బడులందు ఈ బడివేరయా!! 

బడికి వెళ్లాలంటే బోలెడు భారం మొయ్యాలి. ఒకే రంగు దుస్తులు వెయ్యాలి. ఎక్కాలను గుక్కతిప్పుకోకుండా టకటకా అప్పజెప్పాలి. మాస్టారు ఇచ్చిన హోం వర్క్‌ తప్పక పూర్తి చేయాలి. ఇంతేనా? కాడందోయ్‌. ఈ బడి ఆ బడులకు కాస్త వేరు. 

Published : 16 Nov 2020 01:09 IST

చిత్రాలు: వారి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడికి వెళ్లాలంటే బోలెడు భారం మోయాలి. ఒకే రంగు దుస్తులు వేయాలి. ఎక్కాలను గుక్కతిప్పుకోకుండా టకటకా అప్పజెప్పాలి. మాస్టారు ఇచ్చిన హోం వర్క్‌ తప్పక పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే బడి ఆ కోవకు చెందదు. ఇక్కడ యూనిఫాం ధరించక్కర్లేదు. భుజాల లాగేసేలా పుస్తకాలు ఉండవు. చేయాల్సిందంతా ఆచరణాత్మకంగా.. తెలుసుకోవాల్సింది అనుభవపూర్వకంగా ఉంటుంది. ఇక్కడ అకడమిక్‌  చదువులతో పాటూ ప్రత్యేక పద్దతులను ఉపయోగించి విద్య బోధిస్తున్నారు. అంటే పజిళ్లు పరిష్కరించాలి. బొమ్మలు వేయాలి. మాటల్ని పంచుకోవాలి. ఎవరి వారే వంట చేసుకుని తినాలి. ఇంతకీ ఆ బడి ఎక్కడుంది? ఎవరు స్థాపించారు? విద్యను ఎలా బోధిస్తారు? తెలుసుకుందాం.
కర్ణాటకకు చెందిన సంజీవ్‌ కులకర్ణి, తన భార్య ప్రతిభ వారి అబ్బాయిని ఎల్‌కేజీలో చేర్చాల్సి వచ్చినప్పుడు వివిధ పాఠశాలలను చూశారు. మామూలు పాఠశాలల్లా కాకుండా కాస్త ఆచరణాత్మకంగా, అనుభవపూర్వక పద్దతిలో బోధన అందించే పాఠశాలల కోసం వెతికారు. అలాంటి పాఠశాల ఒక్కటీ కనిపించలేదు. పిల్లలు ఓ అంశం దాని పూర్వపరాలు తెలుసుకునేలా, విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా పెంచుకునేలా, ఏ ఒక్క పాఠశాలా వారి దృష్టికి రాలేదు. అంతటా రొటీన్‌గా బోధించేవే కనిపించాయి. దీంతో చిన్నారులకి అనుభవపూర్వకంగా అభ్యసించే విద్యను అందించాలనే ఆలోచనలో పడ్డారు. స్వంతగా మనమే ఓ పాఠశాలను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనా వచ్చింది వారికి. విద్యార్థులకు ఒత్తిడి లేని చదువులను ఎలా అందించాలి? ప్రయోగాలు, మాటామంతి ద్వారా ఎలా బోధించాలి? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం అనేక పుస్తకాలు చదివారు. ‘టోటో-చాన్‌: ది లిటిల్‌ గర్ల్‌ ఎట్‌ ది విండో’ అనే జపనీస్‌ పుస్తకం ద్వారా ప్రేరణ పొందారు. అలా ధార్వాడ్‌లో 1994లో ‘బాలా బలగా’ అనే పాఠశాలను స్థాపించారు. వారి ఇంటి వరండానే ఆ పాఠశాలకు వేదికగా మార్చుకున్నారు. 

ఆలోచనలు పంచుకోవచ్చు
పాఠశాల ప్రారంభించిన మొదట్లో, ముగ్గురు విద్యార్థులు చేరారు. ఏడాది గడిచేసరికి ఈ సంఖ్య 13కి చేరింది. ప్రస్తుతం సుమారు 250 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర ప్రయివేటు నర్సరీ పాఠశాలల వలే మొదటి రోజు బడికి రాగానే వర్ణమాల రాయడం, వాటిని దిద్దించడం ఇక్కడ చేయరు. చిన్న చిన్న కథలు, సంగీతం, పెయింటింగ్‌... ఇలా వారికి నచ్చిన విద్యను నేర్పుతారు. కేవలం అకడమిక్‌ చదువులే కాకుండా ఒత్తిడి లేని ఆచరణాత్మక విద్యను అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ పిల్లలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. నచ్చింది మాట్లాడొచ్చు. వచ్చిన ఆలోచనలు ఎవరితోనైనా పంచుకోవచ్చు.      నర్సరీతో మొదలైన ఈ పాఠశాల నానాటికీ అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం పదోతరగది వరకూ విద్యను అందిస్తోంది. ఇక్కడి విద్యార్థులకి కార్యాచరణ-ఆధారిత అభ్యాసం కావడంతో పెద్ద క్యాంపస్‌కు పాఠాశాలను మార్చారు. ప్రతీ తరగతి గదిని ప్రకృతి, పిల్లల స్నేహపూర్వకంగా తీర్చిదిద్దారు. ఒక తరగతికి సుమారు 30మంది విద్యార్థులకు మాత్రమే ఉంటారు.  ఏడో తరగతి విద్యార్థుల వరకూ కన్నడలోనే బోధిస్తారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చేరువయ్యేలా ఈ ప్రయివేటు పాఠశాలని నిర్వహిస్తున్నారు. ఫీజులను సైతం విద్యార్థి ఇంటివారు భరించగలిగినంతే తీసుకుంటారు. పేదవాళ్లం, చెల్లించలేం అంటే.. తీసుకోరు.  

బోధన ఎలా ఉంటుంది?
ఈ పాఠశాల విద్యను ఎక్కువగా ‘యాక్టివిటీ బేసిడ్‌ లెర్నింగ్‌’ పద్దతిలోనే బోధిస్తుంది. చిన్నారులకు ఆటల ద్వారా లెక్కలు నేర్పడం, బొమ్మలు గీయడం, వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లోని చిత్రాలను కత్తిరించి వాటి వెనకున్న కథలు చెప్పమని అడుగుతారు. ఇక పై తరగతుల వారికి అకడమిక్‌ చదువులతో పాటు ‘విజిటర్‌ యాక్టివిటీస్‌’ నిర్వహిస్తారు. దీని ద్వారా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ముందుకు వచ్చి పాల్గొనొచ్చు. కథలు చెప్పచ్చు. వివిధ రకాల అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించొచ్చు. తమ సొంత తల్లిదండ్రులు బోధించడం వల్ల వారికి చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. వివిధ రంగాల్లో ప్రముఖులుగా పేరొందిన వ్యక్తులను పిలిపించి, పిల్లలతో మాట్లాడిస్తారు. స్వాతంత్ర పోరాటంలో పాల్లొన్న వారు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, తదితరులు వచ్చి పిల్లలతో అనేక అంశాలు చర్చిస్తారు. ఇక పదోతరగతి పిల్లల కోసం ‘సేవా కేఫ్‌’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా ప్రతి శనివారం వీరే స్వయంగా ఆహారాన్ని వండాల్సి ఉంటుంది. కూరగాయలు కొనడం నుంచి ఆహారాన్ని వండటం వరకూ ప్రతీది ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులే చేస్తారు. దీనివల్ల ఆహారాన్ని ఎందుకు ఉడికించాలి? వంటగదిలో ఏం జరుగుతోంది? ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి? వంటి తదితర ప్రాథమిక జ్ఞానం వారికి కలుగుతుంది. అంతేకాదు,  వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకునేందుకు పొలాల సందర్శనకు తీసుకెళ్తారు. 

ఇప్పుడంతా ఆన్‌లైన్‌..
ప్రస్తుతం మహమ్మారి కారణంగా పాఠశాల మూతపడింది. దీంతో ఆన్‌లైన్‌ విద్యను అందిపుచ్చుకుంది. చిన్నారులకి ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతో విద్యను అందిస్తున్నారు. అందుకు వీడియోలను రికార్డు చేసి వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకి చేరవేస్తున్నారు. పైతరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని