పాటల పోటీ: లైట్‌ ఆన్‌ చేయడమే ఓటు

టెలివిజన్‌, టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చాక ఎన్నో పోటీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాటలు, డాన్సులు, బిగ్‌బాస్‌ అంటూ అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. వీటిలో పాల్గొనేవారికి ప్రేక్షకులే ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు చేయండి, మిస్‌డ్‌

Updated : 16 Oct 2020 11:22 IST

సోవియట్‌ టీవీ కార్యక్రమంలో వింత ఓటింగ్‌

టెలివిజన్‌, టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చాక ఎన్నో పోటీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాటలు, డ్యాన్సులు, బిగ్‌బాస్‌ అంటూ అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. వీటిలో పాల్గొనే వారికి ప్రేక్షకులే ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు చేయండి, మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వండి, ఆన్‌లైన్‌లో ఓటు వేయండని చెబుతున్నారు. కానీ ఇవేవీ అందరికి అందుబాటులో లేని సమయంలోనూ ఇలాంటి పోటీ కార్యక్రమం ఒకటి ప్రసారమైంది. ఇందులో పాల్గొన్న వారికి ప్రేక్షకులు ఓట్లు వేసిన విధానం గురించి తెలిస్తే నివ్వెరపోతారు. ఇలా కూడా ఓట్లు వేయొచ్చా? అని ముక్కున వేలేసుకుంటారు..!

1956 నుంచే యూరప్‌లో టీవీలో పాటల పోటీలు ప్రసారమయ్యేవి. ‘యూరోవిజన్‌’ పేరుతో ప్రసారమైన కార్యక్రమాన్ని యూరప్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ నిర్వాహకులు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ దేశాలతో కలిసి నిర్వహించేవారు. దీంతో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే 1977లో సోవియట్‌ యూనియన్‌ యూరోవిజన్‌లాంటి కార్యక్రమాన్నే దేశీయంగా నిర్వహించాలని భావించింది. ఈ మేరకు ‘ఇంటర్‌విజన్‌’ పేరుతో పాటల పోటీ కార్యక్రమం ప్రారంభించింది. అయితే యూరోవిజన్‌ కార్యక్రమంలో కేవలం అక్కడ ఉండే న్యాయనిర్ణేతలు మాత్రమే ఓటు వేసి గెలిపించేవారు. కానీ, ఇంటర్‌విజన్‌ ఫైనల్‌ రౌండ్‌లో పోటీదారులకు టీవీ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఓట్లు వేసే విధంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. 

అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది. ఓట్లు ఎలా వేయాలి? పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేయమని చెబుతామంటే.. ఆ ఓట్లు కార్యక్రమం నిర్వాహకుల వద్దకు రావడానికే చాలా ఆలస్యమవుతుంది. పైగా ఈ బ్యాలెట్‌ ఓట్లపై అప్పటి ప్రజలకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం నిర్వాహకుల్లో ఒకరు వినూత్న ఓటింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. దేశ విద్యుత్‌శాఖ సహకారంతో ఓటింగ్‌ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. 

లైట్స్‌ ఆన్‌ చేస్తే ఓటు వేసినట్లు..

ఈ ఓటింగ్‌ విధానం ఎలా పనిచేసేదంటే.. కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులు పాట పాడిన తర్వాత ఆ పాట నచ్చితే వెంటనే ఇంట్లో ఉండే లైట్స్‌ ఆన్‌ చేయాలని కార్యక్రమం వ్యాఖ్యాత చెప్పేవారు. అలా చెప్పగానే టీవీ చూస్తున్న ప్రేక్షకులు పాట నచ్చి ఓటు వేయాలనుకుంటే వెంటనే ఇంట్లో ఉన్న లైట్స్‌ ఆన్‌ చేసేవారు. ప్రేక్షకులు లైట్స్‌ ఆన్‌ చేయడం వల్ల వినియోగమైన విద్యుత్‌ను విద్యుత్‌ శాఖ లెక్కగట్టి కార్యక్రమం నిర్వాహకులకు నివేదిక ఇచ్చేది. అలా పోటీదారుల్లో ఎవరికోసమైతే ఎక్కువ విద్యుత్‌ వినియోగమైందో వారే విజేతగా నిలిచేవారు. అలా ఈ కార్యక్రమం 1977 నుంచి 1980 వరకు కొనసాగింది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయిన తర్వాత 2008లో రష్యాలో ఈ కార్యక్రమాన్ని ఒకసారి నిర్వహించి ఆపేశారు. ప్రస్తుతం ఇదే కార్యక్రమాన్ని ‘సొపోట్‌ ఇంటర్నేషనల్‌ సాంగ్‌ ఫెస్టివల్‌’పేరుతో పోలాండ్‌లో నిర్వహిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని