Aamir Khan: ‘ఏ పార్టీ కోసం ప్రచారం చేయలేదు..అది నకిలీ వీడియో’: ఆమిర్‌ఖాన్‌

ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వైరల్ అయిన వీడియో నకిలీదని ఆయన బృందం వెల్లడించింది. 

Updated : 16 Apr 2024 15:19 IST

ముంబయి: ఇంతవరకు ఎన్నడూ తాను ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయలేదని ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) వెల్లడించారు. ఫలానా పార్టీ తరఫున తాను ప్రచారం చేస్తున్నానంటూ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వీడియో నకిలీదని స్పష్టంచేశారు.

‘‘గత ఎన్నికల సమయంలో.. ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఆయన ఎన్నికల సంఘం తరఫున  ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే ఆయన ఒక నిర్దిష్ట పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ ఒక వీడియో వైరల్ అయింది. అది పూర్తిగా నకిలీ, అవాస్తవ వీడియో. దీనిపై ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని ఆమిర్‌ఖాన్‌ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఈసందర్భంగా ఆయన ఓటర్లకు సందేశం ఇచ్చారు. అందరూ ఓటు వేసి, దేశ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. సదరు వీడియో ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 10ఏళ్ల క్రితం ఆమిర్‌ వ్యాఖ్యాతగా చేసిన ‘సత్యమేవ జయతే షో’లోని క్లిప్‌ను అందులో ఉపయోగించినట్లు వెల్లడించాయి.

కృత్రిమ మేధ (AI) ద్వారా డీప్‌ఫేక్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త సవాళ్లు విసురుతున్న విషయం తెలిసిందే.  సినీ తారలు రష్మిక, కత్రినాకైఫ్‌ మార్ఫింగ్‌ వీడియోలు కలకలం సృష్టించాయి. వాటి కట్టడికి ఓవైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటివి మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఐ నియంత్రణకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు