Karnataka: డీకే శివకుమార్‌ సీఎం కావాలి.. ఆయనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు: ఎమ్మెల్యే ఇక్బాల్‌

Eenadu icon
By National News Team Updated : 01 Jul 2025 11:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. సీఎంగా డీకే బాధ్యతలు తీసుకోనున్నట్లు ఇటీవల పలువురు నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా రాష్ట్ర ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి ముందు సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య (Siddaramaiah)ను తప్పించాలని, మిగిలిన పదవీ కాలానికి శివకుమార్‌ను నియమించాలని పార్టీ నేతలు కోరుతున్నట్లు ఇక్బాల్‌ చెప్పారు.

ఇక్బాల్‌ మాట్లాడుతూ..‘నేను ఒక్కడినే కాదు.. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు మార్పును కోరుకుంటున్నారు. వారిలో చాలామంది ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా మంచి పాలన కోరుకుంటున్నారు. అందుకు డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలి. ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. ఆయన చేసిన మంచి కారణంగానే ఇప్పుడు అందరూ మద్దతు తెలుపుతున్నారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని హుస్సేన్‌ తెలిపారు. ఇప్పుడు మార్పు జరగకపోతే 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇది అవసరమన్నారు.

ఇక్బాల్‌ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ గురించే మాట్లాడుతోందన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను విలేకరులు ప్రశ్నించగా..  అది కేవలం పార్టీ అధిష్ఠానం చేతిలోనే ఉంటుందని చెప్పడం గమనార్హం. హైకమాండ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు. 

Tags :
Published : 01 Jul 2025 11:36 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు