మధుమేహ బాధితులూ  జాగ్రత్త!

కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచమంతా అతలాకుతలమైంది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ..

Published : 18 Nov 2020 14:20 IST

కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచమంతా అతలాకుతలమైంది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అయితే వయసు మళ్లిన వారితోపాటు ఆస్తమా, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వైరస్‌ నుంచి మరింత ముప్పు  ఉందని వైద్యనిపుణలు పదేపదే చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఎప్పటిప్పుడు చక్కెర స్థాయిలను గమనిస్తూ ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1. మందులు వాడటం మర్చిపోవద్దు

కరోనా గందరగోళ పరిస్థితుల వల్ల చెకప్‌ కోసం డాక్టరు దగ్గరికి వెళ్లాలంటే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఎవరి నుంచి కరోనా అంటుకుంటుందోనన్న భయమూ అందుకు కారణమే. రోజువారీ చెకప్‌ కోసం మీరు డాక్టర్‌ దగ్గరికి వెళ్లనక్కర్లేదు. ఫోన్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అవసరమైన సూచనలు సలహాలు పొందవచ్చు. అంతేగానీ, భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే.

2. చక్కెర స్థాయిలను తెలుసుకోండి
ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు. అయితే చక్కెర స్థాయిలు ఎంత ఉన్నయన్నది మనకు మనమే తెలుసుకోవాలి. దీని కోసం రకరకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అదీ వీలుకానప్పుడు కాస్త ఖర్చయినా కొన్ని ఆరోగ్య సంస్థలు బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ వైద్యం చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అవసరమైతే ఆ సేవలను వినియోగించుకోవచ్చు.

3. వ్యాయామం తప్పనిసరి
రోజు వారీ వ్యాయామం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామశాలలకు, పార్కులకు వెళ్లి వ్యాయామం వీలులేకపోతే ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి. ఇంట్లోనే నడవడం, యోగా, చిన్నపాటి వ్యాయామ పరికరాలతో కసరత్తులు చేయడం లాంటివి మర్చిపోవద్దు. అయితే మధుమేహంతోపాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు డాక్టరును సంప్రదించిన తర్వాతే వ్యాయామం చేయడం మంచిది.

4. ఒత్తిడి తగ్గించుకోండి

మధుమేహానికి ఒత్తిడే ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతుంటారు. అందువల్ల ఈ వ్యాధితో బాధపడేవారు తమ మానసిక స్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లతో చర్చించాలి. కరోనా నేపథ్యంలో ప్రచారమవుతున్న రకరకాల పుకార్లను విని వారు ఆందోళన చెందకుండా కుటుంబ సభ్యులు వారికి భరోసానివ్వాలి. వీలైనంత వరకు మధుమేహ బాధితుల ఎదుట కరోనా తీవ్రత, దానివల్ల ఎదురవుతున్న పరిణామాల గురించి చర్చించకపోవడం మంచిది.

5. పోషకాహారం తీసుకోండి
కరోనా వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. దీని ప్రభావం పోషకాహారంపైనా పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వ్యాప్తికి ముందు కచ్చితమైన ఆహార నియమాలు పాటించినప్పటికీ వివిధ కారణాలవల్ల పోషకాహారంపై శ్రద్ధ తప్పుతోంది. దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోషకాహారం తీసుకోకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించేలా ఆహారం తీసుకోవాలి.  కొవ్వులు, పిండిపదార్థాలు ఎంతమేర తీసుకుంటున్నామో కచ్చితంగా బేరీజు వేసుకోవాలి. నూనెపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్, తొందరగా జీర్ణం కాని పదార్థాలు తినకపోవడమే మంచిది.

6. వ్యసనాలకు దూరంగా..

మధుమేహ బాధితులకు పొగతాగటం, మద్యం, పొగాకు, గుట్కా తదితర అలవాట్లు ఉంటే వెంటనే స్వస్తి చెప్పాలి. వీటిలో ఉండే నికోటిన్‌ అనే పదార్థం గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే సమయంలో కరోనా సోకినట్లయితే ఎన్నిమందులు వాడినా ప్రయోజనం ఉండదు. కరోనా మహమ్మారి కూడా మానవుడి ఊపిరితిత్తులు, గుండెపైనే అధికంగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

7. పాదరక్షణ మర్చిపోవద్దు

మధుమేహంతో బాధపడుతున్న వారికి గాయాలైతే అంత తొందరగా తగ్గవు.అసలే చలికాలం. గోరంత పుండైనా కొండంత అవుతుంది. కాళ్లు పగిలిపోతాయి. పెరిఫెరల్‌ వాస్కులార్‌ డిసీజ్‌( పీవీడీ),పెరిఫెరల్‌ న్యూరోపతి (పీఎన్‌) తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వీటి నుంచి రక్షణ పొందడానికి గోరువెచ్చని నీటితో కాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాళ్లను పొడిగా ఉంచేందుకు రకరకాల లోషన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదైనా మంచిది ఎంచుకొని వాడుకోవచ్చు.

8. సామాజిక దూరం మరువొద్దు
కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మనమంతా తరచుగా వింటున్న మాట ఇది. అయినప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. అయితే, మధుమేహ బాధితులు మాత్రం తప్పని సరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం తథ్యం. తాజా పరిస్థితుల్లో మధుమేహ బాధితులు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఒకవేళ మధుమేహ బాధితులకు కరోనా సోకితే వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దృష్టి లోపం వచ్చినా, నలత, ఆకలి, నోరు పొడిబారటం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

-ఇంటర్నెట్‌డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు