Anganwadi Workers: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ అంగన్‌వాడీలు

ప్రభుత్వంతో తమ చర్చలు ఫలప్రదమయ్యాయని, తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్‌వాడీలు ప్రకటించారు.  

Updated : 23 Jan 2024 16:12 IST

అమరావతి: ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్‌వాడీలు (Anganwadi Workers) ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్‌వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, మంగళవారం(ఈరోజు) నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ నెల 24న ఏపీ బంద్‌కు అంగన్‌వాడీలు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు అంశాలను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యథావిధిగా విధులకు హాజరుకావాలని మంత్రి బొత్స అంగన్‌వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో అంగన్‌వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. అంగన్‌వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్‌వాడీలు తమ ముందు 11 డిమాండ్‌లు పెట్టారని, వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. దీంతో సమ్మె విరమణకు అంగన్‌వాడీలు అంగీకరించారని మంత్రి చెప్పారు. రెండు దఫాలు అంగన్‌వాడీలతో చర్చలు జరిగాయని, వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని తెలిపారు. 

అంగన్‌వాడీ టీచర్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు పెంచామని మంత్రి అన్నారు. హెల్పర్‌కు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను రూ.60 వేలకు పెంచామన్నారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు నిర్ణయం తీసుకున్నామని, మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా మారుస్తామన్నారు. చనిపోయిన అంగన్‌వాడీల మట్టి ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తామని మంత్రి తెలిపారు. సమ్మె కాలంపై ఏం చేయాలో సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినందుకు అంగన్‌వాడీలకు మంత్రి బొత్స ధన్యవాదాలు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని