ఇమ్రాన్‌ నోటి దురుసు.. అమెరికా ఆంక్షలు..!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..! ఈ సామెత ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంకా తెలిసినట్లు లేదు. ఆయన టర్కీ ఖలీఫా రాజ్యస్థాపనలో తలమునకలై మిత్రులను కూడా దూరం చేసుకొంటున్నారు. ఫలితం ఆ దేశ సైన్యానికి ఆయుధాల (మెయింటెనెన్స్‌) నిర్వహణ కనకష్టంగా

Updated : 02 Dec 2020 12:15 IST

* వందల కొద్దీ యుద్ధవిమానాల భవిష్యత్తు అగమ్యగోచరం 
* దిక్కుతోచని స్థితిలో దాయాది ఎయిర్‌ఫోర్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..! ఈ సామెత ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంకా తెలిసినట్లు లేదు. ఆయన టర్కీ ఖలీఫా రాజ్యస్థాపనలో తలమునకలై.. మిత్రులను కూడా దూరం చేసుకొంటున్నారు. ఫలితం ఆ దేశ సైన్యానికి ఆయుధాల (మెయింటెనెన్స్‌) నిర్వహణ కష్టంగా మారి మూలనపడే పరిస్థితి నెలకొంది. ఇక  చైనా అన్నయ్య సాయం చేస్తాడనుకుంటే.. అమెరికా ఆంక్షలు కట్టిపడేశాయి. దీంతో ఆ దేశ ప్రధాన ఫైటర్‌ జెట్‌ జే-17కు ఇంజిన్లు దొరకడం కష్టంగా మారింది. ఇక మిగిలిన ఫ్రాన్స్‌ మిరేజ్‌ విమానాలను మెల్లిగా డంపింగ్‌యార్డ్‌కు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. ‘చివరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అన్నట్లు చేశారు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్‌.

బెడిసికొట్టిన పాక్‌ డ్రామా..

ఫ్రాన్స్‌ గత కొంతకాలంగా అంతర్గత ఉగ్రవాదంతో అవస్థలు పడుతోంది. శరణార్థులుగా వచ్చిన వారు మతం పేరుతో దాడులకు పాల్పడుతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్‌కు తలనొప్పిగా మారింది. 2022లో ఎన్నికలు ఉండటంతో చకచక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తీవ్రవాద భావజాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్‌తో కలిసి ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక రకంగా ఫ్రాన్స్‌ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడమే. అంతేకాదు ఆయన మంత్రి వర్గంలో షామహమూద్‌ ఖరేషీ అనే మంత్రిగారు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఫ్రాన్స్‌ నుంచి పాకిస్థాన్‌ రాయబారిని వాపస్‌ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతకీ ఫ్రాన్స్‌లో అసలు పాక్‌కు రాయబారి ఉన్నారా..? అంటే. సమాధానం లేదు. అప్పటికీ మూడు నెలల క్రితమే ఫ్రాన్స్‌లోని పాక్‌ రాయబారి మొయిన్‌ ఉల్‌ హక్‌ను బదిలీపై చైనాకు పంపించారు. ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు. మరి ఎవరిని వెనక్కి పిలుస్తున్నారో ఇమ్రాన్‌ఖాన్‌కే తెలియాలి. దీనికి తోడు ఫ్రాన్స్‌ వస్తువులను బహిష్కరించాలని కూడా అక్కడి నేతలు పిలుపునిచ్చారు.

ఈ డ్రామ మొత్తం గమనించిన ఫ్రాన్స్‌ ఇక పాక్‌ను ఉపేక్షించకూడదని నిర్ణయించింది. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని మిరేజ్‌ విమానాలను అప్‌గ్రేడ్‌ చేయకూడదని.. ఆ దేశ నావికాదళంలోని ఫ్రాన్స్‌లో తయారైన అగోస్టా 90బీని కూడా ఇక పట్టించుకోకూడదని ఇమ్మానియేలు మాక్రోన్‌ హుకుం జారీ చేశారు. దీంతో పాక్‌ బిత్తరపోయింది. ఆ దేశ వైమానిక దళంలో 87 మిరేజ్‌-3, 92 మిరేజ్‌-5 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అప్‌గ్రేడ్‌ చేయడం ఇక దాదాపు అసాధ్యం. అంతేకాదు  పాక్‌ వద్ద ఉన్న మూడు అగోస్టా 90బీ సబ్‌మెరైన్‌ల అప్‌గ్రేడింగ్‌ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

చైనా జే-17ను ఏం చేయాలి..

పాక్‌ తరచూ గొప్పగా చెప్పుకొనే విమనం చైనా తయారీ జే-17. ఇప్పుడు దాని గొప్పతనం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ విమానానికి గుండెకాయ వంటి ఆర్‌డీ-93 ఇంజిన్‌ను రష్యాలోని రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్ట్‌ నుంచి కొనుగోలు చేసి అమర్చారు. అమెరికా 2018లో రష్యాలో ఆయుధ విక్రయ ఏజెన్సీ రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్ట్‌పై ఆంక్షలు విధించింది. దీంతో ఈ సంస్థ డాలర్లలో ట్రేడ్‌ చేయలేదు. ఓ పక్క ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉండటంతో పాకిస్థానీ కరెన్సీకి విలువ లేదు. అలా అని ఎయిర్‌ఫోర్స్‌లోని విమానాల ఇంజిన్లు సర్వీసు లేకుండా పనిచేయవు. నిర్ణీత గంటలు విమానాలు గాల్లో తిరిగాక దాని ఇంజిన్‌ను కచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు జే-17లకు ఆర్‌డీ-93 ఇంజిన్లు, స్పేర్‌పార్టులు లభించడంలేదు. దీంతో పాక్‌లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాల సంఖ్య  తగ్గిపోతోంది. నాలుగు వైమానిక స్థావరాల్లో కలిపి పాక్‌ వద్ద 100 జే-17లు ఉన్నాయి. మరో ఇరవై వరకు ట్రైనర్‌ రకం జే-17లు ఉన్నాయి. వీటన్నిటికి ఇంజిన్‌ అవసరాలు తీవ్రంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లోనే కొత్తగా తయారు కానున్న జే-17 బ్లాక్‌3 మోడల్‌కు కూడా ఈ కొరత సెగ తగిలింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆర్‌డీ-93 ఇంజిన్‌ను తొలగించి.. చైనా తయారీ ఇంజిన్‌ను అమర్చాల్సి ఉంటుంది. చైనా ఇంజిన్‌ నాణ్యత రష్యా ఇంజిన్ల నాణ్యతతో పోలిస్తే ఘోరంగా ఉంటుంది. అందుకే డ్రాగన్‌ ప్రధాన ఫైటర్‌ జెట్లలో కూడా రష్యా ఇంజిన్లు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని