కొండను పిండి చేసి.. నీటికి నడకలు నేర్పి..

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో వారు కోకొల్లలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గుడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని గ్రామాలెన్నో. సరిగ్గా అలాంటి సమస్యలతోనే కొట్టిమిట్టాడుతోంది ఓ గ్రామం. దానిని అభివృద్ధి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు...

Updated : 30 Oct 2020 13:03 IST

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు కోకొల్లలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గుడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని పల్లెలెన్నో. సరిగ్గా అలాంటి సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది ఓ గ్రామం. దానిని అభివృద్ధి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. రాజకీయ నాయకులు కేవలం మాటలకే పరిమితమైపోయారు తప్ప హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ గ్రామంలోని 250 మంది మహిళలు అపర కాళికల్లా చెలరేగిపోయారు. నిరాటంకంగా 18 నెలల పాటు ఏకంగా ఓ కొండనే తవ్వేసి తమ గ్రామానికి నీటిని తరలించారు.

మధ్యప్రదేశ్‌లోని అంగ్రోథా... అదో ఆదివాసీ గ్రామం. అక్కడి వారంతా ఏదో కూలి పనులు చేసుకుంటూ.. అడవి తల్లి ఒడిలో నిద్రపోయే వారే. పొట్టకూటికోసం ఏదైనా వ్యవసాయం చేద్దామన్నా నీరు అందుబాటులో ఉండేది కాదు. వర్షాలు కురిసినా ఏం లాభం? జరజరమంటూ దిగువకు పోయేది. వాన నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు. అక్కడికి అర కిలోమీటరు దూరంలో కాల్వ ఉన్నప్పటికీ అందులో నీటిని గ్రామానికి మళ్లించే అవకాశం లేదు. మధ్యలో పెద్ద కొండ. కాల్వ తవ్వించి ఆ గ్రామస్థులకు సాయం చేద్దామన్న ఆలోచన అటు అధికారులకు గానీ, ఇటు ప్రజా ప్రతినిధులకు గానీ రాలేదు.

ఇలా సంవత్సరాలు గడిచిపోయినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు.  ఓవైపు కుటుంబాల పోషణ భారం పెరుగుతోంది. అధికారుల వల్ల పని కాదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆ గ్రామంలోని మహిళలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఏకంగా 18 నెలల పాటు శ్రమించి కొండ తవ్వి.. నీరు ప్రవహించేందుకు వీలుగా మార్గం సుగమం చేసుకున్నారు. కేవలం పార, పలుగులు తప్ప ఎలాంటి యంత్ర పరికరాలూ ఉపయోగించక పోవడం గమనార్హం. కాల్వ సిద్ధం కావడంతో ఆ గ్రామానికిప్పుడు నీరు ఉరుకులతో వస్తోంది. ఇక  వ్యవసాయం చేసుకునేందుకు  సమృద్ధిగా నీరుంటుందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘దగ్గర్లోని కాలవ నుంచి నీటిని తీసుకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అడవుల్లో ఎంత వర్షం పడినా, అలా కిందికి జారుకుంటూ వెళ్లిపోవడమే తప్ప దాంతో మాకు ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు. దీనికి ఎలాగైనా ఓ పరిష్కార మార్గం కనిపెట్టాలనే ఉద్దేశంతో మా ఊరి మహిళలమంతా ఏకమయ్యాం. కొండను తవ్వి నీటిని తీసుకొచ్చాం’’ అని వారంతా అంటున్నారు. దగ్గర్లో నీరున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా వ్యవసాయం చేసేందుకు నీరు ఉండేది కాదని, ఈ సమస్యను ఎలాగైనా జయించాలనే ఉద్దేశంతో తామే ఈ నిర్ణయం తీసుకొని కాల్వ తవ్వుకున్నామని చెబుతున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏళ్లపాటు ఆశతో ఎదురుచూసి అలసిపోయిన ఈ మహిళలు తామే ముందుకొచ్చి తమ పల్లెలో నీటి సమస్యను పరిష్కరించుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. 

-ఇంటర్నెట్‌డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని