కరుణ రసం: ట్రంప్‌లో కొత్తకోణం..!

‘థాంక్స్‌ గివింగ్స్‌ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు ట్రంప్‌ క్షమాభిక్షను పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ,  ఆ తర్వాత  కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు..తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో

Updated : 25 Dec 2020 12:53 IST

 క్షమాభిక్షల వర్షం..

రెండు రోజుల్లో 41 మందికి దర్యాప్తుల నుంచి ముక్తి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘థాంక్స్‌ గివింగ్‌‌ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ క్షమాభిక్ష పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ,  ఆ తర్వాత  కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు.
తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో ఆయనలో కరుణ రసం పొంగిపొర్లుతోంది. దీంతో రెండు రోజుల్లో 41 మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. వైట్‌హౌస్‌ను వీడేలోపు ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు. తన ఆప్తులు.. సొంతపార్టీ వ్యక్తులు, అనుచరులు.. కుటుంబ సభ్యులకు వరుసగా క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ జాబితాలో రష్యన్‌ గేట్‌ అనుమానితులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన వారు.. ఇవాంక ట్రంప్‌ మామ వంటి వారు ఉన్నారు. ట్రంప్‌ వ్యవహారశైలితో.. అధ్యక్షుడి క్షమాభిక్ష అధికారంపై అమెరికాలో చర్చకు తెరలేచింది.

అసలు ఈ క్షమాభిక్షల అధికారం ఏమిటీ..?

అమెరికా చట్టాలను అతిక్రమించిన వారిని, దేశంలో నేరాలు చేసిన వారిని క్షమించే అధికారం ఆ దేశాధ్యక్షుడికి ఉంది. ఈ విషయాన్ని అక్కడి సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్‌ కూడా ఆయన్ను ఏమీ చేయలేదు. ఈ విషయంలో అధ్యక్షుడు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కనీసం  కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 
అభిసంశనకు గురైన అధికారులు మాత్రం ఈ క్షమాభిక్షకు అనర్హులు. అమెరికాలో ఫెడరల్‌ చట్టాల పరిధిలో నేరాలకు క్షమాభిక్ష ఇవ్వొచ్చు కానీ.. అక్కడి రాష్ట్రాల పరిధిలోని చట్టాల్లో ప్రస్తావించిన నేరాలకు పాల్పడిన వారికి మాత్రం వర్తించదు.

ఇప్పుడే ఈ హడావుడి ఎందుకు..?

2016 ఎన్నికల్లో ఓటమికి రష్యన్లు ట్రంప్‌నకు సాయం చేశారని డెమొక్రాట్లు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో బైడెన్‌ అధికారం చేపట్టగానే ‘రష్యా జోక్యం’పై విచారణను వేగవంతం చేస్తారన్నది ట్రంప్‌ అనుమానం. ఇది నిజమైతే ఆయన మాజీ సలహాదారు రోజర్‌ స్టోన్‌, ప్రచార విభాగం అధ్యక్షుడు పాల్‌ మ్యాన్‌ఫోర్ట్‌ వంటి వారితో పాటు.. తన పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, అల్లుడు జరేడ్‌ కుష్నెర్‌ వంటి వారిపై దర్యాప్తులు వేగవంతమవుతాయి. అంతిమంగా అవి తన దాకా వస్తాయని ట్రంప్‌ భయపడుతున్నారు. అంతే కాదు పిల్లలు ఎరిక్‌ ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌లతో పాటు.. తన న్యాయసలహాదారుడు రూడీ గులియాని వంటి వారిని బైడెన్‌ సర్కార్‌ లక్ష్యాంగా చేసుకుంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే మెన్‌ఫోర్ట్‌, స్టోన్‌లతోపాటు అల్లుడు కుష్నెర్‌ తండ్రి చార్లెస్‌ కుష్నెర్‌కు కూడా క్షమాభిక్షను ఇచ్చేశారు. బ్లాక్‌ వాటర్స్‌ అనే అమెరికా కిరాయి సైన్యంలోని సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ముందస్తు క్షమాభిక్షలు కూడా..! 

ఇక ట్రంప్‌ ముందస్తుగా కూడా కొందరికి క్షమాభిక్షలను ఇవ్వాలనుకుంటున్నారు. సాధారణంగా కొనసాగుతున్న దర్యాప్తులు, నేర నిరూపణ తర్వాత క్షమాభిక్షలను మంజూరు చేస్తారు. కేసులు నమోదుకానీ నేరాలపై కూడా ముందుస్తుగా క్షమాభిక్షను మంజూరు చేయవచ్చు. దీనిని అమెరికా సుప్రీం కోర్టు 1866లో ధ్రువీకరించింది. రిచర్డ్‌ నిక్సన్‌ తన పదవీ కాలంలో పాల్పడిన నేరాలన్నిటికీ ఆయన వారసుడైన 38వ అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ నుంచి ముందస్తు క్షమాభిక్షను పొందాడు. వాటర్‌గేట్‌ కుంభకోణంలో నిక్సన్‌ పేరు వచ్చిన విషయం తెలిసిందే.  తన కుటుంబీకులకు ట్రంప్‌ ఇటువంటి క్షమాభిక్షలను ఇచ్చే అవకాశం ఉంది.

గతంలో అధ్యక్షులు చేయలేదా..?

రాజకీయాల్లో బంధుప్రీతికి అమెరికా కూడా మినహాయింపేమీ కాదు. 2001లో కొకైన్‌ వినియోగించిన కేసులో నేరనిరూపణ అయిన తన సోదరుడు రోజర్‌కు నాటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ క్షమాభిక్షను మంజూరు చేశారు. ట్రంప్‌తో పోలిస్తే క్లింటన్‌ ఎక్కువ మందికి క్షమాభిక్షను పెట్టారు. మొత్తం 450 మంది ఆయన నుంచి క్షమాభిక్షను పొందారు. వీరిలో డెమొక్రటిక్‌ పార్టీకి చందాలు ఇచ్చే మార్క్‌ రిచ్‌ కూడా ఉన్నారు. ఆయన పన్ను ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

* వియత్నాం-అమెరికా యుద్ధ సమయంలో తప్పనిసరిగా మిలటరీ సర్వీసు చేయాలనే నిబంధనను ఉల్లంఘించిన వేలాది మందికి 1977లో అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ ముందస్తు క్షమాభిక్షను మంజూరు చేశారు.

స్వీయ క్షమాభిక్షపై ట్రంప్‌ దృష్టి..!

2018లో ట్రంప్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘నన్ను నేను క్షమించుకొనే హక్కు ఉంది’ అని వాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారితీశాయి. ఏ వ్యక్తి తన  కేసుకు తానే తీర్పు చెప్పుకోకూడదనే సూత్రానికి ఇది విరుద్ధమని వాదించారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు. ఇప్పుడు అది నిజం అయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితమే తన న్యాయసలహాదారు రూడీ గులియానీతో ఈ విషయమై చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని టైమ్స్‌ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇదే సమయంలో ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌, ఇవాంకల క్షమాభిక్ష వ్యవహారాన్ని కూడా చర్చించారు. స్వీయ క్షమాభిక్ష వ్యవహారం మరో న్యాయ పోరాటానికి దారీతీసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు.. ఫెడరల్‌ చట్టాల నుంచి ట్రంప్‌ తప్పించుకొన్నా.. అమెరికా రాష్ట్రాల చట్టాలు ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది. 

ఇవీ చదవండి

బ్రిటన్‌ ప్రభుత్వంలో రాణికున్న అధికారాలేంటి?

కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని