gold: విమానాశ్రయంలో 33 కేజీల బంగారం పట్టివేత

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.   

Updated : 11 Jun 2024 16:39 IST

ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం(Mumbai airport)లో రూ.19 కోట్ల విలువైన 33 కేజీల బంగారు(gold) కడ్డీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న నైరోబీకి చెందిన ఇద్దరు మహిళలు బంగారాన్ని లోదుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. విమాన ప్రయాణికుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని తెలిపారు.  

విమానం దిగిన తర్వాత గ్రీన్‌ ఛానల్‌ (green channel) నుంచి బయటకు వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు అంజల్ అబ్ది కాలా (26)ను అధికారులు అనుమతి లేని వస్తువుల గురించి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించారు. దాంతో అనుమానం వచ్చిన మహిళా అధికారులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా మహిళ లోదుస్తుల్లో 8 బంగారు కడ్డీల ముక్కలు, హ్యాండ్‌బాగ్‌లో టేప్‌తో చుట్టిన 20 బంగారు కడ్డీల ముక్కలను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మొత్తం రూ.19 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

అదే విమానంలో వచ్చిన మరో మహిళా ప్రయాణికురాలు సైదా హుస్సేన్ (24) వద్ద టేప్‌తో చుట్టి దాచిన 61 బంగారు కడ్డీలను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఆమె వద్ద మొత్తం 21.4 కిలోలు బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఇద్దరు మహిళలపై కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ప్రాథమిక విచారణలో వారు బంగారం తమది కాదని తెలిపినట్లుగా అధికారులు పేర్కొన్నారు.  అంజల్‌ తరపు న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠి మాట్లాడుతూ అంజల్‌ ఎనిమిది నెలల గర్భిణి అని, ఈ కేసులో అన్యాయంగా ఆమెపై నేరం మోపారని అన్నారు. సైదా అనే మహిళ తన సామాను తీసుకెళ్లమని అంజల్‌ను అభ్యర్థించడంతో ఆమెకు సహాయం చేయబోయి ఈ కేసులో ఇరుక్కున్నారని పేర్కొన్నారు. ఓ గర్భిణి 20 కేజీల బంగారాన్ని శరీరం పైన ఎలా మోయగలదని ప్రశ్నించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని