ఒకరితో మొదలైంది.. ప్రభుత్వాన్నే కదిలించింది

భూమిక 30 ఏళ్ల  ఓ హిజ్రా. ఎన్నో అవమానాలు భరించింది. చీత్కారాలు ఎదుర్కొంది. అద్దెకుందామంటే ఇల్లు ఇచ్చేవారు కాదు. అన్ని కష్టాలను పంటిబిగువతో ఓర్చింది. ఎవరైతే చీత్కించుకున్నారో వారితోనే శభాష్‌ అనిపించుకొంది. ఆమెతో మొదలైన ఉద్యమం ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది....

Updated : 16 Oct 2020 14:22 IST

 హిజ్రాల విజయగాథ

భూమిక 30 ఏళ్ల  హిజ్రా. ఎన్నో అవమానాలు భరించింది. చీత్కారాలు ఎదుర్కొంది. అద్దెకుందామంటే ఇల్లు ఇచ్చేవారు కాదు. అన్ని కష్టాలను పంటిబిగువతో ఓర్చింది. ఎవరైతే చీత్కరించుకున్నారో వారితోనే శభాష్‌ అనిపించుకొంది. ఆమెతో మొదలైన ఉద్యమం ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించింది. ఆమెలాంటి ఎందరో గూడు లేని అభాగ్యులకు నీడనిచ్చేలా చేసింది. తనలాంటి మరెందరికో దారి చూపించి మార్గదర్శిగా నిలిచింది.

అది తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి. ఆ పట్టణానికి చివర ఓ గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి ప్రారంభించారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ ఇళ్లను కేవలం జిల్లాలోని హిజ్రాల కోసం మాత్రమే కేటాయించారు. దీని వెనుక పెద్ద కథే జరిగింది. భూమిక అనే హిజ్రా పని కోసం పుదు గ్రామం నుంచి కోవిల్‌పట్టికి వెళ్తుండేది. హిజ్రా అనే చులకన భావంతో ఎవరూ పని కల్పించేవాళ్లు కాదు. కనీసం అక్కడే ఉంటూ ఏదైనా ఇళ్లలో పని చేసుకుందామనుకుంటే ఇల్లు అద్దెకిచ్చేవాళ్లు కాదు. దీంతో ఆమె స్థానిక ట్రాన్స్‌ యాక్టివిస్ట్‌ భానుతో కలిసి ఒంటరిగా ఉద్యమం ప్రారంభించింది. తమకు ప్రత్యేకంగా నివాస ప్రాంతాలు కేటాయించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగింది. ఫలితం లేదు. అయినప్పటికీ వారు తమ ప్రయత్నాలను ఆపలేదు. అలాంటి మరో నలుగురైదుగురు చేతులు కలిపారు. అలా పదుల సంఖ్యలో పెరిగారు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. దీంతో వారికి గృహాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ, సామాన్య ప్రజల మధ్యే వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తామని చెప్పింది. దీనిని భాను ససేమిరా అన్నారు. ఇంతలో ఆ జిల్లా కలెక్టర్‌ బదిలీ అయ్యారు. వచ్చే అధికారి ఎలా వ్యవహరిస్తాడోనని మళ్లీ మల్లగుల్లాలు మొదలయ్యాయి.

ఈ సారి కలెక్టర్‌గా సందీప్ కుమార్‌ నండూరి వచ్చారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. వాళ్లు అడిగిందే తడవుగా ప్రత్యేకంగా వాళ్లకు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు. అవసరమైన నిధులు మంజూరు చేశారు. రెవెన్యూ, నైపుణ్యాభివృద్ధి, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో గతేడాది జులైలో ప్రాజెక్టును మొదలు పెట్టి సంవత్సరానికల్లా పూర్తి చేశారు. దీంతో ఆ హిజ్రాల ఆనందానికి అవధుల్లేవు. జిల్లాలో ఇప్పటి వరకు 85 మంది హిజ్రాలను గుర్తించామని, వారికి ఈ ఇళ్లను కేటాయిస్తున్నామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ వెల్లడించారు.

అక్కడే డెయిరీ ఫాం

వాళ్లందరికీ ఒకే చోట ఇళ్లు కేటాయించారు సరే. మరి వాళ్ల జీవనభృతి ఎలా. దీనికోసం వాళ్ల నివాస ప్రాంతానికి సమీపంలో ఓ డెయిరీ ఫాంను ఏర్పాటు చేశారు. దానిని ఉద్యమానికి నాంది పలికిన భూమిక పేరు మీద రిజిస్టర్ చేశారు. ఓ హిజ్రా పేరుమీద డెయిరీ ఫాం రిజిస్టర్‌ కావడం దేశంలోనే ఇది తొలిసారి అయ్యుండొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. డెయిరీ ఫాం ద్వారా పూటకు 300 నుంచి 350 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారట. దగ్గర్లోని పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గృహ సముదాయంలోకి ఇప్పటికే 85 మంది వచ్చి చేరారు. అక్కడికి వచ్చిన వారిలో డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ), తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీస్‌ రిజర్వ్‌ బోర్డు (టీఎన్‌యూఎస్‌ఆర్‌బీ) పరీక్షలకు సన్నద్ధమవుతున్నారట. వీళ్లకి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సందీప్‌కుమార్‌ హామీ ఇచ్చారు.


 

అది సందీప్‌ నగర్‌

ఆ కాలనీకి కలెక్టర్‌ పేరుమీద సందీప్‌ నగర్‌ అని పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. సోలార్‌ పవర్‌, ఆకుపచ్చ రంగులో ఇళ్ల నిర్మాణాలు, పశువుల శాలలు, నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఇలా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. త్వరలో పాలను ఇక్కడే విక్రయించుకునేందుకు వీలుగా మిల్క్‌ సొసైటీ, నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు కావడంపై భూమిక ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైతే తమను చీత్కరించుకున్నారో.. వారికే ఆదర్శంగా నిలిచామని అన్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని