అద్భుతం... కొనసాగిస్తారా?

భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య ఏ తరహా క్రికెట్‌ పోటీ అయినా సరే అసంఖ్యాక క్రీడాభిమానుల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. అందులోనూ ఉత్సాహం, ఉద్వేగం, ఉత్కంఠలకు మారుపేరైన ధనాధన్‌ పొట్టి క్రికెట్‌ సమరమైతే... కళ్లకు కట్టేది హోరాహోరీయే.

Published : 11 Jun 2024 01:37 IST

భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య ఏ తరహా క్రికెట్‌ పోటీ అయినా సరే అసంఖ్యాక క్రీడాభిమానుల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. అందులోనూ ఉత్సాహం, ఉద్వేగం, ఉత్కంఠలకు మారుపేరైన ధనాధన్‌ పొట్టి క్రికెట్‌ సమరమైతే... కళ్లకు కట్టేది హోరాహోరీయే. అది టీ20 ప్రపంచకప్‌ అయితే... లీగ్‌ దశ పోటీ సైతం ఫైనల్‌ని తలపిస్తుంది. న్యూయార్క్‌ వేదికగా ఆ రెండు జట్ల మధ్య జరిగిన తాజా టీ20యే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2007నాటి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా ఆకాశమే హద్దుగా కదం తొక్కి దాయాది జట్టును నిలువరించి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఆపైన ప్రపంచకప్‌ సమరాంగణాన అటువంటి పాటవ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయిన భారత జట్టు మొన్న పాక్‌పై పోరులో గత స్మృతుల్ని స్ఫురణకు తెచ్చేలా ధాటిగా ఆడి గెలిచింది. ఇప్పటికే గ్రూప్‌-ఏ లో ఐర్లాండ్, పాకిస్థాన్లను ఓడించి అగ్రస్థానానికి చేరిన టీమిండియా తదుపరి అంచెకు చేరడమిక లాంఛనప్రాయమే. పాక్‌ జట్టు పరిస్థితి అందుకు భిన్నం. ఆడిన రెండు పోటీల్లో చతికిలపడిన బాబర్‌ ఆజమ్‌ బృందం కెనడా, ఐర్లాండ్‌లపై కచ్చితంగా నెగ్గితేనే రేసులో నిలుస్తుంది. అది మెరుగైన రన్‌రేటుతో గెలుపొందడమే కాదు- భారత్, ఐర్లాండ్‌లపై అమెరికా ఓడిపోవాలి. అమెరికా జట్టులోని ఆటగాళ్ల దూకుడు చూడబోతే, పాక్‌ ఆశలు గల్లంతుకాక తప్పదన్నది క్రీడా పండితుల అంచనా. గతంలో స్వల్ప లక్ష్యం నిర్దేశించి జింబాబ్వే, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై ఇండియా అనూహ్యంగా గెలుపొందిన సందర్భాలున్నాయి. వాటితో పోలిస్తే, ఇప్పుడు పాక్‌పై చెమటోడ్చి రాబట్టిన 119 పరుగులే తక్కువ స్కోరు. అంత స్వల్ప లక్ష్యాన్నీ కాపాడుకోవడంలో బుమ్రా, అక్షర్‌ పటేల్‌ ద్వయం బౌలింగ్‌ ప్రతిభ గొప్పగా అక్కరకొచ్చింది. చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా సాధించిన అద్భుత విజయమిది!

అమెరికా, వెస్టిండీస్‌ల ఉమ్మడి ఆతిథ్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో వరసగా తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయి. 77 పరుగులకే చాపచుట్టేసిన శ్రీలంకపై గెలుపొందడానికి దక్షిణాఫ్రికా కిందుమీదులైంది. న్యూజిలాండ్‌ను అఫ్గాన్‌ జట్టు కంగు తినిపించింది. ఈ పోటీల కోసం సిద్ధం చేసిన పిచ్‌లు బౌలర్లకు అమితంగా సహకరిస్తుండగా, బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టాక ప్రత్యర్థి ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా బ్యాట్లు ఝళిపించే ఆటగాళ్లూ ఎందరో తడబడుతున్నారు. కొంతమంది గాయాల పాలవుతున్నారు. అటువంటి మైదానాల స్వభావాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆడాల్సిన స్టార్‌ క్రీడాకారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సూటిగా తప్పుపట్టారు. సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా ప్రభృతులతో కూడిన టీమిండియా ఇంకో ఓవర్‌ మిగిలి ఉండగానే ఆలౌట్‌ అయిపోవడమా? పాక్‌ మీద దూకుడు ఆటతో మెరుగైన రికార్డు కలిగిన విరాట్‌ కోహ్లి పేలవ ప్రదర్శన అభిమాన జనకోటికి గాయంపై గొడ్డుకారం అద్దినట్లయింది! ఈ ప్రపంచకప్‌ పోటీల మలి అంచె సూపర్‌-8లో స్థానం కోసం ఇండియా, అమెరికాలతో పాటు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ పోటీ పడుతున్నాయి. వీటిలో ఏదైనా జారిపోతే జాబితాలో కుదురుకోవడానికి పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక తహతహలాడుతున్నాయి. అంతిమంగా కిరీటం దక్కించుకునేదెవరో తేలడానికి జూన్‌ 25 వరకు నిరీక్షించాల్సిందే. ప్రపంచకప్పుతోపాటు... ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్‌ మండలి) ప్రకటించిన రూ.93 కోట్ల నగదు పురస్కారం టీమిండియాకే దఖలు పడాలంటే- విమర్శలూ సూచనల నుంచి సత్వరం గుణపాఠాలు నేర్చి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక ఆటగాళ్లు రాణించాలి. ఆ మేరకు వైరిజట్ల బలాలూ బలహీనతల పట్ల పూర్తి అవగాహనతో రోహిత్‌ సేన వ్యూహాలు చురుగ్గా పదును తేలాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.