద్రాబాద్‌లో జన్మించిన సునీల్‌ ఛెత్రి తన పదిహేడో ఏట సిటీ క్లబ్‌ దిల్లీ తరఫున ఫుట్‌బాల్‌ ఆడటం మొదలుపెట్టాడు. మరుసటి ఏడాది మోహన్‌ బగాన్‌ జట్టుతో కుదిరిన ఒప్పందం, అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆపై వివిధ క్లబ్బుల తరఫున ఆడుతూ రాటుతేలిన ఛెత్రి మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించింది ఓం ప్రథమంగా 2005లో పాకిస్థాన్‌పై పోటీలో. దేశం తరఫున అత్యధికంగా 94 గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన అతడు- ఇన్నాళ్లూ భారత ఫుట్‌బాల్‌ గుండెచప్పుడు. 2008లో తజికిస్థాన్, 2010లో వియత్నాం, 2018లో చైనీస్‌ తైపై, 2023లో పాకిస్థాన్‌ల మీద సాధించిన హ్యాట్రిక్స్‌... ఫుట్‌బాల్‌ ప్రేమికుల స్మృతిపేటికలో ఎన్నటికీ మరపురాని అపురూప జ్ఞాపకాలు. జట్టుకు ఎన్ని సవాళ్లు ఎదురైనా, క్రీడాకారులకు ప్రాణవాయువు లాంటి జనాదరణ కొరవడినా- ఆటే శ్వాసగా భారత ఫుట్‌బాల్‌ రంగ భారాన్ని భుజాన మోసిన అసామాన్యుడి నిష్క్రమణంతో ఒక శకం ముగిసింది!

భారత ఫుట్‌బాల్‌ జట్టుకు లోగడ ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణపతకాలు లభించాయి. 1956నాటి మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో మన జాతీయజట్టు నాలుగో స్థానాన నిలిచింది. మోహన్‌ బగాన్‌ జట్టు ఒకప్పుడు ఆంగ్లేయులనే దిమ్మెరపరచింది. అదంతా గత వైభవం! నిరుడు శాఫ్‌(దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌) ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జయపతాక ఎగరేసిన భారత జాతీయ జట్టు ఇటీవల అఫ్గానిస్థాన్‌ చేతుల్లో భంగపాటుకు గురైంది. ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో అఫ్గాన్‌తో ఆడి ఓడిపోయిన టీమిండియా ఫిఫా(అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య) ర్యాంకింగుల్లో 121వ స్థానానికి పరిమితమైంది. భారత్‌ ఫుట్‌బాల్‌ రంగ పతనావస్థ నిస్పృహ రగిలిస్తున్నా- వ్యక్తిగత ఆటతీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ చెరగని తరగని కీర్తిప్రతిష్ఠల్ని సముపార్జించిన ఛెత్రి... భవిష్యత్తరాలకూ నిరంతర స్ఫూర్తికళికగా నిలిచిపోతాడు. అంతర్జాతీయంగా ఫుట్‌బాల్‌ లబ్ధప్రతిష్ఠుల్లో  వారు కొట్టిన గోల్స్‌ ప్రాతిపదికన- రొనాల్డో(పోర్చుగల్‌), మెస్సీ(అర్జెంటీనా), అలీ డాయ్‌(ఇరాన్‌)ల తరవాతి స్థానం సునీల్‌ ఛెత్రిదే. దేశంలో ‘ఖేల్‌రత్న’ పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అతడే. ప్రస్తుతం కేరళ, పశ్చిమ్‌ బెంగాల్, ఈశాన్య భారతం, గోవా, కొల్హాపుర్‌ వంటి ప్రాంతాల్లోనే జనాదరణను చూరగొంటున్న ఫుట్‌బాల్‌- మౌలిక వసతులకు సమర్థ శిక్షకులకు కొరతతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, తులసీదాస్‌ బలరామ్‌ వంటి ఆనాటి మేటి ఆటగాళ్ల నుంచి నిన్నటి భాయ్‌చుంగ్‌ భుటియా, నేటి సునీల్‌ ఛెత్రి వరకు చాటుతున్నదొకటే- దేశీయంగా సహజసిద్ధ ప్రతిభకు ఏనాడూ కొదవ లేదు. ముడి వజ్రాల్ని గుర్తించి సానపట్టి శాస్త్రీయ శిక్షణ, ఆర్థిక తోడ్పాటు సమకూర్చేలా వ్యవస్థాగత విధివిధానాలను ప్రభుత్వాలు పరిపుష్టీకరించాలి. అటువంటి వాతావరణంలో ఛెత్రి వంటి అనర్ఘ రత్నాలెన్నో జాతి గర్వించే ప్రతిభతో క్రీడాప్రదర్శనలతో భారతావని ప్రతిష్ఠను అంతెత్తున నిలబెడతాయి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.