Deve Gowda: నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన

లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టవద్దని జేడీఎస్ అధినేత దేవెగౌడ పేర్కొన్నారు. 

Updated : 18 May 2024 16:08 IST

బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) వీడియోల వ్యవహారంలో జేడీఎస్‌ అధినేత దేవెగౌడ మొదటిసారి స్పందించారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదన్నారు. ఇందులో చాలా మందికి ప్రమేయం ఉందని, వారిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జాతీయ మీడియాతో మాట్లాడారు. 

‘‘ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు. చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ.. వారిపై కూడా చర్యలు ఉండాలి’’ అని దేవెగౌడ అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఉన్న సమయంలో కూడా టచ్‌లో లేనన్నారు.  అతడి వెంట పరిగెత్తాలా ఏంటి..? అని ప్రశ్నించారు.

మరోపక్క, కిడ్నాప్‌ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడి లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను అపహరించిన కేసులో మే 4న ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు రాగా.. సాయంత్రం 5.17 గంటల నుంచి 6.50 గంటల వరకు సరైన సమయం కాదని, ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం 6.50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోవడం గమనార్హం. ఇక, ప్రజ్వల్‌ను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని