సమీకృత వైఫల్యం

మహాకవి గురజాడ ప్రబోధించినట్లు- దేశమంటే మట్టి కాదు, మనుషులు. జాతి సౌభాగ్యానికి బాటలు పరచేది సమర్థ మానవ వనరులే. అందుకోసం పునాది దృఢంగా ఉండాలి. బాల్యం నుంచీ అందరూ సరైన పోషణకు, సమతుల ఆహారానికి నోచుకుంటేనే- ఏ దేశమైనా మేలిమి జనజీవన ప్రమాణాలతో ధీమాగా పురోగమిస్తుంది.

Published : 08 Jun 2024 02:04 IST

హాకవి గురజాడ ప్రబోధించినట్లు- దేశమంటే మట్టి కాదు, మనుషులు. జాతి సౌభాగ్యానికి బాటలు పరచేది సమర్థ మానవ వనరులే. అందుకోసం పునాది దృఢంగా ఉండాలి. బాల్యం నుంచీ అందరూ సరైన పోషణకు, సమతుల ఆహారానికి నోచుకుంటేనే- ఏ దేశమైనా మేలిమి జనజీవన ప్రమాణాలతో ధీమాగా పురోగమిస్తుంది. సమకాలీన ప్రపంచ స్థితిగతులు అలా లేవని ఐక్యరాజ్యసమితి బాలల సంస్థ ‘యునిసెఫ్‌’ స్పష్టీకరిస్తోంది. విశ్వవ్యాప్తంగా అయిదేళ్ల లోపు వయసు పిల్లలు ప్రతి నలుగురిలో ఒకరు తీవ్ర పోషకాహార లోపాలకు గురవుతున్నట్లు యునిసెఫ్‌ తాజా నివేదిక వెల్లడిస్తోంది. రోజులోనో రెండు రోజుల్లోనో కనీసం ఒక్క పూటైనా సరైన ఆహారానికి నోచని అయిదేళ్ల లోపు పిల్లల సంఖ్య 18కోట్లకు పైబడిందని గణాంక వివరాలు చాటుతున్నాయి. ప్రపంచంలో అయిదేళ్ల లోపు పిల్లలు 27శాతం దాకా అలా అలమటిస్తుండగా- సంక్షోభ తీవ్రత 20 దేశాల్లో అధికమని, వాటిలో ఇండియా ఒకటని నివేదిక చెబుతోంది. అయిదేళ్లకు మించని భారతీయ చిన్నారుల్లో 36శాతం దాకా సరైన పోషకాహారానికి నోచక ఎదుగుదల లోపాల బారినపడుతున్నట్లు లోగడ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది. అయిదేళ్లు రాకుండానే కడతేరిపోతున్న పసికందుల్లో 68శాతం అర్ధాంతర మరణాలకు పౌష్టికాహార లేమి ప్రధాన కారణమని అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి. గతంలో యునిసెఫ్‌తో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో- దేశీయంగా అయిదేళ్ల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తులేనివారు 35శాతం దాకా ఉన్నట్లు వెల్లడైంది. పోషకాహార లోపాలు, పిల్లల శారీరక దుర్బలత్వం ప్రాతిపదికన ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ కన్నా శ్రీలంక, నేపాల్‌ వంటివి మెరుగ్గా రాణిస్తున్నాయి. అంతర్జాతీయంగా నగుబాటుకు గురి చేస్తున్న పోషకాహార సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాల్సిందే. లేదంటే, దేశ భవితవ్యమే గిడసబారిపోతుంది.

పేదరికం కోరల్లో చిక్కి బాల్యం విలవిల్లాడరాదన్న లక్ష్యంతో దశాబ్దాల క్రితమే దేశంలో ఐసీడీఎస్‌ పట్టాలకు ఎక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద పోషకాహార పథకంగా ప్రాచుర్యం పొందింది. ఆరేళ్ల లోపు పిల్లలతోపాటు కిశోర బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు ఏడాదిలో 300 రోజుల దాకా పౌష్టికాహారం అందించడానికి ప్రత్యేక యోజనను ఉద్దేశించారు. వాస్తవిక కార్యాచరణలో అది అనేకానేక లోటుపాట్లతో సతమతమవుతోంది. కోటీ 90లక్షల మందికి పైగా బాలింతలూ చూలింతలకు, ఎనిమిదిన్నర కోట్లమంది పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా సమకూరుస్తున్నామంటున్న పోషకాహారం నిజంగానే లబ్ధిదారులందరికీ చేరుతోందా? లేదనేందుకు ఎన్నో దృష్టాంతాలున్నాయి. దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల వయసు స్త్రీలలో 57శాతం దాకా రక్తహీనతతో అలమటిస్తున్నారు. బలవర్ధకమైన ఆహారం కొరవడి దేశంలో ఏటా 17లక్షల మందికి పైగా పౌరులు మరణిస్తున్నారు. బాల్యంలో పోషక లోపాల బారిన పడిన పిల్లలు పెద్దయ్యాక నడివయసులో పెను ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఇటీవలి బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ కథనం నిగ్గుతేల్చింది. ఇవన్నీ- పోషకాహార లోపాలను ప్రణాళికాబద్ధంగా అధిగమించాల్సిన అత్యావశ్యకతను చాటేవే! దేశంలో 33లక్షల మంది బాలలకు పౌష్టికాహారం సమకూరడం లేదని రెండేళ్ల క్రితం కేంద్రమే అంగీకరించింది. ఆరేళ్ల లోపు పిల్లల్లో పోషక లోపాల్ని ఏటా రెండుశాతం మేర తగ్గిస్తామన్న ప్రతిజ్ఞ దరిమిలా దీటైన చర్యలను ప్రభుత్వం విస్మరించింది. తల్లిపాల సక్రమ పోషణతో 60శాతం వరకు పిల్లల ఎదుగుదల లోపాల్ని చక్కదిద్దగల వీలుందని ఆమధ్య నీతిఆయోగ్‌ సూచించింది. తల్లుల్ని రక్తహీనత కృశింపజేస్తుంటే, వారి కడుపున పుట్టిన పిల్లలకు తగిన పోషణ ఎలా ఒనగూడుతుంది? రేపటి పౌరులందరికీ సమతుల ఆహారం అందితేనే, దేశానికి స్వస్థత చేకూరుతుంది. ఆ మేరకు పోషక ప్రణాళికను పరిపుష్టీకరించాలి. దేశారోగ్యాన్ని గుల్లబారుస్తున్న బహువిధ సమస్యలకు మూలాలు పేదరికంలోనే ఉన్నాయి. ఆ దుస్థితిని అధిగమించి పౌరుల బతుకుల్ని చక్కదిద్దనంతవరకు- వృద్ధిరేట్లకు, ప్రభుత్వాలు సాధించామంటున్న ‘విశేష ప్రగతి’కి అర్థం ఉండదు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.