విజేతల అలవాట్లు ఎలా ఉంటాయంటే? 

గెలుపు శిఖరాల్ని అధిరోహించిన వ్యక్తులందరూ దాదాపు ఒకేరకమైన అలవాట్లను కలిగి ఉంటారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా ఆ అలవాట్లే వారిని రక్షిస్తాయి. జీవితంలో ముందుకు సాగేలా భరోసానిస్తాయి. ఈ కరోనా కష్టకాలంలోనూ నిరుత్సాహపడక నమ్మకంతో నిలబెడతాయి. అనుకున్న లక్ష్యంవైపు అడుగులేసేలా చూస్తాయి.

Updated : 16 Nov 2020 01:57 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: గెలుపు శిఖరాల్ని అధిరోహించిన వ్యక్తులందరూ దాదాపు ఒకేరకమైన అలవాట్లను కలిగి ఉంటారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా ఆ అలవాట్లే వారిని రక్షిస్తాయి. జీవితంలో ముందుకు సాగేలా భరోసానిస్తాయి. అనుకున్న లక్ష్యంవైపు అడుగులేసేలా చేస్తాయి. అలా విజయతీరాలకు చేరుస్తున్న అలవాట్లు ఏంటి? ఎలాంటి పద్ధతులు పాటిస్తే విజయం మన సొంతమవుతుంది?

వేగంగా నేర్చేస్తారు..
విజేతలుగా నిలిచిన వారు ఆసక్తి ఉన్న రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ ఆసక్తే వారిని విజయతీరాలకు చేరుస్తుంది. ముందుగా చేయదలచుకున్న పని, దానికి సంబంధించిన అంశాలపై పట్టు సాధిస్తారు. ఆ రంగంలో నిరంతరం కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకు ఉపకరించే పుస్తకాలను బాగా చదువుతారు. రోజుకు కనీసం 15 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా స్వీయ అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు మెరుగవుతాయంట. వేగంగా చదవడం ద్వారా లక్ష్య సాధనకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించగలుగుతారు. ఏదైనా త్వరగా నేర్చేస్తూ పని పూర్తి చేస్తారు.
మీకు తెలుసా? ప్రముఖ పెట్టుబడిదారుడు ‘వారెన్‌ బఫెట్’ రోజుకు 500 పేజీలు, ‘బిల్‌గేట్స్‌’ ఏడాదిలో 50 పుస్తకాలు చదువుతారు. అందుకే సరైన నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ తమ పనిని పూర్తిచేయగలిగారు.

సమస్యలు తెలుసు..
సమస్యను చూసి తప్పించుకోవడం కంటే సమస్యతో పోరాడటం విజయవంతమైన వ్యక్తులు చేసే పని. అందుకోసం ముందుగా సమస్యను గుర్తిస్తారు. అర్థం చేసుకుంటారు. ఆ సమస్య వల్ల లక్ష్య ఛేదనలో వారు పడుతున్న ఇబ్బందులను నిశితంగా గమనిస్తారు. సమస్యని ఊహిస్తూ భయపడిపోకుండా అది ఎక్కడుందో మూలం కనుగొని, ఆ చోటుకి చేరుకుని పరిష్కరించే మార్గాన్ని కనిపెడతారు. అదే వారికి దీర్ఘకాలిక విజయాల్ని అందిస్తుంది.
* సమస్యని దృశ్య రూపంలో చూడాలంటారు ప్రముఖ వ్యాఖ్యాత ‘ఓప్రా విన్‌ఫ్రే’. మీ మనసులో ఊహించుకుని భయపడేకంటే దాన్ని ముందుగానే గుర్తించి చూడగలిగితే పరిష్కరించడం సులువవుతుంది అంటారామె. 

ప్రాధాన్య క్రమంలో..
రోజూవారీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. తప్పక దాన్ని పాటిస్తారు. అనవసర పనులకు సమయాన్ని కేటాయిస్తే తదుపరి ముఖ్యమైన పనులు త్వరత్వరగా పూర్తి చేయాల్సి వస్తుంది. దీంతో పనిలో లోపాలు, ఆటంకాలు రావొచ్చు. అందుకే ఆ రోజు సులభమైన, కఠినమైన పనులను విభజించుకుంటారు. సామర్థ్యానికి తగ్గట్టుగా పనులను పూర్తిచేస్తారు. దీంతో అనవసరమైన పనులు, ప్రస్తుతం అవసరం లేని పనులను పక్కన పెట్టేస్తారు. విజయవంతమైన వారిలో ప్రణాళిక, సమయపాలన ముఖ్యమైన అలవాట్లు. 
* Eisenhower Matrix Templateని ఓసారి ప్రయత్నించండి. అతిముఖ్యమైన, ముఖ్యమైన, ఇప్పుడే అవసరం లేని, అనవసరపు పనులను వేరు చేయొచ్చు. ప్రాధాన్య క్రమంలో పనులను తొందరగా పూర్తి చేయొచ్చు.

లక్ష్యానికి బహుమతి..
విజయాలు అందుకున్న వ్యక్తులు వారి రోజును సక్రమంగా వినియోగించుకుంటారు. ఉదయాన్నే లేవడం వారి ముఖ్యమైన అలవాట్లలో ఒకటి. లేవగానే ఆ రోజులో పూర్తి చేయాల్సిన పనులను ప్రాధాన్య క్రమంలో ఏర్పాటు చేసుకుంటారు. మొదట కష్టమైన పనులతో రోజుని మొదలెడతారు. దీంతో రోజు మొత్తంపై పట్టు సాధిస్తారు. కనీసం వారి వారాంతాల్లో, సెలవు దినాల్లో కూడా క్రమం తప్పరు. వారి లక్ష్యానికి వారి నిద్రను బహుమతిగా ఇచ్చేస్తారు. రోజును ఎక్కువగా వినియోగించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం. 
* యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ ఉదయం 3.45కి, నెక్స్ట్‌ ‌డెస్క్‌ డైరెక్టర్‌ డాన్‌ లీ ఉదయం 3:30కి నిద్ర లేస్తారు. ప్రధాని మోదీ కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రిస్తారు.

అవి వారికి తెలుసు
మీ బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. బలాలను మెరుగుపరుచుకుంటూ బలహీనతలనూ బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. లక్ష్యాలను చేరుకున్న వారు వారి బలహీనతలని సైతం బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ గెలుపు కోసం పయనిస్తారు. మీ బలాలు, బలహీనతలు తెలుసుకుంటేనే వాటిని ఉపయోగించుకోవడం సులువవుతుంది. మీ లక్ష్యం వైపు సాగేటప్పుడు మీ బలాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ముందుకు సాగండి.
* దీనికి సరైన ఉదాహరణ మిలియనీర్‌ ‘రిచర్డ్‌ బ్రాన్‌సన్’‌. తనకున్న ‘డిస్లెక్సియా’ లోపాన్ని సైతం తనకు ప్రయోజనంగా మార్చుకుని నేడు మెగా మిలియనీర్లలో ఒకడిగా నిలిచాడు.

నెట్‌వర్క్‌ ముఖ్యమే..
విజయం సాధించిన వారు తమ పరిచయాల్ని ఎక్కువగా విస్తరించుకుంటారు. వారు నమ్మే సూత్రం ఒకటే. ‘కనెక్షన్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’. ఏ ప్రాంతానికెళ్లినా.. ఏ పని చేస్తున్నా అక్కడి వారితో కలసిపోతారు. వేరువేరు ప్రదేశాల్లో వివిధ రకాల వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు. వాటిని కొనసాగిస్తారు. ఈ కాలంలో నిజజీవిత సన్నిహితులతో పాటూ సామాజిక మాధ్యమాల స్నేహితులూ అవసరమే. 
* సెలబ్రిటీలు ఒక్క సోషల్‌ పోస్ట్‌తో ఎక్కడో ఉన్న తమ అభిమానులకు క్షణాల్లో చేరువవుతున్నారు. ఆ విధంగా వారు తమ నెట్‌వర్క్‌ని సంపాదించుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా త్వరగా పరిచయాలు విస్తరించుకోవచ్చు. 

‘నో’ చెప్పడం నేర్చుకోండి   

విజయవంతమైన వ్యక్తులు వారికి అనవసరపు, నచ్చని పనులకు నిరభ్యంతరంగా ‘నో’ చెప్పేస్తారు. ఇతరులు అడిగిన ప్రతి పనికీ ‘ఎస్‌’ అని చెబితే వారు అనుకున్న పనిని కచ్చితంగా పూర్తి చేయలేరు. ఓ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక.. రోజూ ఆ లక్ష్యాన్ని కాకుండా, దాన్ని చేరుకోవడానికి రూపొందించుకున్న అలవాట్ల ద్వారానే మరింత ప్రేరేపితమవుతారు. ఆ అలవాట్లలో ఒకటే ఈ ‘నో’ చెప్పడం.. పనికిరాని విషయాలు, సమయాన్ని వృథా చేసే పనులకు నేరుగా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. 

* ప్రముఖ పెట్టుబడిదారుడు ‘వారెన్‌ బఫెట్‌’ అభిప్రాయం ప్రకారం నిజంగా విజయవంతమైన వ్యక్తులు ఎక్కువగా ‘నో’ అనే చెబుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని