థ్రిల్లర్‌: ఇరాన్‌లో ‘మొస్సాద్‌’ వేట..!

శుక్రవారం మూడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఇరాన్‌లోని అబ్సార్డ్‌ పట్టణంలో వెళుతున్నాయి.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసే సమయానికి  మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణ రహితంగా తూటాల వర్షం కురిపించారు.

Updated : 30 Nov 2020 13:32 IST

* అణు పితామహుడి హత్య..
* కుంటుపడ్డ ‘గ్రీన్‌సాల్ట్‌ ప్రాజెక్టు’
* మొన్న అల్‌ఖైదా నంబర్‌-2 అంతం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

శుక్రవారం మూడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఇరాన్‌లోని అబ్సార్డ్‌ పట్టణంలో ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసేలోపే మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించారు. ఆ కారులోని వీవీఐపీ మరణించినట్లు ధ్రువీకరించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ. ఆ చనిపోయిన వీవీఐపీ ఎవరో కాదు.. ఆ దేశ అణుకార్యక్రమ పితామహుడిగా భావించే మొసిన్‌ ఫక్రిజాద్‌..!  ఈ విషయం తెలిసన వెంటనే ఇరాన్‌ అగ్గిమీద గుగ్గిలం అయింది. దీని వెనుక ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ హస్తం ఉందని.. దీనికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్‌ ఎప్పటిలానే ఏమీ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఫక్రిజాద్‌ హత్యపై ఇజ్రాయెల్‌ రిపోర్టర్‌ కథనాన్ని రీట్వీట్‌ చేసి ఊరుకొన్నారు.

గతంలో అమెరికా సీఐఏకు తమ దేశంలో ఏజెంట్లుగా పనిచేస్తున్న వారినే గుర్తించి.. వెతికి, వేటాడి చంపిన ఇరాన్‌లోనే.. ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ ఏజెంట్లు స్వైర విహారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇరాన్‌లో నక్కిన అల్‌ఖైదా నంబర్‌-2ను వేటాడి మట్టుబెట్టారు. 

ఎవరీ ఫక్రిజాద్‌..?

మొసిన్‌ ఫక్రిజాద్‌ ఓ భౌతిక శాస్త్రవేత్త. ఆయన  ఇమామ్‌ హుస్సేన్‌ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తారని ఇరాన్‌ బాహ్య ప్రపంచానికి చెబుతుంది. కానీ, ఆ దేశ‌ డీఫాక్టో పాలకులైన ఖోమైనీలకు మాత్రం జవాబుదారీగా ఉండే ‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌’కోర్‌లో ఆయనకు బ్రిగేడియర్‌ హోదా ఉంది. ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ డిఫెన్సీవ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చి’కి, ‘గ్రీన్‌ సాల్ట్‌ ప్రాజెక్ట్‌’కు నాయకత్వం వహిస్తున్నారు. 2018లో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఇరాన్‌ అణుకార్యక్రమైన ఏఎంఏడీ ప్రాజెక్టుకు ఫక్రిజాద్‌ను కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. ఫక్రిజాద్‌ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన దగ్గరకు కూడా ఎవరూ వెళ్లలేరు. ఆయన్ను ఇరాన్‌ రాబర్ట్‌ ఓప్పెన్‌ హైమర్‌ (అమెరికా అణుపితామహుడు)తో పోలుస్తూ గతంలో వాల్‌స్ట్రీట్‌ పత్రిక పేర్కొంది.

ఈ ‘గ్రీన్‌సాల్ట్‌ ప్రాజెక్టు’ ఏమిటీ..?

అణ్వాయుధ తయారీలో యురేనియం ఇంధనంగా ఉపయోగపడుతుంది. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు.. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారు చేసే కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు ‘గ్రీన్‌సాల్ట్‌ ప్రాజెక్టు’. దీనినే ‘ప్రాజెక్టు1-11’ అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్‌హెడ్‌లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాద్‌ కీలకమైన వ్యక్తి. 

కార్లలో మాటువేసి..!

కొన్నేళ్లుగా ఫక్రిజాద్‌ కోసం సీఐఏ, మొస్సాద్‌ ఏజెంట్లు కాచుకు కూర్చున్నారు. దీంతో ఆయనకు ఇరాన్‌ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతోపాటు గన్‌మెన్లు ఆయన వెన్నంటే ఉంటారు. దీంతో ఆయన హత్య కోసం దాదాపు 62 మంది ఓ బృందంగా పనిచేశారని ఇరాన్‌ జర్నలిస్టు మొహమ్మద్‌ ఆహ్వాజే తన కథనంలో పేర్కొన్నారు. వీరిలో అత్యంత సుశిక్షితులైన 12 మంది సాయుధులు కాగా.. మిగిలిన వారు ప్లాన్‌ అమలుకు సహకరించినట్లు పేర్కొన్నారు.  

గత శుక్రవారం ఫక్రిజాద్‌ టెహ్రాన్‌కు 40కిమీ దూరంలోని అబ్సార్డ్‌ పట్టణంలోకి వస్తున్నట్లు ఆగంతకులు సమాచారం తెలుసుకొన్నారు. ఈ పట్టణం ఓ పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ టెహ్రాన్‌లోని సంపన్నుల గెస్ట్‌హౌస్‌లు వంటివి ఎక్కువగా ఉంటాయి. పట్టణం మొదట్లో భారీ వృక్షాలు ఉంటాయి. దీంతో అక్కడే హత్య చేయాలని సాయుధులు ప్లాన్‌ వేశారు. ఒక కారు, నాలుగు మోటార్‌ సైకిళ్లపై వారు సిద్ధంగా ఉన్నారు. మరో ట్రక్కులో బాంబును అమర్చి ఉంచారు.  ఫక్రిజాద్‌ వాహన శ్రేణిలోని మూడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు అక్కడకు రాగానే కరెంటు పోయింది. ట్రక్కు బాంబును పేల్చారు. అనంతరం 12 మంది సాయుధులు నేరుగా ఫక్రిజాద్‌ కారు వద్దకు చేరుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాహనాలపై వచ్చి కాల్పులు జరిపి అదృశ్యం కావడం మొస్సాద్‌ స్టైల్‌.. అందుకే ఇరాన్‌ ఇప్పుడు ఇజ్రాయెల్‌ను నిందిస్తోంది. గతంలో కూడా అర్డెషిర్‌ హుస్సేన్‌ పౌర్‌, మసూద్‌ అలీ మహమ్మద్‌, మాజిద్‌ షహరియార్‌, ముస్తఫా అహ్మద్‌ రోషన్‌ల వంటి అణు శాస్త్రవేత్తలను కూడా ఇలానే అంతమొందించారు. 

కొన్నాళ్ల క్రితమే అల్‌ఖైదా నంబర్‌-2 అంతం..!

ఆగస్టు 7వ తేదీన టెహ్రాన్‌లో తెల్లరంగు కారుపై బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి క్షణాల్లో అదృశ్యమైపోయారు. ఆ కారులో ఉన్న ఓ వ్యక్తి.. అతని కుమార్తె ఈ ఘటనలో మరణించారు. ఆ మరణించిన వ్యక్తి పేరు హబీబ్‌ దావూద్‌ ఇబ్రహీం అని.. లెబనాన్‌ హిస్టరీ ప్రొఫెసర్‌ అని ఇరాన్‌ పేర్కొంది. హిజ్బోల్లాతో కలిసి పనిచేస్తారని వెల్లడించింది.  కారులోని మహిళ అతని కుమార్తె మరియం అని చెప్పారు. కానీ, ఆ పేరుతో అసలు హిస్టరీ ప్రొఫెసర్‌ ఎవరూ లేరని తేలింది. హిజ్బోల్లా కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు. నవంబర్‌ 13న అసలు విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ బయటపెట్టింది. ఆగస్టు 7న మరణించిన వ్యక్తి ఈజిప్టు వాసి అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా.. అలియాస్‌ అబు అల్‌ మస్రీ..! అల్‌ఖైదా నంబర్‌ 2..! 1998లో ఆఫ్రికాలో కెన్యా రాజధాని నైరూబీలో, టాంజానియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడికి సూత్రధారి. బిన్‌లాడెన్‌ వెంట వచ్చి అల్‌ఖైదా ఏర్పాటు చేసిన తొలి వందమందిలో ఏడో వ్యక్తి. అల్‌మస్రీతోపాటు మరణించిన మరియంను..ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా భార్యగా గుర్తించారు. హమ్జాను 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అల్‌ఖైదాను ఇరాన్‌ వ్యతిరేకిస్తోంది. కానీ, దివంగత జనరల్‌ ఖాసీం సులేమానీ ఆశీస్సులతో వీరికి ఆశ్రయం దొరికింది. 

అల్‌మస్రీని మట్టుబెట్టే పనిని అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌కు అప్పజెప్పింది. సీఐఏ మస్రీ అనుపానులు సేకరించి  మొస్సాద్‌కు అందించింది. మొస్సాద్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన ‘కిదూన్‌’ యూనిట్‌ రంగంలోకి దిగింది. మొస్సాద్‌ మిగిలిన ఏజెంట్లకు కూడా ఈ కిదూన్‌ యూనిట్‌ వివరాలు తెలియవు. ఇజ్రాయెల్‌ హైప్రొఫైల్‌ వ్యతిరేకులను మట్టుబెట్టడం దీని విధి. లక్ష్యం ఛేదించాక ఆధారాలు లేకుండా అదృశ్యం కావడం దీని స్టైల్‌. కొన్నాళ్ల కిందట ఇరాన్‌ రక్షణ స్థావరాల్లో పేలుళ్లు కూడా ఇదే విభాగం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. బైక్‌పై వచ్చి మట్టుబెట్టడం కిదూన్‌ మార్క్‌ స్టైల్‌. 1998 పేలుళ్లలో కెన్యాలో చనిపోయిన వారిలో ఇజ్రాయిలీలు కూడా ఉన్నారు. అందుకే కిదూన్‌ రంగంలోకి దిగి మస్రీపై ప్రతీకారం తీర్చుకొంది. 1998లో పేలుళ్లు జరిగింది ఆగస్టు 7వ తేదీనే.. మస్రీ అంతం కూడా సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఆగస్టు 7వ తేదీనే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని