Eric Garcetti: భారత్‌-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం

భారత్‌-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్‌ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు.

Updated : 22 May 2024 07:17 IST

ఇక్కడ అవకాశాలు పుష్కలం
అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు
జనరిక్‌ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం 
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి
ఐ.ఆర్‌.శ్రీనివాసరావు
ఈనాడు - హైదరాబాద్‌

భారత్‌-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్‌ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందని, అమెరికా దాన్ని స్వాగతిస్తోందని చెప్పారు. రెండు దేశాల సంబంధాలు గడిచిన ఏడాదిలో చరిత్రాత్మక స్థాయికి చేరాయని వివరించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం 190 బిలియన్‌ డాలర్లకు చేరిందని, జనరిక్‌ ఔషధాల విషయంలో అమెరికా భారత్‌పైనే ఆధారపడుతోందని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తాయని, శిలాజ రహిత ఇంధన(నాన్‌ ఫాసిల్‌ ఫ్యూయల్‌) రంగంలో 2030 నాటికి భారత్‌ 500 గిగావాట్ల స్థాయికి చేరుతుందని అన్నారు. రాయబారిగా ఆయన ఇటీవల ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత్‌లో మీరు రెండు దేశాల సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్ఠపరచడంలో మీ ప్రాధాన్యాంశాలు ఏమిటి  ?

భారత్‌-అమెరికా సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావవంతమైనవి. భారత్‌ ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని మేం స్వాగతిస్తాం. ఇరు దేశాల సంపద పెంపు, ప్రజారక్షణ, పర్యావరణంలో మార్పులు తదితర అంశాలపై కలిసి పని చేయడమన్నది ప్రస్తుత ప్రాధాన్యాంశం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం నాకు బాగా సంతృప్తి ఇస్తోంది. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రతి విషయంలోనూ పూర్తి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చుగానీ... మన ఉమ్మడి కలలు, ప్రజల సంక్షేమం తదితరాల విషయంలో ఇరు దేశాలను ఒకే తాటిపై ఉంచగల అంశాలపై ఉభయులకూ పూర్తిస్థాయి అవగాహన ఉంది. సంయుక్తంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ లాభదాయకమవుతుంది.

 

ఏడాది పూర్తి చేసుకున్నారు కదా.. మీ అనుభవం ఏం చెబుతోంది?

జవాబు: పూర్తి సంతృప్తితో ఉన్నా. అమెరికా-భారత్‌ సంబంధాల విషయంలో ఈ ఏడాది చరిత్రాత్మకమైనది. ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు పలు అంశాల్లో చాలా మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు భారత ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ సందర్శన, దిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సుకు అమెరికా నేతల రాక... ఇలాంటి ఎన్నో అంశాలు మంచి సంబంధాలకు తార్కాణాలు. ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత మెరుగైన బంధాలకు పటిష్ఠ పునాదులవుతాయి. ఓ దౌత్యవేత్తగా నేనున్నప్పుడే ఇవన్నీ జరగడం సంతోషకరం. చేయాల్సినవి, జరగాల్సినవీ ఇంకెన్నో ఉన్నాయి.  

అమెరికా-భారత్‌ మధ్య వినూత్న పరిశోధనలు, కాలుష్యరహిత ఇంధనం (క్లీన్‌ ఎనర్జీ), ఆరోగ్య సంరక్షణ వంటి కీలక విషయాల్లో ద్వైపాక్షిక సహకారం ఎలా ఉంది   ?

జ: ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. క్లీన్‌ ఎనర్జీ సాంకేతికత అంటే సోలార్‌ ప్యానెళ్లు, విద్యుత్‌ బ్యాటరీల రంగంలో 2030 నాటికల్లా భారత్‌ 500 గిగావాట్ల ఉత్పాదనకు చేరువయ్యేలా చూడాలన్నది మా సంకల్పం. వ్యాక్సిన్ల విషయానికి వస్తే ఇప్పటికే భారత్‌ నుంచి అనేక దేశాలకు టీకాలు సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో భారత్‌ కంపెనీలతో మా దేశ కంపెనీల భాగస్వామ్యం కొనసాగుతోంది. మరిన్ని రంగాల్లో సహకారానికి అవకాశముందని యూఎస్‌-ఇండియా ఇనిషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వేదికగా ఇరు దేశాల నేతలు పేర్కొన్నారు. ఆ దిశగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇలా చేయడం ప్రపంచం మొత్తానికి మంచి చేయూత అవుతుంది.

ఇండో-పసిఫిక్‌  ప్రాంతాల్లోని సవాళ్ల నేపథ్యంలో... సముద్ర జలాలు,  తీరప్రాంత రక్షణ, ఉగ్రవాదానికి విరుగుడైన కౌంటర్‌ టెర్రరిజం తదితర అంశాల్లో భారత్‌ పోషిస్తున్న భూమికను మీరెలా చూస్తున్నారు   ?

జ: భారత్‌-అమెరికాలు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ఈ ఇరు దేశాల కృషి అనివార్యం. కౌంటర్‌ టెర్రరిజం, సముద్ర జలాలు, సరిహద్దులను సంరక్షించుకోవడం తదితర అంశాలన్నింటిలోనూ అమెరికా నుంచి భారత్‌కు తగిన మద్దతు ఉంటుంది. భద్రత, క్లీన్‌ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధనలు వంటి వాటిపై ఇరు దేశాలకు చెందిన ఇద్దరిద్దరు(2+2) ప్రతినిధి బృందాలతో ప్రతినిత్యం చర్చలు కొనసాగుతున్నాయి. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌; క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌; ఇండియా-యూఎస్‌ యాక్సలరేషన్‌ ఇకో సిస్టం వంటి వేదికలపైనా భారత రక్షణ, పారిశ్రామిక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యం సహా పలు అంశాల్లో ఉభయ దేశాల మధ్య సహాయ సహకారాలను మీరెలా చూస్తున్నారు ?

జ: ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై అమెరికా-భారత్‌ దేశాలది ఒకే దృక్పథం. సెమీ కండక్టర్ల సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం, అత్యాధునిక రక్షణ ఉపకరణాల తయారీ, సరఫరా వ్యవస్థల రూపకల్పనల్లో సంయుక్త భాగస్వామ్యం వంటివి ఈ కోవలోనివే. భారతీయ వ్యోమగాములకు నాసా ద్వారా శిక్షణ, వ్యవసాయం, ఇంధన వనరులు, ఆరోగ్యం, సాంకేతికత వంటి అంశాలపై పరిశోధనల్లో ఇరు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం... ఇలా చాలా అంశాలున్నాయి. ఉభయ దేశాలతో పాటు క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌లో భాగమైన జపాన్, ఆస్ట్రేలియాలూ సంయుక్తంగా పనిచేస్తే... వ్యాక్సిన్ల తయారీ మొదలుకొని వాతావరణ, పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యం, సాంకేతికత అభివృద్ధిలో మరింత ఊతం లభించి ఇంకా పురోగతి సాధించవచ్చు. అందుకు అవసరమైన కార్య క్షేత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ఇవి సమస్త మానవాళి పురోగతికీ ఉపయుక్తమైన అంశాలు.

అంతర్జాతీయంగా సప్లై-చైన్‌ మేనేజ్‌మెంట్‌లో భారత్‌ పాత్రను ఎలా చూస్తున్నారు?

జ: ఒక దేశం నుంచి మరో దేశానికి ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడాలొచ్చినప్పుడు పరిస్థితులు ఎంతో సంక్లిష్టంగా మారి, ఎలాంటి ఘర్షణలు ఉత్పన్నమవుతాయన్నది ఇటీవలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బాధించినప్పుడు స్పష్టమైంది. ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నప్పుడే అన్ని దేశాలూ ప్రయోజనం పొందుతాయి. ఒక దౌత్యవేత్తగా... భారత్‌ తన దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌కూ తన ఉత్పాదనల్ని సరఫరా చేయాలని ఆశిస్తాను. అమెరికా కొన్ని అవసరాల కోసం భారత్‌ వైపు చూస్తోంది. ఉదాహరణకు మాకు అవసరమైన జనరిక్‌ ఔషధాల్లో 40 శాతం ఉత్పాదన భారత్‌లోనే జరుగుతోంది. విద్యుత్‌ వాహనాలు, సోలార్‌ సెల్స్‌ లాంటి అంశాల్లోనూ ఇదే జరగాలన్నది మా అభిలాష. గతేడాది మా మధ్య పెండింగ్‌లో ఉన్న ఏడు వాణిజ్య సంఘర్షణలను డబ్ల్యూటీవో వేదికగా పరిష్కరించుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాదీ అదే వేగం. ఇరు దేశాల మధ్య మంచి సౌహార్ద సంబంధాలకు అవకాశముంది. కొన్ని కీలక విషయాల్లో రెండింటి మధ్య సారూప్యత, సమన్వయం ఉన్నాయి. అందుకే మా కంపెనీలు ఇక్కడ దృష్టి పెడుతున్నాయి.  

అమెరికా వీసాల జారీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీసాల జారీలో జాప్యమవుతోంది  

జ: తొలిసారి జారీ చేసే బీ1/బీ2 వీసాలు మినహా మిగతా అన్ని వీసాల జారీలోనూ జాప్యాన్ని దాదాపుగా నివారించగలిగాం. బీ1/బీ2ల జారీలోనూ జాప్యాన్ని కనీసం 75 శాతానికిపైగా కుదించగలిగాం. వారాంతాల్లోనూ మా ఉద్యోగులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. భారత్‌లో వీసాలకు డిమాండ్‌ ఇంకా ఎక్కువగానే ఉంటోంది. తగినంత మంది ఉద్యోగుల నియామకం ఓ సవాలుగా ఉంది. అయినా మరిన్ని ఎక్కువ వీసాల జారీకి కృషి చేస్తాం.

ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా చార్మినార్‌ వద్ద ఎరిక్‌ గార్సెట్టి

మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల  విషయంలో మీ అభిప్రాయం ఏమిటి   

జ: వివిధ అంశాలను ఉభయ దేశాలు సంయుక్త కృషితో సాధిస్తే ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయి. అవి ఏమిటనే విషయంలో ఇరుపక్షాలకూ స్పష్టమైన అవగాహన ఉంది. వాటిని సాధించాలన్న కోరిక కూడా బలంగా ఉంది. ఉభయ దేశాల మధ్య బంధంతో ఒనగూరే ప్రయోజనాలు అమెరికా ప్లస్‌ ఇండియా అన్నట్టుగా కాదు... బహుముఖంగా ఉంటాయి. ఇలా ఉమ్మడిగా కృషి చేస్తే ఇరు దేశాలకే కాదు.. ప్రపంచానికే లాభసాటిగా పరిణమిస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.


అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు మునుపటి కన్నా బాగా విస్తృతం అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశమే హద్దు అన్నంతగా విరాజిల్లుతున్నాయి.


అమెరికా కంపెనీలు భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంతటి విశాలమైన, వైవిధ్యమైన దేశంలో అవకాశాలకు కొదవలేకపోగా అవెంతోఆకర్షణీయంగా  కూడా ఉన్నాయి.

- ఎరిక్‌ గార్సెట్టి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు