ఏలూరు ఘటనలాంటిదే.. అక్కడ!

కొన్ని వ్యాధులు ఎప్పుడు ఎలా పుట్టకొస్తాయో తెలియదు. వాటిని గుర్తించి ఔషధం కనిపెట్టేలోపే కొన్ని వ్యాధులు కనుమరుగవుతాయి. మరికొన్ని ప్రజలపై పంజా విసిరి వేల మంది ప్రాణాలు బలి తీసుకుంటాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కూడా అలాగే ఎక్కడో పుట్టి.. ప్రపంచాన్ని

Updated : 08 Dec 2020 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని వ్యాధులు ఎప్పుడు.. ఎలా పుట్టకొస్తాయో తెలియదు. వాటిని గుర్తించి ఔషధం కనిపెట్టేలోపే కొన్ని వ్యాధులు కనుమరుగవుతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నఫలంగా వంద మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూర్ఛ, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ప్రస్తుతం వైద్యులు దీనికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇది మాస్‌ హిస్టీరియా కావొచ్చని మానసిక నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ఘటనలు గతంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఈ విచిత్రమైన మాస్‌ హిస్టీరియాలు కొంతకాలం ప్రభావం చూపి.. అర్ధాంతరంగా మాయమయ్యాయి. వాటి పుట్టుకకు.. మాయవడానికి గల కారణాలు సైతం ఎవరూ చెప్పలేకపోయారు. అలాంటి వాటిలో లాఫ్టర్‌ ఎపిడెమిక్‌ ఒకటి.

విద్యార్థుల నవ్వులు.. 

అది 1962వ సంవత్సరం, జనవరి 30. టాంగన్యికా(ప్రస్తుత టాంజానియా)లోని కాశాషా గ్రామంలో ఎప్పటిలాగే విద్యార్థులంతా తరగతిగదిలో కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు. హఠాత్తుగా ముగ్గురు విద్యార్థులు నవ్వడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు ఎంత వారించినా నవ్వుతూనే ఉన్నారు. ఆ నవ్వు తోటి విద్యార్థులను, అక్కడి నుంచి పాఠాశాలలోని అన్ని తరగతులకు పాకింది. ఈ వ్యాధిని చరిత్రకారులు లాఫ్టర్‌ ఎపిడెమిక్‌గా పిలుస్తున్నారు. ఈ నవ్వుల వ్యాధి పాఠశాలలోని 159 మందిలో 12-18 ఏళ్ల మధ్య వయసున్న 95 మంది విద్యార్థులకు అంటుకోవడంతో వారంతా నవ్వుతూనే ఉన్నారు. బాధితుల్లో ఈ వ్యాధి కొన్ని గంటల నుంచి 16 రోజుల వరకు ఉండేదట. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, మూర్ఛ, దద్దుర్లు వచ్చాయి. కొందరు ఏడవటం, అవరడం చేసేవారు. ఉపాధ్యాయులకు ఈ వ్యాధి సోకకపోవడం గమనార్హం. 

ఇతర ప్రాంతాలకు వ్యాప్తి

విద్యార్థులంతా నవ్వుతూ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడంతో అదే ఏడాది మార్చిలో పాఠశాలను మూసివేశారు. కొన్ని రోజులకు మళ్లీ తెరిచినా వ్యాధి  అయితే, కొందరు విద్యార్థులు సెలవులు వచ్చాయని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో కుశాషా చుట్టుపక్కల పలు గ్రామాలకు కూడా ఈ వ్యాధి సోకింది. అలా 14 పాఠశాలల్లో దాదాపు వెయ్యి మందికిపైగా విద్యార్థులు అంటువ్యాధి బారిన పడ్డారు. 16 నెలలపాటు ప్రభావం చూపిన ఈ వ్యాధి అంతుచిక్కని రీతిలో కనుమరుగైంది.

వింత వ్యాధిపై వాదనలు

ఈ వ్యాధికి గల కారణాలపై పరిశోధనలు చేసిన కొందరు పరిశోధకులు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు. విద్యార్థులంతా ఒత్తిడికి గురై ఆ విధంగా ప్రవర్తించారని క్రిస్టియన్‌ ఎఫ్‌. హెంపెల్‌మన్‌ అనే పరిశోధకుడు తెలిపారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం.. టాంగన్యికాకు 1962లోనే స్వాతంత్ర్యం వచ్చింది. దీంతో పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వాటిని తట్టుకోలేకే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై నవ్వారట. సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ బార్తలొమ్యూ వివరణ ప్రకారం.. 1960ల్లో ఆఫ్రికాలో మిషనరీ పాఠశాలలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. టాంగన్యికా ప్రజలను ఆ మిషనరీకి చెందిన పెద్దలే పాలించేవారని, ఆ మిషనరీలో ఉండే కఠినమైన కట్టుబాట్లను అక్కడి చిన్నారులు తట్టుకోలేక అలా జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని