Published : 16 Jan 2021 00:43 IST

ప్రశాంత జీవితానికి పంచ సూత్రాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఇంటి బాధ్యతలు, పిల్లలు, చదువులు, ఆఫీస్‌ పనులు.. ఇలా ప్రతినిత్యం జీవితమంతా ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులమయమే! ఈ నేపథ్యంలో ప్రశాంత జీవితం మీ సొంతం కావాలంటే అన్నింటినీ సమతుల్యం చేయాలంటారు బౌద్ధమత గురువు దలైలామా. సమయానుగుణంగా స్పందించాలంటారాయన. ప్రశాంత జీవితానికి దలైలామా చెప్పిన ఆ పంచ సూత్రాలేంటో తెలుసుకుందామా..! 

సంబంధాలే ముఖ్యం
తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలు, సహచరులు..ఇలా రోజులో మనం ఎక్కువ సమయం వీరితోనే గడుపుతుంటాం. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో మీకు ఇబ్బంది కలిగించే వారిపై కోపం రావచ్చు. ఆ క్షణంలో మీ అహం మిమ్మల్ని అధిగమించొచ్చు. అలాంటి సందర్భంలో మీ నోరు అదుపు తప్పొచ్చు. అందుకే ఎదుటివారిని నొప్పించే మాటలు అనేస్తాం. కానీ అవి వారిని ఎంతో ఇబ్బంది పెడతాయి. మీ అహం కంటే మీకున్న మంచి మానవ సంబంధాలే ముఖ్యమని తెలుసుకోవాలంటారు దలైలామా. 

ఏకాంతంగా గడపండి
ఉరుకుల పరుగుల జీవితం.. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక పనులు.. మరి ఇంతటి హడావుడి జీవితంలో మీతో మీరు మాట్లాడుకుంటున్నారా? లేదంటే ప్రతిరోజు ఇందుకోసం కొంత సమయం కేటాయించండి. మీతో మీరు చర్చించుకోండి. మీ మనసు ఏం చెబుతుందో వినండి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఉద్యానవనంలో కాసేపు నడకకి వెళ్లండి. ఆహ్లాదకరమైన గాలిని పీల్చండి. వీలైతే ఏడాదిలో ఒకసారి మీరిప్పటివరకూ వెళ్లని, మీరు చూడాలనుకునే ప్రదేశాన్ని సందర్శించండి. 

ప్రస్తుత సమస్య ప్రస్తుతంలోనే..!
మనకు దగ్గరివారిగా మెలిగేవారితో పోట్లాడేటప్పుడు ఎక్కువగా గతాన్నే గుర్తుచేస్తాం. ఎప్పుడో వారు చేసిన తప్పును ఎత్తి చూపుతాం. గతంలో ఎక్కడో ఒకచోట అందరూ తప్పులుచేసిన వారే. అందుకే ఏ సమయంలోనైనా వర్తమానంలోనే మాట్లాడండి. దానికి అక్కడే పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. గతంలో జరిగింది గతంలోనే ఉండనివ్వాలంటారు దలైలామా. ప్రస్తుత సమస్యకి పరిష్కారంగా గతాన్ని తవ్వడం ద్వారా ఎదుటివారి మనుసు నొచ్చుకుంటుంది. ప్రస్తుత సమస్యకు ప్రస్తుతంలోనే సమాధానం ఇవ్వడం సరైన మార్గమంటారు.

ఓడినా ముందుకు సాగండి
జీవితంలో విజయం సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎంతో కృషి చేస్తాం. చివరకు మనకు నచ్చిన వాటిని వదులుకునేందుకూ సిద్ధమవుతాం. ఆ క్రమంలోనే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీంతో ఒక్కోసారి విజయం మీ దరి చేరకపోవచ్చు. అయినా ప్రయత్నం మానుకోవద్దు. మీ ఓడిన ప్రయాణంలో పాఠాలు నేర్చుకుంటూ చేసిన తప్పులు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి. ఏదో ఒకరోజు గెలుపు శిఖరాలను అధిరోహిస్తామనే నమ్మకంతో ముందుకెళ్లాలి. పని మొదలుపెట్టాక గెలుపోటములకు సిద్ధంగా ఉండాలి.

నిశ్శబ్దమే మీ నేస్తం
కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటమే మంచిది. ఒకరి గురించి మీరేమనుకుంటున్నారో వారికి చెప్పేముందు కాసేపు నిశ్శబ్దంగా ఉండి చూడండి. వారిపై మీకు మంచి అభిప్రాయం లేనట్లయితే వారి ముందు నోరు మెదపకపోవడమే మంచిది. ఓ చిన్న వివాదం మంచి స్నేహాన్ని గాయపరచకుండా చూసుకోవాలి. అవకాశం ఉంటే ఇతరులకు సహాయం చేయండి. సాయం చేయకపోయినా సరే కానీ హాని కలిగించే ప్రయత్నం చేయొద్దు. అది తిరిగి ఏదో రోజు తిరిగి మీవరకు వస్తుందంటారు దలైలామా.

ఇవీ చదవండి

బరువు పెరగాలనుకుంటున్నారా?

టీవీ చూస్తూ తింటున్నారా?

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని