సజల నయనాలతో...

దుఃఖం కాదది- విషాదం. స్రవించడం మానేసి ఘనీభవించింది. చెక్కిళ్లపై జారి చల్లారిపోకుండా- రెప్పల్లో నిప్పుకణమై ఆవిర్లు చిమ్ముతోంది. మాట పెగలని అర్జునుణ్ని గమనించాడు ధర్మజుడు. ‘ఏమైంది తమ్ముడూ...’ అని అడిగాడు లాలనగా!

Published : 09 Jun 2024 01:46 IST

దుఃఖం కాదది- విషాదం. స్రవించడం మానేసి ఘనీభవించింది. చెక్కిళ్లపై జారి చల్లారిపోకుండా- రెప్పల్లో నిప్పుకణమై ఆవిర్లు చిమ్ముతోంది. మాట పెగలని అర్జునుణ్ని గమనించాడు ధర్మజుడు. ‘ఏమైంది తమ్ముడూ...’ అని అడిగాడు లాలనగా! పరమార్ద్రమైన ఆ పలకరింపుతో శ్రావణమేఘం వంటి పెను విషాదం చప్పున కరిగి భళ్లున వర్షించింది. గొంతులో గడ్డకట్టిన దుఃఖం కొంత పలచబడి, మాటకు దారిచ్చింది. ‘మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్‌ మనలను విడనాడి చనియె’ అని భోరుమన్నాడు అర్జునుడు. పత్రికారంగ మహా మేరువు- ఈనాడు రామోజీరావు అస్తమించారన్న వార్త ఎన్నో రంగాల్లోని ప్రముఖుల హృదయాల్లో ఆ తరహా అర్జున విషాద యోగాన్ని రగిలించింది. శ్రమకు దాసుడైనవాడు విజయానికి యజమాని అవుతాడన్న సూక్తికి ఆయన జీవితం ఒక ఉదాహరణ. పాత్రికేయరంగంలో ఆయన సమున్నత ప్రమాణాలను నిర్దేశించారు. విలక్షణ ప్రయోగాలను ఆహ్వానించారు. వినూత్న ప్రయత్నాలను అభినందించారు. ఇటీవలి కాలంలో వివిధ పత్రికల్లో రాణించిన, ఇప్పటికీ రాణిస్తున్న ఎందరో ప్రసిద్ధ పాత్రికేయులకు ఈనాడే- అమ్మఒడి, తొలిబడి, దానిదే ఒరవడి. తొలి రోజుల్లో బుడిబుడి అడుగులతో తడబడుతున్నప్పుడు వారిని వేలు పట్టి నడిపించిన సారథి- రామోజీ! ‘సారథ్యమొనరించు చనవిచ్చునొకవేళ, క్రీడించు ఒక తరిని గేలిసేయును’ అని అర్జునుడు చెప్పినవన్నీ రామోజీకీ వర్తిస్తాయి. రాజకీయ రంగంలోని వారికైతే రామోజీ పలుకులు- వెన్నుచరుపులు, మేలుకొలుపులు, మేలితలపులు, దారిమలుపులు. ‘మంత్రియై ఒకవేళ మంత్రం ఆదేశించు బోద్ధయై ఒకవేళ బుద్ధిచెప్పు’ అనేది ఆ రంగంలోనివారికి వర్తించే మాట. సత్యాన్ని ప్రశ్నిస్తే బదులిస్తుంది. అసత్యాన్ని నిలదీస్తే ఆగ్రహిస్తుంది. రాజకీయ నాయకుల విషయంలో పత్రికలవారికి నిత్యం అనుభవమయ్యే విషయమే అది. కన్నెర్ర చేసిన నేతలకు ఈనాడు ‘హీనబుద్ధుల పిడుగుపాటుకు జ్ఞానవాటిక బూడిదవుతుందా?’ అన్న సినారె ప్రశ్నతో బదులిచ్చిందంటే దానికి కారణం- రామోజీ బలమైన వ్యక్తిత్వం!

సారథిగా సచివుడిగా వ్యవహరించిన వ్యక్తి అస్తమించినప్పటి దుఃఖానుభవం తీరు వేరు. రామోజీతో వియ్యం సఖ్యం బాంధవ్యం ముడివడినవారి మనోవేదనకు చెందిన తీవ్రత వేరు. గోదావరి జిల్లాలవారిని నిలబెట్టి ‘కాటన్‌ ఎవరు?’ అని ప్రశ్నిస్తే- చేత్తో అన్నం ముద్దను ఎత్తి చూపిస్తారు. ఈనాడు పత్రిక సహా రామోజీ నెలకొల్పిన ఎన్నో సంస్థల్లోని ఉద్యోగులందరూ అలాగే బదులిస్తారు ‘మా అన్నదాత’ అని. ‘బంధు భావంబును పాటించునొకవేళ దాతయై ఒకపరి ధనము నొసగు’ అన్న అర్జునుడి మాటను గుర్తుచేస్తారు. వారందరికీ ఆయనొక రోల్‌ మోడల్‌. ఆకాశం ఎంత విశాలమైందని అడిగితే ఏం చెబుతామని అడుగుతారు. వేలమందికి నీడనిచ్చిన ఒక మహావృక్షం నేలకొరిగితే ఎలా ఉంటుందో- అద్దం పెట్టెలో నిద్రపోతున్న రామోజీ పార్థివ దేహాన్ని చూస్తే తెలుస్తుంది. ఆయన చేయవలసిందంతా చేశారు... చేయించారు... సాధించారు... తరించారు. లోకానికి ఇవ్వవలసిందంతా ఇచ్చేశారు. ‘ఆవిరి ఓడలో జలధి యానమొనర్చుచు బాటసారులు రేవులందు దిగిపోవుచునుందురు ఇంచుక వెన్కముందుగా...’ అని జాషువా చెప్పిన మాటను నిజం చేస్తూ- ‘నా రేవు వచ్చేసింది... ఇక సెలవా మరి!’ అంటూ చిరునవ్వుతో తన ప్రయాణాన్ని ముగించారు. వారి మహాభినిష్క్రమణం- మాటల్లో చెప్పలేని వెలితి. రామోజీని మరెవరితోనూ పోల్చలేం, ఆ వెలితిని పూడ్చలేం. పరిపూర్ణమైన జీవితం ఆయనది. ఆయన అసమానమైన కీర్తి- ఈనాడు గ్రూప్‌ సంస్థలకు తరిగిపోని ఆస్తి. విత్తనం చనిపోతుంది- మొక్కకు జీవం పోస్తూ... మబ్బు కరిగి తరిగిపోతుంది- చినుకును ప్రసాదిస్తూ... సంజె జారిపోతుంది- వేకువకు హామీ ఇస్తూ... రామోజీ వెళ్ళిపోయారు- మన గుండెల్లో జీవిస్తూ... జ్ఞాపకాల్లో పలకరిస్తూ... చరిత్రలో శాశ్వతంగా నిలుస్తూ...! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు