గ్రామీణంలో పెరిగిన ఇంటర్నెట్‌ వినియోగం.. ఎంత శాతమంటే?

డిజిటల్‌ దిశగా దేశం దూసుకెళ్తోంది. మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వాడకం గణనీయంగా పెరిగింది.

Updated : 03 Aug 2021 23:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ దిశగా దేశం దూసుకెళ్తోంది. మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వాడకం గణనీయంగా పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల వినియోగం ఏకంగా 400 శాతానికి చేరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పల్లెలకూ ఇంటర్నెట్‌ సేవలు చేరువ చేసేందుకు కేంద్రం ‘భారత్‌నెట్‌’ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే.  ఇందులోని  వైఫై విభాగంలో ఇప్పటికే 13 లక్షలమంది వినియోగదారులు నమోదయ్యారు. ఈ డిసెంబరు నాటికి 20 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు పొందగలరని అధికారవర్గాలు వెల్లడించాయి. 
మారుమూలలకూ చేర్చేందుకు..
‘భారత్‌నెట్‌’ ప్రాజెక్టులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు(ఫైబర్‌ టు హోం), వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌(సీఎస్‌సీ)లు చూసుకుంటాయి.  ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 1.15 లక్షల పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 98 వేలకు ఇచ్చారు.  మరోవైపు ఈ ఏడాది జూన్‌నాటికి  ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న పంచాయతీలు కలిపి 13 వేల టెరాబైట్ల డేటా వినియోగించడం గమనార్హం. 2020లో ఇది ఆరువేల టెరాబైట్లు ఉండగా, 2019లో 300 నుంచి 400 మధ్య ఉంది. ‘గతేడాది మార్చి నుంచి 4.50 లక్షల కొత్త కనెక్షన్లు . ఇందులో 3.25 లక్షల కనెక్షన్లు.. పోలీస్‌స్టేషన్లు, గ్రామ పంచాయతీలు, తపాలా కార్యాలయాలు, అంగన్‌వాడీలు, రేషన్‌ దుకాణాలు, ఆసుపత్రులు తదితర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ఆవశ్యకత, అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. విద్య, ఇతర సమాచారాన్నీ అభివృద్ధి చేస్తే మరింత డిజిటల్‌ సాధికారత సాధించవచ్చని సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సంస్థ సీఈవో దినేష్‌ త్యాగి అభిప్రాయపడ్డారు. మొబైల్‌ డేటా కనెక్షన్లకు ఉద్దేశించిన ‘సీఎస్‌సీ వైఫై చౌపల్‌’కూ 13 లక్షల మంది వినియోగదారులున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు