పనిచేస్తూనే ఒరిగిపోయిన రాజర్షి

తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషీవలుడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయ్యింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది.

Updated : 09 Jun 2024 08:52 IST

తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషీవలుడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయ్యింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది. ‘నేనొక స్వర్గం... నాదొక దుర్గం... అనర్గళం అనితరసాధ్యం నా మార్గం’ అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం- రామోజీరావు జీవన ప్రస్థానం. విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం. ‘ఈనాడు’కు ముందు, తరవాత అని చెప్పేంతగా తెలుగువారి సామాజిక, రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు. కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మవిభూషణ్‌ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు. అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణీ అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకూ అగ్రతాంబూలమిస్తూ పత్రికను ప్రారంభించడం- రామోజీరావు సాహసం. తెలుగు జాతికి చేదోడువాదోడుగా, పాఠకాదరణలో తిరుగులేనిదిగా ‘ఈనాడు’ ఎదగడం- రామోజీరావు సంకల్పబల అమృత ఫలం. పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికీ ప్రజాప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ‘ఈనాడు’కు దారిదీపమైంది. ఈటీవీ న్యూస్‌ ఛానల్‌తో తెలుగునాట తొలిసారి 24 గంటల వార్తాస్రవంతికి శ్రీకారం చుట్టిందీ రామోజీరావే. విశ్వసనీయతకు మారుపేరుగా ఈటీవీని మలిచిందీ ఆయనే. డిజిటల్‌ యుగంలో పాఠకుల సౌలభ్యంకోసం ‘ఈటీవీ భారత్‌’ను ఆరంభించి, ఆసేతుహిమాచలం దాన్ని విస్తరించారు. వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా, ధైర్యశాలిగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు- నిత్య నవోదయ ఉషస్సు! 

‘పట్టు పట్టరాదు పట్టి విడవరాదు’ అన్న వేమన వాక్కును నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు. కొండలూ రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సినీస్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం. రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్‌బుక్‌లో లిఖింపజేశారు. రామోజీరావు సాహసికుడు. ‘పెద్దల గలభా’ శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశాలిచ్చారు. వార్త పరంగా తమ తప్పేమీ లేదంటూ తలవంచడానికి అంగీకరించని రామోజీరావు- సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడారు. నమ్మిన విలువలకోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్యసాహసాల గురించి అప్పుడే యావద్భారతానికి తెలిసింది. రామోజీరావు పట్టిందల్లా బంగారమైంది అంటారందరూ! కానీ, విజయ సోపానాలను అధిరోహించేందుకు ఆయన పడిన తపన, చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు. రామోజీ గ్రూప్‌నకు పెద్దగా పెదపారుపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గమొకటే... అదే క్రమశిక్షణ. రోజూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచే ఆయన- వ్యాయామం, మితాహారాలతో నియమబద్ధ జీవనశైలిని పాటిస్తూ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశీలి రామోజీరావు. శ్రమే దైవమని విశ్వసించిన ఆయన- పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు. అందుకు తగినట్లే పెద్ద వయసులోనూ తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు. రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం... విజేతలుగా నిలవాలనుకునే వారికదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం! 

