కుదుటపడని కశ్మీరం

ఉగ్రవాదానికి దూరమవుతున్న జమ్మూకశ్మీర్‌- పర్యటకానికి దగ్గరవుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అయిదు నెలల క్రితం ఉద్ఘాటించారు. ఆ ప్రాంతంలో సరికొత్త శాంతి యుగం ఆరంభమైందనీ ఆయన సెలవిచ్చారు.

Published : 12 Jun 2024 02:47 IST

ఉగ్రవాదానికి దూరమవుతున్న జమ్మూకశ్మీర్‌- పర్యటకానికి దగ్గరవుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అయిదు నెలల క్రితం ఉద్ఘాటించారు. ఆ ప్రాంతంలో సరికొత్త శాంతి యుగం ఆరంభమైందనీ ఆయన సెలవిచ్చారు. పాలకుల ప్రవచనాలకు భిన్నంగా ముష్కర మూకల కిరాతకాల కారణంగా సుందర కశ్మీరం నేటికీ నెత్తురోడుతోంది. స్థానిక సంస్థల ప్రతినిధులు, అల్పసంఖ్యాక వర్గాలు, నిరాయుధ పోలీసులు, సర్కారీ ఉద్యోగులపై ఉగ్రవాదులు మొన్నామధ్య పాల్పడిన వరస ఘాతుకాలు- స్థానికుల వెన్నులో వణుకు పుట్టించాయి. అవి అదుపులోకి వచ్చాయనుకునేలోపే పర్యటకులే లక్ష్యంగా ఉగ్రతండాలు మళ్ళీ పేట్రేగిపోతున్నాయి. కిందటి నెలలో అనంతనాగ్‌ జిల్లాలో టూరిస్టు క్యాంపుపై ముష్కరులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మొన్న ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ- రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దాంతో బస్సు లోయలోకి పల్టీకొట్టి, తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంతకాలంగా లక్షిత దాడులతో చెలరేగిపోతున్న లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’... రియాసీ మారణకాండకు బాధ్యత తనదేనంటూ తొలుత ప్రకటించింది. పర్యటకులు, స్థానికేతరులపై మరింతగా విరుచుకుపడతామంటూ వదరుబోతు ప్రకటనలు చేసిన ఆ సంస్థ- తరవాత నాలుక మడతేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేయాలి. రియాసీ నరమేధానికి కారకులెవరో వీలైనంత వేగంగా తేల్చాలి. నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలి!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి కారణమైనందువల్లే 370 అధికరణను రద్దు చేశామని ప్రధాని మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమంటే- కేవలం భూమిపై సరిహద్దు గీతలు గీయడం కాదని, స్థానికులతో బలమైన విశ్వసనీయ బంధాన్ని ఏర్పరచుకోవడమేనని విశ్లేషించారు. కానీ స్వయం ప్రతిపత్తి తొలగింపును అడ్డుపెట్టుకుని కాశ్మీర్‌ లోయలో నెత్తుటి నెగళ్లను రాజేయాలని పాకిస్థాన్‌ ప్రేరేపిత ముష్కరమూకలు అర్రులు చాస్తున్నాయి. లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ వంటివి మారుపేర్లతో కశ్మీర్‌లో పైశాచికకాండలకు పాల్పడుతున్నాయి. రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల పరిధిలోని పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణులను కేంద్రంగా చేసుకున్న ఉగ్రతండాలు తీవ్రస్థాయి హింసోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాయి. భద్రతాదళాలపైనా దాడులకు తెగబడుతున్నాయి. ముష్కరులను ఉక్కుపాదంతో అణచివేస్తూ, సరిహద్దుల్లో చొరబాట్లను సమర్థంగా అడ్డుకోవడం అత్యావశ్యకం. జమ్మూకశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధి కోసమంటూ రూ.80 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సంక్షేమ కార్యక్రమాలను జోరెత్తిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటోంది. కానీ, సర్కారుపై స్థానికుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి తగ్గడం లేదు. దానికి నిదర్శనంగా- కశ్మీర్‌ వేర్పాటువాద నేత, ‘ఉపా’ కేసులో తిహాడ్‌ జైల్లో ఉన్న అబ్దుల్‌ రషీద్‌ షేక్‌ (ఇంజినీర్‌ రషీద్‌) ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి ఘన విజయం సాధించాడు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టాలంటే- ప్రభుత్వం ముందుగా స్థానికుల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, సత్వరం ఎన్నికలు నిర్వహించాలి. కశ్మీరంలో శాంతి వెల్లివిరియాలంటే- అక్కడ ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచి తీరాలి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.