సంకీర్ణ సర్కారుకు సవాళ్ల స్వాగతం

‘140 కోట్ల ప్రజల ఆశీస్సులతో నా విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగి తీరుతుంది’ అంటూ ఎన్నికల ఫలితాలకు ముందు అంతులేని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు ప్రధాని మోదీ. సార్వత్రిక సమరంలో ఏకపక్ష విజయంకోసం కమలదళం కన్న కలలను కల్లలు చేసిన ఓటర్లు- లోక్‌సభలో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీని కట్టబెట్టలేదు.

Updated : 10 Jun 2024 11:25 IST

‘140 కోట్ల ప్రజల ఆశీస్సులతో నా విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగి తీరుతుంది’ అంటూ ఎన్నికల ఫలితాలకు ముందు అంతులేని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు ప్రధాని మోదీ. సార్వత్రిక సమరంలో ఏకపక్ష విజయంకోసం కమలదళం కన్న కలలను కల్లలు చేసిన ఓటర్లు- లోక్‌సభలో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీని కట్టబెట్టలేదు. విలక్షణ ప్రజాతీర్పునకు అనుగుణంగా హస్తినలో నిన్న ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. వరసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ సమంచేయడం విశేషం. తొలిసారి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహిస్తున్న మోదీ- మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తూ, దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయించడంలో ఎంతవరకు సఫలీకృతం కాగలరన్నదే ఆసక్తికరం. గడచిన రెండు తడవల్లో లోక్‌సభలో భాజపాకు స్పష్టమైన బలాధిక్యత ఉండటంతో- అధికారపక్షం ఎజెండా అమలుకు ఆటంకాలేమీ పెద్దగా ఎదురుకాలేదు. లోతైన చర్చలేమీ లేకుండానే అనేక బిల్లులు సైతం చట్టరూపం దాల్చాయి. ‘ఇండియా’ పేరిట చేతులు కలిపి ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతిపక్షాలు- గణనీయమైన స్థాయిలో సీట్లను చేజిక్కించుకున్నాయి. కాబట్టి లోక్‌సభలో మాట నెగ్గించుకోవడం ఎన్డీయే శిబిరానికి నల్లేరుపై నడకైతే కాబోదు. ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తీసుకురావడం, జమిలి ఎన్నికలకు మార్గం సుగమం చేయడం వంటివాటిపై భాజపా శ్రేణులు కొంతకాలంగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ఏర్పాటుకు భుజంకాసిన పార్టీలకు అవి ప్రాధాన్యాంశాలు కానేకావు. కాబట్టి వివాదాల తేనెతుట్టెను కదపకుండా, సమ్మిళితాభివృద్ధి సాధనపైనే మోదీ ప్రభుత్వం దృష్టిసారించాలి! సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ, జాతీయ సమగ్రత సమైక్యతలకు ప్రోదిచేస్తూ ‘శ్రేష్ఠ్‌ భారత్‌’ ఆవిష్కరణకు దోహదపడాలి!

నాయకుల నోట పదేపదే ప్రవచితమవుతున్న అభివృద్ధి లెక్కలు-  జనజీవన స్థితిగతులకు ఏ విధంగానూ అద్దంపట్టడం లేదు. ఒకపక్క అనేక మంది ఆకలిదప్పులతో అల్లాడిపోతుంటే- అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనదీ ఒకటని చంకలు గుద్దుకోవడం అర్థరహితం! జనాభాలో ఒకశాతమైన శ్రీమంతుల దగ్గరే దేశ సంపదలో అత్యధిక భాగం పోగుపడింది. నాణ్యమైన విద్య, వైద్యం గగన కుసుమాలవుతున్న దౌర్భాగ్య వాతావరణంలో బతుకు బండిని లాగలేక సామాన్య జనభారతం బిక్కముఖమేస్తోంది. కొవిడ్‌  ప్రజ్వలన తరవాత దేశీయంగా అనేక కుటుంబాల ఆదాయాలు పడిపోయినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో నిత్యావసరాల ధరలు నింగికి ఎగబాకాయి. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో సర్కారీ అసమర్థత- ఇంటింటి బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. మొన్న మార్చిలో 7.4గా ఉన్న నిరుద్యోగిత రేటు- ఏప్రిల్‌కి వచ్చేసరికి 8.1కి చేరినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పరిశీలనలు చాటుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పట్టణభారత యువతలో నిరుద్యోగం 17శాతానికి పెరిగినట్లు ప్రభుత్వ అంచనాలే వెల్లడించాయి. చదువులకు తగిన నైపుణ్యాలు కొరవడిన దుస్థితిలో ఉపాధివేటలో నవతరం చేతులెత్తేస్తోంది. ఉద్యోగాలసృష్టికి అక్కరకురాని అభివృద్ధి విధానాలు యువభారతానికి అశనిపాతాలవుతున్నాయి. విత్తనాల నుంచి పంట విక్రయాల వరకు ప్రతిదశలోనూ వంచనకు గురవుతున్న రైతాంగంతో పల్లెలు కళావిహీనమవుతున్నాయి. ఈ సమస్యలన్నీ తీరి సామాన్యుల మోముల్లో నవ్వులు విరబూసినప్పుడే భారతావని వికాసం పరిపూర్ణమవుతుంది. ‘మోదీ ఎన్నిసార్లు గెలిచాడన్నది కాదు ప్రధానం... మోదీ పాలనలో దేశానికి ఎంత మంచి జరిగింది అన్నదే కీలకం’ అన్నది ప్రధాని ఇటీవలి వ్యాఖ్య. ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు ఇకపై అదే ప్రమాణం కావాలని యావద్భారతం ఆశిస్తోందిప్పుడు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.