పిల్లకాల్వలెన్ని పోటీపడినా సరే- జీవనదికి సాటిరావు. చేతులెన్ని అడ్డుపెట్టినా- రవికిరణాలు నేలకు చేరకుండా పోవు. రామోజీరావు విశ్వసనీయతా అటువంటిదే. నీతి, నిజాయతీ, విశ్వాసం, వినమ్రత, వృత్తి నిబద్ధతలే పంచప్రాణాలుగా 1962లో ‘మార్గదర్శి’కి ఊపిరిపోశారాయన. ఈ అరవై ఏళ్లలో ఆ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలైంది. దానిపై ధూర్త రాజకీయాల మబ్బులు కమ్మినప్పుడూ ఖాతాదారుల్లో ‘మార్గదర్శి’పై నమ్మకం చెక్కుచెదరలేదు. అదీ రామోజీరావుపై ప్రజల విశ్వాసం! నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందన్న సందేశాన్ని ‘మార్గదర్శి’ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. తెలుగునాట పొదుపు ఉద్యమానికి ప్రేరణై- ఎన్నో కుటుంబాలకు ఆదరువు అయ్యింది. ‘మార్గదర్శి’ దన్నుతో ఎంతోమంది ఇళ్లు కట్టుకున్నారు. కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నారు... వివాహాలు చేశారు. అలా తమ జీవితాలను నిలబెట్టిన సంస్థ పట్ల ప్రజల ప్రేమాభిమానాలే మార్గదర్శికి రక్షాకవచాలయ్యాయి. రామోజీరావు తెలుగు ప్రేమికుడు. గ్రాంథిక సంకెళ్లలో చిక్కిశల్యమవుతున్న తెలుగు పాత్రికేయాన్ని వ్యావహారికం బాటపట్టించిన భాషా సంస్కర్త. కమ్ముకొస్తున్న ఆంగ్లం ధాటికి తెలుగు బిక్కటిల్లుతున్న పరిస్థితుల్లో మాతృభాషా సంరక్షణకు రామోజీరావు నడుంకట్టారు. ‘తెలుగువెలుగు’ పత్రికతో భాషోద్యమ భాస్కరుడయ్యారు. తెలుగు తియ్యదనాన్ని నవతరానికి రుచిచూపించడానికి ‘బాలభారతం’ పత్రికకూ ప్రాణంపోశారు. ఇక ‘విపుల’, ‘చతుర’ పత్రికలైతే- చిక్కటి తెలుగు కథ, నవలలకు చక్కటి చిరునామాలయ్యాయి. అత్యుత్తమ వ్యవసాయ విధానాల సమగ్ర సమాచారాన్ని తెలుగు రైతుల దరికిచేర్చాలన్న సత్సంకల్పంతో ‘అన్నదాత’ పత్రికను దశాబ్దాల పాటు నిర్వహించారు రామోజీరావు. వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఆశించేవారు. దేశంలో ఆదాయ అసమానతలు సమసిపోయే రోజుకోసం ఎదురుచూసేవారు. జనజీవన ప్రమాణాల పెరుగుదలతోనే భారతావని పురోగమనాన్ని గణించాలనే రామోజీరావు- ప్రజాసంక్షేమంకోసం అలుపెరగక పరిశ్రమించిన ధన్యజీవి!   

కాళోజీ అన్నట్లు- ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’! అదే అభిప్రాయంతో కలాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు, దుర్మార్గాలను దునుమాడారు రామోజీరావు. పరిశోధనాత్మక పాత్రికేయానికి పెద్దపీట వేసి అవినీతిపరుల ఆటకట్టించడంతో పాటు- ప్రజా సమస్యల పరిష్కరణకు చైతన్యోద్యమాలు ఎన్నింటికో ఊపిరిపోశారు. పౌరహక్కుల పరిరక్షణకు ‘ఈనాడు’తో ‘ముందడుగు’ వేయించారు. శ్రమదానం, జలసంరక్షణ వంటివాటిపై రామోజీరావు ప్రారంభింపజేసిన ప్రచారోద్యమాలు- ఎన్నో జనావాసాలకు కొత్త జీవం పోశాయి. వ్యాపారమంటే ధనార్జనే కాదు, సామాజిక నిబద్ధత కూడా అన్నది రామోజీరావు నిశ్చితాభిప్రాయం. అందుకే ప్రత్యేకంగా రామోజీ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి- పలు ప్రాంతాల్లో సేవ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహింపజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులెందరికో చేయూతనందించారు. అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగు భాష కళ సాహిత్యాలకు పట్టంకట్టిన రామోజీరావు- మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులెందరినో వెలుగులోకి తీసుకొచ్చారు. ‘పాడుతాతీయగా’, ‘స్వరాభిషేకం’ ద్వారా అనేక మంది గాయనీగాయకులు తళుకులీనారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా పరిచయమైన పలువురు నటీనటులు వెండితెరపై విశేషంగా రాణించారు. రామోజీరావుకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో నెల్సన్‌ మండేలా ఒకరు. ‘స్వప్నాలను నిజం చేసుకునేంత వరకు అలుపెరగక శ్రమించేవారే విజేతలు’ అన్న మండేలా వ్యాఖ్య- రామోజీరావుకు నూటికినూరుపాళ్లూ వర్తిస్తుంది. సునిశిత మేధ, కార్యకుశలత, దక్షత, ధీరోదాత్తతలతో ఆయనకు సరిజోడు కాగలిగినవారు చాలా చాలా తక్కువ. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు- తెలుగువారి ఆర్థిక, హార్దికాభివృద్ధికోసం విశేష కృషి చేసిన అరుదైన వ్యక్తి. ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నం. ఆయన దివ్యస్మృతికి నేడు యావద్దేశం అర్పిస్తోంది భవ్య నీరాజనం! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు