ఈ ఆశ్రమంలో సైన్స్‌ నేర్పుతారు!

మీ పిల్లలు సరిగా చదవడం లేదా? పుస్తకం ముందుంచుకుని దిక్కులు చూస్తున్నారా? హోం వర్క్‌ పూర్తి చేయమంటే మారాం చేస్తున్నారా?

Published : 10 Dec 2020 00:52 IST

ఫొటోలు: వారి అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ పిల్లలు సరిగా చదవడం లేదా? పుస్తకం ముందుంచుకుని దిక్కులు చూస్తున్నారా? హోంవర్క్‌ పూర్తి చేయమంటే మారాం చేస్తున్నారా? అయితే వారిని ఆశ్రమంలో చేర్చాల్సిందే! ఏంటీ చదువుపై ఆసక్తి లేకపోతే ఆశ్రమంలో చేర్చాలా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది మీరనుకున్నట్టు ఏదో ఆధ్యాత్మిక ప్రదేశం కాదు. శాంతి, యోగా పాఠాలు నేర్పరిక్కడ. మరేం నేర్పుతారంటారా? సైన్స్‌. అవునండీ.. ఇక్కడ ప్రయోగాలతో ఆచరణాత్మకంగా విజ్ఞానం నేర్పిస్తారు. అందుకే దీనికి ‘సైన్స్‌ ఆశ్రమం’ అని పేరు. మరి ఈ ఆశ్రమం ఎక్కడుంది? ఎవరు స్థాపించారు? ఎలా బోధిస్తారు? తెలుసుకుందామా!


  

ఆలోచన ఇలా..
ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మైసూరుకు చెందిన ధృవరావు, రోహన్‌ అభిజిత్‌. కానీ చేరిన కొంత కాలానికే ఉద్యోగం తన ఆసక్తికి తగదని విడిచిపెట్టాడు రోహన్‌. తర్వాత ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉండగా తన స్నేహితుడి బంధువుల అమ్మాయి పీయూసీ పరీక్షల్లో గణితం, సైన్స్‌లో చాలా వెనకబడిందని తెలిసింది. దీంతో కొన్ని నెలలపాటు ఆ విభాగాల్లో తనకి శిక్షణనిచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చేశాడు. అదే తనకు ప్రేరణనిచ్చింది. ఉపాధ్యాయ వృత్తిలోనే తనకు సంతోషం ఉందని గ్రహించి ఓ పాఠశాలలో భౌతిక, గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరాడు. కొన్నేళ్ల తర్వాత ధృవ సైతం తన కార్పొరేట్‌ కొలువును వదులుకొని ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. ఇప్పుడు ఇంటర్నెట్‌, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అందుబాటులోకి వచ్చింది. ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు నేర్పడంలో సహాయపడే ఒక వనరు మాత్రమేనని వారు భావించారు. కానీ ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలు నేర్చుకోవడం కంటే గుర్తుంచుకోవడం పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని గమనించారు. ఈ బట్టీ చదువులకు స్వస్తి చెప్పేలా ఏదైనా చేయాలనుకున్నారు. తమ చిన్నతనంలో రిమోట్‌ కంట్రోల్‌ కార్లు, ఆటోమెటెడ్‌ డస్ట్‌బిన్‌లు తయారు చేసిన రోజులను గుర్తుతెచ్చుకున్నారు. అదే ఈ ఆశ్రమం ఏర్పాటులో ముందడుగు పడేలా దోహదపడింది. అలా ఆరేళ్ల క్రితం మైసూరులో విజ్ఞాన ఆశ్రమానికి రూపకల్పన చేశారు. తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి తదితర నగరాలకు విస్తరించారు.

ఏంటీ వీరి ప్రత్యేకత?
ప్రారంభించిన మొదట్లో విద్యార్థులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఓ విద్యార్థి ఆసక్తితో తన తల్లిదండ్రులు ఇక్కడ చేర్చారు. తర్వాత వారి బోధనా విధానం నచ్చి తల్లిదండ్రులు వారి పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి చూపారు. ఇక్కడ శిక్షణకి విద్యార్థి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా తల్లిదండ్రులు చదువుకోమని పిల్లలను ఒత్తిడి చేయాల్సిన పని లేదు. పిల్లలు గుర్తుంచుకోవడానికి గంటల తరబడి బట్టీ పట్టననవసరం లేదు. వారాంతాల్లో తరగతులు నిర్వహిస్తారు. సమస్యలు తెలిపి పరిష్కారమార్గాన్ని వారి ఆలోచనలు, ప్రయోగాల ద్వారా కనుగొనాలని చెబుతారు. ప్రయోగాత్మక చదువుల కోసం అనువైన వాతావరణాన్ని సృష్టిస్తారు. అందుకు కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ఓ విద్యార్థి ఇందులో చేరగానే తనకి కొంత వర్చువల్‌ కరెన్సీని అందజేస్తారు. దాంతో ఓ ప్రయోగం చేసేందుకు కావాల్సిన పరికరం లేదా ఏదైనా మోడల్‌ను నిర్మించేందుకు కావాల్సిన వస్తువులను ఆశ్రమ జాబితా నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ జాబితాలో 3డీ ప్రింటర్‌, టెలీస్కోప్‌, హక్‌సా బ్లేడ్‌, బోల్ట్‌ కట్టర్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌.. తదితర వస్తువులను అందుబాటులో ఉంచారు. వీటిని ఇంటికి తీసుకెళ్లి ప్రయోగం పూర్తి చేయొచ్చు. సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించేలా అనేక సైన్స్‌ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, పోటీలను పిల్లలకు నిర్వహిస్తారు. మరింత అవగాహన కల్పించేందుకు వివిధ ప్రదేశాల సందర్శనకూ తీసుకెళ్తారు. ఒకవేళ పరిష్కరించే మార్గంలో వారికి సమస్యలు ఎదురైతే పూర్వవిద్యార్థుల ఆవిష్కరణలను ఉదాహరణగా చూపి, తమకు తాముగా నేర్చుకునేలా చూస్తారు. ఇక్కడి ఉపాధ్యాయులు ఇది చేయండి అని పిల్లలకు చెప్పరు. కేవలం వారి మనసులో ఓ ఆవిష్కరణ తాలూకు ఆలోచనను మాత్రమే రూపొందిస్తారు. శిక్షణ తీసుకున్న విద్యార్థుల ఆవిష్కరణలు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందాయి. ప్రస్తుతం వర్చువల్‌ క్లాసుల ద్వారా శిక్షణనిస్తున్నారు.

 

అనేక పాఠశాలలతో.. 
కేవలం సైన్స్‌ ఆశ్రమం మాత్రమే కాదు.. వీరి బృందం దేశంలోని వివిధ పాఠశాలలతో కలిసి పని చేస్తోంది. అందుకు అనువైన ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులకు కావాల్సిన వస్తు సామాగ్రి, సాధనాలు పొందుపరుస్తుంది. వీలైనపుడు ఈ బృంద సభ్యులు వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వారి ప్రేరణ, మార్గదర్శకత్వంతో ఇంట్లో విద్యుత్‌ వృథా కాకుండా చూసే యాప్‌లు, ఎయిర్‌ కూలర్‌, హాట్‌ బాక్స్‌ తదితర అనేక ఆవిష్కరణలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని