పాక్‌ను ఇప్పుడేమనాలి..!

పాకిస్థాన్‌కు అరబ్‌ ప్రపంచలోని ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామలు చెబుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి సంబంధాలను పెట్టుకోగానే.. పాకిస్థాన్‌కు పూనకం వచ్చింది.. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు

Updated : 27 Dec 2020 12:29 IST

* టర్కీ తోకపట్టుకున్నందుకు తలబాదుకోలేక..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాకిస్థాన్‌కు అరబ్‌ ప్రపంచంలో ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోగానే.. పాకిస్థాన్‌కు పూనకం వచ్చింది. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  మరోపక్క పాక్‌ను ఎగదోసిన టర్కీ మాత్రం ఇజ్రాయెల్‌తో సంబంధాలను నెరుపుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో తన రాయబారిని నియమించింది. ఈ పరిణామం పాక్‌ను ప్రపంచం ముందు వెర్రిదాన్ని చేసింది.

ఆగస్టు నెలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌-ఇజ్రాయెల్‌ ‘అబ్రహం అకార్డ్‌’పై సంతకం చేయడంతో గల్ఫ్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. చాలా ముస్లిం దేశాలు యూఏఈ, సౌదీల నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తాయని.. వాటికి తాము నాయకత్వం వహించవచ్చని టర్కీ, పాక్‌లు భావించాయి. అబ్రహం అకార్డ్‌ తర్వాత టర్కీ, పాక్‌లు ఇజ్రాయెల్‌ను, పరోక్షంగా యూఏఈని విమర్శించాయి. అంతకుముందు కశ్మీర్‌ విషయంలో సౌదీ మద్దతు లభించకపోవడంపై పాక్‌ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు కోపం వచ్చింది. సౌదీ తమకు చెల్లించాల్సిన రుణాలు వాపస్‌ చేయాలని కోరింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో పాక్‌  చైనా ఎదుట చేయిజాచి సొమ్ము తీసుకొంది. సౌదీకి వాపస్‌ చేసింది. అంతేకాదు, సౌదీ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా చేసిన ప్రయత్నాలూ సత్ఫలితాలను ఇవ్వలేదు. పాక్‌ ఇక్కడ ఒక విషయం మర్చిపోయింది.. ఆర్థిక అండదండలు ఇచ్చే సౌదీ-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌‌పై  స్వరం పెంచి మాట్లాడింది. దీంతో చమురు, నిధులు ఇచ్చే సౌదీ దూరమైంది.  కేవలం టర్కీ ఉందనే ధైర్యంతో ఇలా చేసింది.

పాక్‌ను రెచ్చగొట్టి.. తాను పక్కకు తప్పుకొని..

వాస్తవానికి టర్కీ-ఇజ్రాయెల్‌కు ఎప్పటి నుంచో దౌత్య సంబంధాలు ఉన్నాయి. 2018 మే వరకు టర్కీ రాయబారి ఇజ్రాయెల్‌లో ఉన్నారు. 2017లో అమెరికా జెరుసలేమ్‌ను ఇజ్రాయెల్‌ రాజధానిగా అమెరికా గుర్తించింది. ఆ తర్వాత పరిణామాలతో 2018లో టర్కీ తన రాయబారిని వాపస్‌ తీసుకుంది. తాజాగా తన ప్రత్యర్థులైన సౌదీ, యూఏఈతోపాటు బహ్రెయన్‌, సూడాన్‌, మొరాకో వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో దోస్తీ చేస్తున్నాయి. టర్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనలు కఠినంగా.. చేతలు మాత్రం ఉదారంగానే ఉన్నాయి. తాజాగా బైడెన్‌ శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతుండటంతో ఇక తన ఆటలు సాగవని టర్కీకి అర్థమైంది. దీంతో ఇజ్రాయెల్‌ను దూరం పెట్టడం ఏమాత్రం మంచిది కాదని భావించి.. ఆగమేఘాల మీద ఓ రాయబారిని  నియమించింది. ‘అబ్రహం అకార్డు’ను విమర్శించిన ఐదు నెలల్లోనే టర్కీ స్వరం మారిపోయింది. వాషింగ్టన్‌ను శాంతపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఇక టర్కీ వెనుక ఉన్న పాక్‌ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.

టర్కీ చర్యతో ఏమి చేయాలో తెలియని పాక్‌ విదేశాంగశాఖ మంత్రి ఖురేషీ ‘‘తాము మాత్రం ఇజ్రాయెల్‌ను గుర్తించం’’ అని తెలిపారు. యూఏఈ, సౌదీ నుంచి ఒత్తిడి వస్తోందని.. ఖురేషీ చెప్పారు. తాము మాత్రం యుఏఈకి పాక్‌ ప్రజల మనోభావాలను వెల్లడించామన్నారు. 

త్వరలో సౌదీ సంకేతాలు..

ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకునే దేశాల్లో త్వరలో సౌదీ అరేబియా కూడా చేరే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్‌ రీజనల్‌ కోపరేషన్‌ మినిస్టర్‌ అఫీర్‌ అకునీస్‌ వైనెట్‌ న్యూస్‌తో మాట్లాడుతూ..‘‘త్వరలో మరో రెండు దేశాలు కూడా తమతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురానున్నాయి. వీటిల్లో ఒకటి గల్ఫ్‌ ప్రాంతానికి చెందింది. ఒక పెద్ద ముస్లిం దేశం.. పాకిస్థాన్‌ మాత్రం కాదు’’ అని తెలిపారు.

ఇవీ చదవండి

కశ్మీర్‌లోకి టర్కీ విషం..!

వింగ్‌లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని